స్వేచ్ఛ లేనట్లుగా ఉందే

రాష్ట్రంలో వరదలు ముంచెత్తిన సమయంలో… ప్రభుత్వ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉండటం, అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించకపోవడం ఈ వివాదానికి కారణం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి [more]

Update: 2019-08-18 06:30 GMT

రాష్ట్రంలో వరదలు ముంచెత్తిన సమయంలో… ప్రభుత్వ అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉండటం, అధికార యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించకపోవడం ఈ వివాదానికి కారణం. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు దాటింది. అదే సమయంలో పాలనలో కుదురుకునే విషయంలోనే తడబడుతోంది. ఇక వరదల విషయంలో బురద రాజకీయం ఎక్కువ నడుస్తోంది. విపత్తులు, వైపరీత్యాల విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో జలాశయాలు నిండి కృష్ణా, గోదావరి నదులు సముద్రం వైపు పరిగెడుతుంటే నదీ జలాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించింది. కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వమే బాగుంది అనిపించేలా అధికారులు వ్యవహరిస్తున్నారు. నీటి విడుదల, వరద ముప్పు వంటి విషయాలను ప్రజలకు చేరువ చేయడంలో కూడా పట్టనట్టు వ్యవహరించారు.

మునిగిన తర్వాత కానీ….

ఇక రాజధానిలో ఉన్న మంత్రులకు కృష్ణా నది వరదల గురించి బెజవాడ మునిగిన తర్వాత కానీ గుర్తుకు రాలేదు. వరదల సమయంలో ప్రభుత్వాలు చేయగలిగింది కేవలం ముందస్తు అప్రమత్తం చేయడమే ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో అటు ఇరిగేషన్ అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు ఎవరికి వారు తమ పనుల్లో మునిగి పోయారు. ప్రతి పక్షాలు గొడవ చేసే వరకు అధికార పక్షమే అవకాశం కల్పించింది. సహాయ శిబిరాలు ఏర్పాటు చేయడం, కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమై ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం కల్పించింది.

మంత్రులు నిర్ణయాలు….

వరదల సమయంలో ముఖ్యమంత్రి జగన్ దేశంలో లేరు, ఆయన విదేశాల నుంచి సమీక్ష నిర్వహిస్తున్నారనే వార్త కూడా ఎక్కడా కనిపించలేదు. సీఎం సొంత పత్రికలో వరద వచ్చిన నాలుగు రోజుల తర్వాత ఈ వార్త కనిపించింది. వరద ముప్పు విషయంలో గోదావరి వరదల సమయంలోను, కృష్ణా వరదల సమయంలోను ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలాగే కనిపించింది. అధికారంలో ఉన్నామనే ధీమాతో ఇలా ప్రవర్తిస్తున్నారో, ఏమి చేయాలో తెలియక ఉన్నారో, అధికారులు సహకరించకపోవడం వల్ల ఇలా జరిగిందో ఖచ్చితంగా తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం మంత్రులు స్వయంగా, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు మాత్రం లేవు. ఎవరికి వారు ఎందుకొచ్చిన గొడవ అనుకునే వాతావరణంలో జనం ఇలా మునగడం సహజంగా కనిపిస్తుంది.

Tags:    

Similar News