ఎండ్ కార్డు వేసేశారా?

రాష్ట్ర రాజధాని అమరావతి భవితవ్యం ఏం కాబోతోందనే ప్రశ్నకు మరో ఆరువారాలపాటు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. అమరావతితో పాటు రాష్ట్రం సమ్మిళితాభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై నిపుణుల కమిటీని [more]

Update: 2019-09-14 15:30 GMT

రాష్ట్ర రాజధాని అమరావతి భవితవ్యం ఏం కాబోతోందనే ప్రశ్నకు మరో ఆరువారాలపాటు ఎదురుచూపులు తప్పకపోవచ్చు. అమరావతితో పాటు రాష్ట్రం సమ్మిళితాభివృద్ధి ఎలా ఉండాలనే అంశంపై నిపుణుల కమిటీని నియమించింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతిపాదిత రాజధానిపై వైసీపీకి భిన్నాభిప్రాయాలున్న మాట జగమెరిగిన సత్యమే. కేంద్రీకృత అభివృద్ధి నమూనాకు బదులుగా మొత్తం సర్కారీ వ్యవస్థలను రాష్ట్రమంతటా విస్తరించాలనే కోణంలో ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇది పెద్దగా తప్పుపట్టాల్సిన అంశం కాదు. కానీ దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఫలితాల కోసం ఎక్కువ కాలం ఎదురుచూడాలి. కానీ భవిష్యత్తులో ప్రాంతీయపరమైన సమతుల్యత సాధ్యమవుతుంది. తక్షణ ఫలితాలు, ఆదాయ పెంపుదల లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి నమూనాను సిద్దం చేసింది. ఈ మోడల్ ను ప్రస్తుత ప్రభుత్వం దాదాపు పక్కనపెట్టేసినట్లే. అయితే ఆ విషయాన్ని నేరుగా చెప్పడం లేదు. ఫీలర్ల రూపంలో కొంత సమాచారాన్ని ప్రజల్లోకి పంపి చర్చకు పెడుతోంది. తాజాగా కమిటీ నియామకంతో సందిగ్ధతకు ఎండ్ కార్డ్ వేసేందుకు రంగం సిద్దం చేసినట్లే చెప్పుకోవాలి.

సర్కారీ భావనే బొత్స మాట…

ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు పట్టణాభివ్రుద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతి పై దుమారానికి తెర తీశారు. అమరావతిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి శాస్త్రీయ అధ్యయనం లేకుండా టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ఎంపిక చేసిందని విమర్శించారు. అసలు అమరావతి కేపిటల్ పై గెజిట్ విడుదల చేయలేదని కూడా చెప్పేశారు. మునిసిపల్ మంత్రి ప్రకటనతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రజల్లోనూ కొంత సందిగ్ధత, అయోమయం నెలకొన్నాయి. ప్రభుత్వానికి రాజధాని అమరావతికి సంబంధించి వేరే మోడల్ పై ఆలోచన లేకపోతే మునిసిపల్ మంత్రి ప్రకటనపై ముఖ్యమంత్రి స్థాయిలో వివరణ ఇచ్చి ఉండేవారు. రాష్ట్రంలో రాజధాని అంశం రాజకీయ రంగు పులుముకుంటున్నప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి ఎటువంటి వివరణ లేకపోవడాన్ని బట్టి చూస్తే సర్కారులో ఏదో జరుగుతోందనే సందేహం బలపడింది. తాజాగా కమిటీ నియామకం అందుకు దృష్టాంతంగానే చెప్పాలి. రాజధానిని ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం ముందుకు తీసుకెళ్లే యోచన ఉంటే అసలు కమిటీ అవసరం ఉండేదికాదు. ప్రభుత్వానికి వేరే రకమైన ఆలోచనలు ఉండబట్టే నిపుణుల కమిటీకి తెర తీశారని చెప్పుకోవచ్చు.

సీఎం చిన్న చూపు…

చంద్రబాబు నాయుడి ఆలోచనల స్థాయి రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిశ్చితాభిప్రాయం. అందులోనూ అభివృద్ధినంతటినీ ఒకే చోట కేంద్రీకరిస్తే మళ్లీ ప్రాంతీయ ఉద్యమాలకు ఆజ్యంపోసినట్లవుతుంది. రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో ఇప్పటికే తమకు అన్యాయం జరుగుతోందనే భావన ఏర్పడింది. దీనిని మొగ్గలోనే తుంచేయాలి. అందువల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ప్రభుత్వ ప్రాజెక్టులు, న్యాయ వ్యవస్థను వికేంద్రీకరించాలనేది జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. ఇందుకు అనుగుణంగానే రాజధాని అమరావతి ప్రణాళికను సవరించుకునేందుకు సిద్ధమవుతున్నారు. రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు దూకుడు ప్రదర్శించారు. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు. అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వైసీపీ తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ప్రకటించింది. తాము అధికారంలోకి రావడంతో ప్లాన్ ను సవరించేందుకు సిద్ధమవుతోంది.

నిపుణుల ముసుగు…

శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్లుగా తమ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికే నిపుణుల కమిటీని నియమించారనేది నిర్వివాదాంశం. రివర్స్ టెండరింగ్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు విషయంలో సైతం ప్రభుత్వం నిపుణుల కమిటి నివేదికల తర్వాతనే నిర్ణయం తీసుకుంది. అయితే నిపుణుల కమిటీ నివేదిక ఏరకంగా వస్తుందో అందరికీ తెలిసిందే. ప్రభుత్వ అభిప్రాయానికి అనుగుణంగా వండి వార్చే తంతు చాలాకాలంగా సాగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ అదే జరిగింది. కాపులకు వెనకబడిన తరగతుల రిజర్వేషన్ కల్పించాలనే విషయంలో మంజునాథ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎలా రాబట్టిందనేది అప్పట్లో సంచలనమైంది. రాజకీయ అవసరాలు, ప్రభుత్వ ఆలోచనలకు శాంక్టిటీ తెచ్చేందుకు నిపుణుల అభిప్రాయాల ముద్ర వేస్తున్నారు. ఈ విషయంలో తెలుగుదేశం కంటే వైసీపీ రెండాకులు ఎక్కువే చదివింది. అయితే ప్రస్తుతం కమిటీలో సభ్యుల అర్హతల విషయాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. పట్టణాభివ్రుద్ధి, పర్యావరణం, ప్లానింగ్, నిర్మాణాలకు సంబంధించిన నిపుణులు అందులో ఉన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా వారు ఏయే ప్రాంతాలను సూచిస్తారు.? ప్రాంతాలవారీగా అభివ్రుద్ధి అవకాశాలు ఏమేరకు ఎక్కడెక్కడ ఉన్నాయనేదే ప్రస్తుతం తెలుసుకోవాల్సిన అంశం. అన్నిటికీ మించి ప్రతిపాదిత అమరావతికి ఎంతమేరకు కోత పడనుండబోతుందో నిపుణుల కమిటీ రూపంలో తేలబోతోంది. అమరావతి పరిపాలనకే పరిమితమవుతుందా? రైతుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల భూమిని అదనపు అవసరాల కోసం ఏరకంగా సద్వినియోగం చేస్తారనే అంశమూ ఒక కొలిక్కి వస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీర్ఘకాలం నాన్చకుండా కమిటీ రూపంలో ప్రజలకు స్పష్టత నివ్వదలుచుకోవడం సంతోషించాల్సిన విషయమే.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News