మెగా కలయికలో మిస్టరీ ఇదే

వైఎస్ కుటుంబానికి మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటినుంచి సఖ్యత లేదు సమరం లేదు. మధ్యలో యువరాజ్యం అధినేతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ పంచెలు ఊడగొట్టేస్తాం [more]

Update: 2019-10-14 05:00 GMT

వైఎస్ కుటుంబానికి మెగాస్టార్ ఫ్యామిలీకి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన నాటినుంచి సఖ్యత లేదు సమరం లేదు. మధ్యలో యువరాజ్యం అధినేతగా అప్పట్లో పవన్ కళ్యాణ్ పంచెలు ఊడగొట్టేస్తాం అన్న తరువాత వీరిమధ్య దూరమే పెరిగింది. కానీ వైఎస్ మరణం తరువాత మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక బాంబు పేల్చారు. 2009 ఎన్నికలు ముగిశాకా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని సోనియా గాంధీ కి వైఎస్ రాసిన లేఖను ఉండవల్లి విడుదల చేసి సంచలనం సృష్ట్టించారు. వైఎస్ ఆ లేఖలో కోరుకున్న విధంగానే సోనియా చిరంజీవి స్థాపించిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడం అందుకు ప్రతిగా మెగాస్టార్ కి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడం చకచకా జరిగిపోయాయి. ఈ పరిణామాల క్రమంలోనే జగన్ కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టి వైఎస్సాఆర్ పార్టీ పెట్టడం కడప నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవడం అంతే వేగంగా సంభవించిన పరిణామాలు.

జగన్ తో టచ్ లో లేని సినీ వర్గాలు….

విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయనతో సినీ వర్గాలు దూరంగానే వున్నాయి. దీనికి కారణాలు అనేకం వున్నా జగన్ సైతం నిన్నమొన్నటివరకు కలుపుకుని పోయే ప్రయత్నాలు ఏమి చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో రెండే కులాల ఆధిపత్యం గట్టిగా సాగుతుంది. అది కమ్మ, కాపు సామాజికవర్గాలు మాత్రమే. ఇందులో మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో సగభాగాన్ని శాసిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు గ్రూప్ లు జగన్ సర్కార్ అధికారంలో వున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. దాంతో జగన్ ఒక వర్గాన్ని అయినా దగ్గర చేసుకునే ప్రయత్నం మంచిదన్న పార్టీ వ్యూహకర్తల ఆలోచనతో ఏకీభవించి చిరంజీవి వర్గాన్ని దగ్గర చేసుకునే అవకాశాలను కదిపి చూశారు. సైరా సినిమా అనుకోకుండా వీరిద్దరి సాన్నిహిత్యానికి బీజం పడేలా చేసింది.

సైరా కలిపింది ఇద్దరిని …

ఈ సినిమా స్వయంగా రామ్ చరణ్ నిర్మించి విడుదల చేయడం. అందులోను భారీ బడ్జెట్ తో తీయడంతో టికెట్ ధరల అంశంలో ప్రభుత్వ సహకారం తప్పనిసరి అయ్యింది. దీనికి వైసిపి అధినేత జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరువురి మధ్య స్నేహ పరిమళం వెల్లివిరిసింది. భవిష్యత్తులో కూడా మెగా ఫ్యామిలీ నుంచి భారీ సినిమాలు విడుదల కానున్నాయి. జనసేన అధినేత పవన్ దూకుడుతో మెగా ఫ్యామిలీకి ఎపి లో చుక్కెదురయ్యే వాతావరణం నిన్నటివరకు వుంది. దీనికి తెరదించాలని వివాదరహితుడిగా పేరున్న చిరంజీవి తానే ఒక అడుగు ముందుకు వేశారు.

ఒకరి అవసరం మరొకరికి……

తనయుడు రామ్ చరణ్ తో మర్యాదపూర్వకంగా జగన్ ను కలవాలన్న ఆయన ఆలోచనకు థర్టీ ఇయర్స్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి వంటివారు సై అనడంతో సైరా ముఖ్యమంత్రి తో భేటీకి సకల ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సైరా చిత్రం చూడాలని స్వయంగా ఆహ్వానించడానికి అని పైకి మెగాస్టార్ వర్గీయులు చెబుతున్నా రాజకీయ పరిణామాలపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో జనసేన దూకుడు కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలంటే చిరంజీవి సహకారం జగన్ కి చాలా అవసరం. అలాగే తాము నిర్మించిన లేక మెగా కుటుంబ సభ్యులు నటించే చిత్రాలకు రాయితీలు పొందాలన్నా ఎపి సర్కార్ ఆశీస్సులు వీరికి అవసరం. ఇలా ఒకరి అవసరం మరొకరికి ఉండటంతో ఉభయకుశలోపరిగా జగన్ – చిరంజీవి లంచ్ భేటీని అంతా భావిస్తున్నారు.

Tags:    

Similar News