అదే కొలబద్ద కాదేమో..?

ఎందుకో వంద రోజులంటే అంత మోజు. ఒక సినిమాకు వంద రోజులు అంటే మహా గొప్ప. మనిషి వందేళ్ళు బతకడం ఇంకా గొప్ప. వంద మార్కులు సాధించి [more]

Update: 2019-09-04 06:30 GMT

ఎందుకో వంద రోజులంటే అంత మోజు. ఒక సినిమాకు వంద రోజులు అంటే మహా గొప్ప. మనిషి వందేళ్ళు బతకడం ఇంకా గొప్ప. వంద మార్కులు సాధించి విద్యార్ధి పరీక్ష పాస్ అవడం కూడా గొప్ప. ఒక పెళ్ళి నూరేళ్ళు సవ్యంగా సాగడం మరీ గొప్ప. ఇలా వందతో అనుబంధం చాలానే ఉంది. అయితే రాజకీయాల్లో వందకు విలువ ఎంత. వంద రోజుల పాలన అంటూ కొలమానం వేసి మార్కులు చెప్పేయడానికి ఈ సమయం సరిపోతుందా అంటే బొత్తిగా కాదు అనే అంటున్నారు రాజకీయ పండితులు. వందరోజులు అంటే మూడు నెలలు మాత్రమే. ఒక పార్టీకి అరవై నెలల పాటు పాలన చేయడానికి అధికారం ఇస్తే మూడు నెలలకే పాస్, ఫెయిల్ అని చెప్పడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఇక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం, దేశం ఉన్నపుడు ఈ వంద రోజుల లెక్క మరీ దారుణమని అంటున్న వారూ ఉన్నారు. ఏపీలో చూస్తే కొత్తగానే అంతా ఉంది. ఇప్పటికీ రాజధాని లేదు, అభివృధ్ధి కూడా ఏమీ లేదు. కొత్త సర్కార్ వైసీపీ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో అధ్బుతం చేసి చూపించమంటే సాధ్యమయ్యేపనేనా.

ఖాళీ ఖజానా వారసత్వం….

అయిదేళ్ల చంద్రబాబు పాలన తరువాత జగన్ ఆయన వారసుడిగా అధికారంలోకి రావడం బాధాకరమే. నిజానికి జనం వైఎస్సార్ వారసుడిగా చూసి ఓట్లు వేశారు. వైఎస్సార్ లాగానే పాలించాలని కూడా కోరుకుంటున్నారు. బంపర్ మెజారిటీ వెనక జనం భారీ ఆశలు అలాగే కనిపిస్తున్నాయి. అయితే జగన్ ఇక్కడ సీఎం సీట్లో కూర్చున్నది మాత్రం చంద్రబాబు వారసుడిగా. అంటే ఆయన తరువాత సీటు ఎక్కిన జగన్ కి నాటి ప్రభుత్వం చేసినా పాపాలు శాపాలుగా పరిణమించాయి. కేంద్రంతో నాలుగేళ్ళు దోస్తీ చేసి బాగానే నిధులు రాబట్టారు. దాన్ని తన ఇష్టం వచ్చినట్లుగా వాడేసుకున్నారు. దాంతో కేంద్రం ఇపుడు ఏపీపై అనుమానపు చూపులు చూస్తోంది. మరో వైపు అప్పులను సైతం దొరికిన కాడికి చేసేశారు. బడాయి కబుర్లు చెప్పి మరీ అన్ని ఏజెన్సీల నుంచి తెచ్చేశారు. దాంతో అసలు నిజాలు బయటపడ్డాక ఏపీకి అప్పు ఇవ్వలేమని ప్రపంచ బ్యాంక్ వంటివే వెనక్కిపోతున్నాయి. ఈ నేపధ్యానికి తోడు, అవినీతి, అస్మదీయులకు భారీగా కాంట్రాక్టులు కట్టబెట్టి కమిషన్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ దారిన పెట్టి పాలన చేయాలంటే వంద రోజులు చాలా తక్కువ సమయమే.

ఏడాది చూడండంటున్న విజయమ్మ…

జగన్ ఎంత కొడుకు అయినా తనకున్న రాజకీయ అనుభవంతో వైఎస్ విజయమ్మ ఇదే మాట చెప్పాలనుకోవాలి. చంద్రబాబు సర్వనాశనం చేసిన తరువాత ఏపీ పాలన జగన్ చేతిలోకి వచ్చింది. ఇపుడు ప్రతీ దాన్ని గాడిలో పెట్టే పనిలో జగన్ ఉన్నారు, ఆయనకు కచ్చితంగా ఏడాది పాటు అయినా సమయం ఇస్తే మంచి పాలన ఇస్తారు, తనను తాను రుజువు చేస్తుకుంటారని ఆమె అంటున్నారు. ఇక అయిదేళ్ల తరువాత తిరిగి జనం వద్దకు వెళ్ళినపుడు తాను ఇచ్చిన అన్ని ఎన్నికల హామీలను పూర్తి చేసి మాత్రమే జగన్ ఓట్లు అడుగుతారని కూడా ఆమె హమీ ఇస్తున్నారు. విజయమ్మ చెప్పినా మరొకరు అన్నా కూడా జగన్ ప్రస్తుతం ఏపీ అనే ఇల్లుని చక్కదిద్దే పనిలో ఉన్నారు. దాంతో ఏపీని ఒక్కసారి చూస్తే చిందరవందరగా కనిపిస్తోంది. మరి జగన్ మార్క్ పాలన చూడాలంటే, ఆ ఫలితాలు రావాలంటే కచ్చితంగా కొంత టైం అవసరమేమో. ఇప్పటికైతే వంద రోజుల్లో జగన్ ఫెయిల్ అని టీడీపీ తమ్ముళ్లు అన్నట్లుగా రాజకీయ విమర్శలు చేయడం సులువే. కానీ వాస్తవాలను బేరీజు వేసుకుంటే మాత్రం జగన్ పాలన తెలుసుకోవడానికి మరింతకాలం వేచి ఉండడం అందరికీ అవసరమే.

Tags:    

Similar News