గెలుపు గాలివాటం కాకూడదనే

వైసీపీకి ఉత్తరాంధ్ర బాగానే చిక్కింది. గతంలో ఎవరూ చేయని ఫీట్ ని చేసి మరీ మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ తాజా ఎన్నికల్లో గెలుచుకుంది. అందులో విజయనగరం [more]

Update: 2019-08-14 12:30 GMT

వైసీపీకి ఉత్తరాంధ్ర బాగానే చిక్కింది. గతంలో ఎవరూ చేయని ఫీట్ ని చేసి మరీ మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ తాజా ఎన్నికల్లో గెలుచుకుంది. అందులో విజయనగరం జిల్లాను స్వీప్ చేసి పారేసింది. ఇక శ్రీకాకుళం పది ఎమ్మెల్యే సీట్లు ఉంటే రెండు తప్ప అన్నీ గెలుచుకుంది. విశాఖలో పదిహేను అసెంబ్లీ ఉంటే నాలుగు తప్ప మిగిలినవన్నీ దక్కించుకుంది. ఇక ఎంపీ సీట్లు అయిదు ఉంటే నాలుగు గెలుచుకుని సత్తా చాటింది. ఇలా గతంలో అన్న నందమూరి కానీ, వైఎస్సార్ కానీ చేయలేకపోయారనే చెప్పాలి. అంతటి ప్రభంజనం జగన్ కి వీచింది. దాంతో జగన్ ఇపుడు ఉత్తరాంధ్రలో మరింత పట్టు పెంచుకోవడానికి చూస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో లభించిన విజయాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దాని కోసం చేతిలో ఉన్న అధికారాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నారు.

పట్టున్న వారికి పెద్దపీట….

ఉత్తరాంధ్రాలో పట్టున్న నేతలను జగన్ జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నారు. వారికి పిలిచి మరీ పదవులు ఇస్తున్నారు. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉందో చూసి మరీ పటిష్టం చేసేందుకు రంగం సిధ్ధం చేస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లైతే సిక్కోలుకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గానికి చెందిన ఆమె వృత్తి రీత్యా వైద్యురాలు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ ఎన్నికల్లో సీనియర్ నేత ఎర్రన్నాయుడు చేతిలో ఓటమి పాలు అయ్యారు. 2009 ఎన్నికల నాటికి ఆమె బలం పుంజుకుని అదే ఎర్రన్నాయుడిని ఓడించి రికార్డ్ సృష్టించారు. అంతే కాదు కేంద్రంలో కమ్యూనికేషన్ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. ఆమె ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఆమెకు జగన్ ఆ టైంలో టికెట్ ఇవ్వలేకపోయారు. ఇపుడు ఆమె సేవలను ఉపయోగించుకోవాలని జగన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని ఆమెకు జగన్ కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే జిల్లాలో ఆమె బలమైన నేతగా వైసీపీకి ఉంటారు. అంతే కాదు ఆమె సేవలను, పరిచయాలని ఢిల్లీ స్థాయిలో కూడా ఉపయోగించుకోవాలని జగన్ భావిస్తున్నారట.

బీసీలను చేరదీసే యత్నం….

వైసీపీని అన్ని వర్గాల పార్టీగా చేయడంతో జగన్ తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అది గాలివాటం గెలుపు కారాదని జగన్ గట్టిగా భావిస్తున్నారుట. అందువల్ల ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలను చేరదీయాలన్నది ది జగన్ ఆలోచనగా ఉంది. ఈ క్రమంలో తూర్పు కాపులు, యాదవులు, కాళింగులు, గవరలు, వెలమలు, కొండ రెడ్లు వంటి కులాలకు ప్రభుత్వ పదవులు ఇవ్వాలని జగన్ పధకం సిధ్ధం చేశారు. వారిని సమాదరించడం ద్వారా ఎప్పటికీ వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు పట్టుకొమ్మలని చాటిచెప్పాలన్నది జగన్ ఉద్దేశ్యంగా ఉంది. నిజానికి అన్న నందమూరి పార్టీ పెట్టిన తరువాత ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటలుగా మారాయి. ఆ సంప్రదాయాన్ని అలాగే చంద్రబాబు కొనసాగిస్తూ వస్తున్నారు. బీసీలు సైతం టీడీపీకి కట్టుబడి ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో టీడీపీలో మారిన రాజకీయ విధానాలతో కినిసిన బీసీలు వైసీపీ వైపు మళ్లారు. దాంతో జగన్ ఆ అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల్లో 80 శాతం పైగా ఉన్న బీసీలకు తగిన న్యాయం చేసేందుకు వైసీపీ ఇపుడు రెడీ అవుతోంది. ఈ ప్రయత్నాలు విజయవంతం అయితే మాత్రం టీడీపీ కంచుకోటకు శాశ్వతంగా తెర పడిపోతుందన్నది కఠిన వాస్తవం.

Tags:    

Similar News