లాక్కుంటే మండదా?

ఇచ్చింది లాక్కుంటే ఎవరికైనా మండుతుంది. ఏపీ లో ఇప్పుడు పెన్షన్ ల రద్దు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పింఛన్ పోయినవారు బాధతో చేస్తున్న ప్రచారం అధికారపార్టీ [more]

Update: 2020-02-12 14:30 GMT

ఇచ్చింది లాక్కుంటే ఎవరికైనా మండుతుంది. ఏపీ లో ఇప్పుడు పెన్షన్ ల రద్దు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. పింఛన్ పోయినవారు బాధతో చేస్తున్న ప్రచారం అధికారపార్టీ ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. అసలు లెక్కేస్తే అర్హులు ఎవరు అంటూ పింఛన్ కోల్పోయినవారు చేసే ఆందోళన ఇప్పుడు విపక్షానికి పెద్ద ఆయుధమే కానుంది. వాస్తవానికి విపక్షం అమరావతి ఉద్యమం పై ప్రధానంగా దృష్టి పెట్టడంతో అధికారపార్టీ ఎంతోకొంత ఊపిరి పీల్చుకుంటుంది కానీ లేకపోతే పింఛన్ రద్దు అయిన బాధితులతో టిడిపి ఉద్యమాలు చేస్తే అధికారపార్టీ కి ఇక్కట్లు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

గుదిబండగా మారిందా ?

ప్రస్తుతం పింఛన్లు ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ పోవడమే కాదు వారికి ఇచ్చే మొత్తాన్ని 75 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు, ఆ తరువాత రెండువేలరూపాయలు ప్రస్తుతం రెండువేల రెండు వందల యాభై రూపాయలు వరకు ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చాయి. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఎంతోకొంత బాసటగా నిలవాలని శ్రీకారం చుట్టబడిన ఈ పథకం రాజకీయ పార్టీలకు ఓటుబ్యాంక్ గా కనిపిస్తుంది. దాంతో పోటాపోటీగా అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన పార్టీలు ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఇలా చేయడంతో ఖజానాపై మోయలేని భారం పడుతుంది. అయితే ఈ దశలో జగన్ సర్కార్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. అనర్హులైన వారిని గుర్తించి పెన్షన్ లు నిర్మొహమాటంగా తొలగించడం మొదలు పెట్టింది. దాంతో తేనే తుట్టె కదిలినట్లే అయ్యింది.

అర్హత ఏమిటి ?

విద్యుత్ బిల్లు అధికంగా చెల్లించే ఆదాయ వర్గాలను గుర్తించి వారి పెన్షన్ లను తొలగిస్తున్నారు. సొంత ఇల్లు 70 గజాలు దాటి వుండే వారు, కార్లు వున్నవారిని గుర్తించి చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఆధార్, పాన్ కార్డు ల ద్వారా వారి ఆస్తిపాస్తుల వివరాలు పూర్తిగా యంత్రాంగం పరిశీలించి ఈ చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే ఏపీ లో తెల్లరేషన్ కార్డు ల జారీ కూడా అస్థవ్యస్తంగానే ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా జారీ చేసేసారు. ప్రతి సంక్షేమ పథకానికి తెల్లరేషన్ కార్డు అన్నది ప్రాతిపదికగా మారింది. దీన్ని కూడా ప్రక్షాళన చేయడానికి జగన్ సర్కార్ రంగంలోకి గ్రామ వాలంటీర్లను ప్రయోగిస్తుందన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. దాంతో ఇన్నాళ్లు ఈ కార్డుల ద్వారా అన్ని సౌకర్యాలను పొందుతున్నవారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రద్దు అయినవాళ్ళు, అవుతాయని ఆందోళన చెందుతున్న వారు సర్కార్ తీరుపై దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టేశారు. కొత్తగా ప్రభుత్వం ఇవ్వకపోయినా ఫర్వాలేదు కానీ ఇచ్చింది పీకేస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను ఇప్పటికే ప్రభుత్వం గమనించింది. దాంతో వాలంటీర్లతో రీ సర్వే చేయించి వీలైనంత మందివి పునరుద్ధరించాలని డిసైడ్ అయ్యినట్లు సర్కార్ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ చర్యలు అధికారపార్టీకి ఉపశమనం కలిగిస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News