ద్రోహి 2019.....!

Update: 2018-05-01 15:30 GMT

వంచన..మోసం..దగా ...కుట్ర ..కుమ్మక్కు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గడచిన కొన్ని రోజులుగా హోరెత్తిస్తున్న పదాలు..ఇంకా రానున్న రోజుల్లో మరికొన్ని కొత్త టైటిల్స్ బయటికి వస్తాయి. కొత్త తిట్లను అన్వేషించడానికి భాషావేత్తల సహాయసహకారాలూ తీసుకునే అవకాశం ఉంది. సృజనాత్మక సంస్థలకు నిరసన నినాదాలు, ఆరోపణల పదకల్పనలపై కాంట్రాక్టులూ దక్కవచ్చు. తిట్లకు తెలుగు రాజకీయాల్లో కొత్త డిమాండు వచ్చేసింది. తెలుగుదేశం, వైఎస్సార్ పార్టీలు రెండూ ఈ విషయంలో పోటాపోటీ తలపడుతున్నాయి. నిరసనలు, ప్రతినిరసనలు, ఉద్యమాలు, ప్రత్యుద్యమాలు, ఆందోళనలు, ప్రతి ఆందోళనలు..అన్నిటా ఒకటే కామన్ అజెండా. ప్రత్యర్థిని దుమ్మెత్తి పోయడం, తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని చాటు కోవడం ద్విముఖ లక్ష్యాలుగా సభలు, సమావేశాలు సాగిపోతున్నాయి. తమ తప్పును కప్పి పుచ్చుకుంటూ ఎదుటివాళ్ల తప్పునే పదింతలు చేసి చూపించడమనే ప్రక్రియ జోరెత్తుతోంది. దీంతో వీరు లేవనెత్తాలనుకుంటున్న డిమాండ్ మరుగునపడి, పరస్పరం బురద జల్లుకునే పక్తు రాజకీయ విన్యాసంగా మిగిలిపోతోంది. ప్రజల్లో నవ్వులాటకు దారితీస్తోంది. ప్రత్యేక హోదా అంశం పక్కదారి పడుతోంది.

ఆత్మరక్షణకు ఆలంబన...

తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా విషయాన్ని ఈమధ్య కాలంలోనే తలకెత్తుకుంది. ప్యాకేజీ, ఆర్థిక సాయం వంటి అంశాలకే నిన్నామొన్నటివరకూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. సాంకేతికంగా ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్యాకేజీ రూపంలో నిధులు ఇస్తే వాటిని వివిధ రూపాల్లో వినియోగించుకోవచ్చని ప్రభుత్వం భావించింది. అదే ప్రత్యేకహోదా ఇచ్చేస్తే, పారిశ్రామిక వేత్తలకు ఉపయోగకరమే తప్ప అప్పటికప్పుడు రాష్ట్రానికి వచ్చే అదనపు ఆదాయం ఏమీ ఉండదు. పరిశ్రమలు వచ్చి అభివృద్ధి చెంది అవి ఉపాధి వనరులుగా , ఉత్పత్తి సాధనాలుగా మారినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అందుకు చాలా సమయం పడుతుంది. కేవలం అయిదేళ్లకే ప్రత్యేక హోదా పరిమితమంటే పారిశ్రామిక వేత్తలూ పెద్దగా ముందుకు రారు. వ్యవస్థాపన, ఉత్పత్తి కే ఆ సమయం సరిపోతుంది. ఆ తర్వాత అన్ని పన్నులు అందరితో పాటు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకహోదాతో ఏం ఒరుగుతుంది? ఈశాన్య రాష్ట్రాలు ముందుకెళ్లాయా? అంటూ ప్రజలను సర్దుబాటు చేసేందుకు , వారి దృష్టి ప్రత్యేక హోదా వైపు ఆలోచించకుండా చేసేందుకు తెలుగుదేశం మూడున్నరేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నించింది. హోదా బదులు డబ్బులు లెక్కకట్టి తెచ్చుకుంటే వివిధ అవసరాలకు వాడేయొచ్చని అత్యాశకు పోయింది . ప్యాకేజీ ప్రకటించి కేంద్రం చేతులు దులిపేసుకుంది. ఆచరణలో నత్తనడకను అనుసరించింది. రెంటికీ చెడ్డ రేవడిలా మారింది రాష్ట్రం పరిస్థితి. కనీసం హోదా ప్రకటిస్తే ఆత్మసంతృప్తి అయినా మిగిలి ఉండేది. ఈ బలహీనతను కనిపెట్టిన వైసీపీ దాడి పెంచింది. ప్రత్యేక హోదాను ప్రధానాంశంగా చేస్తూ ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టింది. హోదాతో ఉద్యోగాలు వచ్చి ఉండేవంటూ యువతను లక్ష్యంగా చేసుకుంటూ ప్రచారం ప్రారంభించింది. దీంతో మధ్యతరగతి , పేద వర్గాల తల్లిదండ్రులూ వైసీపీ వైపు ఆకర్షితులు కావడం మొదలు పెట్టారు. దీనికి జగన్ పాదయాత్ర కూడా దోహదం చేయడం ప్రారంభించింది. జనవరి నెల నుంచే ఈమార్పులు వివిధ సర్వేల్లో తెలుగుదేశానికి తెలియవచ్చాయి. దీంతో సెంటిమెంటు తీవ్రత పెరిగితే టీడీపీ కి ఎదురీత తప్పదని గ్రహించారు. జనవరి నెలలోనే బీజేపీకి దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో 12 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి పొందే అవకాశం ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా హోదా డిమాండుతో టీడీపీ ఆత్మరక్షణ పొందాలనే దిశలో ఉద్యమాలు మొదలు పెట్టింది. 2014 ఎన్నికల్లో గెలిచిన తాను రాష్ట్రం దృష్టిలో ద్రోహిగా మిగిలిపోకుండా ఆముద్ర బీజేపీపై పడేలా ప్లాన్ చేసింది.

వైసీపీ వన్ సైడ్ ...

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వన్ సైడ్ విమర్శలతో దూసుకుపోతోంది. తెలుగుదేశం ఆందోళన చేపట్టగానే దానికి ప్రతి ఆందోళన రూపకల్పన చేస్తోంది. టీడీపీ కూడా ఇదే తరహాలో కౌంటర్ ఉద్యమాలు చేపడుతోంది. టీడీపీ చేసిన ధర్మపోరాటం వైసీపీ చేపట్టిన నయవంచన వ్యతిరేక దీక్షలు ఇందుకు ఉదాహరణలు. ఈ పార్టీల రాజకీయం తప్ప ప్రత్యేకహోదా డిమాండు పలచబడిపోయింది. అందులోనూ బీజేపీని విమర్శించకుండా సన్నాయి నొక్కులు నొక్కడం ద్వారా వైసీపీ తన చిత్తశుద్ది లోపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో బీజేపీ కి వైసీపీని అంటకట్టే అవకాశం ఏర్పడుతోంది. మొత్తమ్మీద జగన్ పార్టీ టీడీపీపైనే పోరాట పంథా కనబరుస్తోంది. కేంద్రం పై ఉదాసీనంగా కనిపిస్తోంది. ఈ బలహీనతను బయటపెట్టడం ద్వారా ప్రజలకు పంఖా పార్టీకి దూరం పెంచాలని టీడీపీ శతప్రయత్నాలు చేస్తోంది. మొత్తమ్మీద రెండు ప్రధాన పార్టీలకు, ప్రజలకు మద్య క్రెడిబిలిటీ గ్యాప్ ఏర్పడింది. దీనిని పూడ్చుకోకుండా అనవసర రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇస్తే ఎన్నికల నాటికే పార్టీల పట్ల ప్రజల్లో ఆసక్తి పోతుంది. తొందరపడి ముందుగానే కూస్తున్న ఈ రాజకీయ కోయిలలు ఎన్నికల వేడిని రగిలించగలిగాయి. కానీ దీర్ఘకాలం దీనిని కొనసాగించడం చాలా కష్టం. వచ్చే ఏడాది మార్చిలో నిర్దిష్ట సమయంలోనే ఎన్నికలు పెడితే ఇంకా దాదాపు పదినెలల సమయం ఉంది. ఇంతకాలం పాటు ఒకే డిమాండుపై ప్రజలను నిలబెట్టి ఆకట్టుకోవడం దుర్లభం. ఇప్పటికే ప్రజల్లో ప్రత్యేకహోదా విషయంలో పెద్దగా ఆసక్తి వ్యక్తం కావడం లేదని కొందరు చెబుతున్నారు. ఈ డిమాండును విడిచిపెట్టకుండా తొలి నుంచి వినిపిస్తున్న వైసీపికి ఎంతో కొంత అడ్వాంటేజీ ఉంటుంది. తాజాగా ఈ నినాదం ఎత్తుకున్న తెలుగుదేశానికి ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చనేది రాజకీయ పరిశీలకుల అంచనా. సెంటిమెంటు అస్త్రం రెండు పక్షాలనూ రోడ్డెక్కేలా చేసింది. కానీ అది ఎన్నికల సమయానికి వికటించనూ వచ్చు. లేకపోతే మరిన్ని కొత్త అంశాలు వచ్చి దీనిని పక్కకు నెట్టేయవచ్చు. పాడిందే పాటరా అన్నట్లుగా పదేపదే వినడంతో ప్రజలకు విసుగెత్తి పోనూ వచ్చు. ఏతావాతా ప్రజాతీర్పుతో ద్రోహి 2019 ని తేల్చే పనిలో పడ్డాయి ఈ రెండు పార్టీలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News