రాజకీయ సాయం చేస్తారా?

వై.ఎస్.జగన్ కాంగ్రెస్ లో పుట్టారు. పెరిగారు. ఎంపీ కూడా అయ్యారు. ఓ విధంగా అయన రాజకీయ అక్షరాభ్యాసం కాంగ్రెస్ లోనే సాగింది. తండ్రి మూడు దశాబ్దాలకు పైగా [more]

Update: 2019-08-21 12:30 GMT

వై.ఎస్.జగన్ కాంగ్రెస్ లో పుట్టారు. పెరిగారు. ఎంపీ కూడా అయ్యారు. ఓ విధంగా అయన రాజకీయ అక్షరాభ్యాసం కాంగ్రెస్ లోనే సాగింది. తండ్రి మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ నీడన పనిచేసిన నాయకుడు. రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా, మరో రెండు సార్లు ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పనిచేశారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది. మరి వై.ఎస్.జగన్ కి తండ్రి రాజకీయ చరిష్మా ఇంతలా ఉపయోగపడుతుందంటే దాని వెనక అసలు బలం కాంగ్రెస్ అన్నది లాజిక్ తెలిసిన వారు ఎవరైన చెప్పే విషయం. అయితే వైఎస్సార్ కొడుకుగా మాత్రమే వై.ఎస్.జగన్ కి పోలిక తప్ప, మిగిలిన విషయాల్లో తండ్రి రాజకీయ విధానాలతో వై.ఎస్.జగన్ కి ఏ మాత్రం సంబంధం లేదు. వై.ఎస్.జగన్ కాంగ్రెస్ ని కాదనుకున్నారు. కాంగ్రెస్ సైతం వై.ఎస్.జగన్ ని నిర్దాక్షిణ్యంగా తరిమేసింది. అంతటితో ఆగలేదు, వెంటాడి వేటాడింది. అక్కడ వై.ఎస్.జగన్ వంటి మొండివాడు కాకపోయి ఉంటే ఏనాడో కాంగ్రెస్ మింగేసేది.

హస్తంతో దోస్తీ….

నిజానికి వై.ఎస్.జగన్ భావజాలం చూసినా అయన పార్టీ ఓటు బ్యాంక్ చూసినా ఆయనకు కాంగ్రెస్ తోనే దోస్తీ కలవాల్సి ఉంటుంది. లౌకిక వాదం, మైనారిటీల రక్షణ వంటి విషయాలు తీసుకుంటే వై.ఎస్.జగన్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాలి. ఇపుడు కూడా వై.ఎస్.జగన్ బీజేపీతో అవసరార్ధం స్నేహం చేస్తున్నారు తప్ప ఆయన ఆ పార్టీ ఉన్న ఎన్డీయే కూటమిలో చేరలేదు. చేరితే మైనారిటీల ఓటు బ్యాంక్ దెబ్బ తింటుందన్న భయమే వై.ఎస్.జగన్ ని అలా కట్టిపడేసింది. ఇవన్నీ ఇలా ఉంటే వై.ఎస్.జగన్ తో దోస్తీ కట్టమని తెలంగాణా కాంగ్రెస్ వృధ్ధ నాయకుడు వి హనుమంతరావు టీ కాంగ్రెస్ నేతలకు సూచించారు. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. నాటి వైఎస్ నుంచి నేటి జగన్ వరకూ పూర్తిగా కుటుంబాన్ని వ్యతిరేకించిన నాయకుడు కాంగ్రెస్ లో ఎవరైనా ఉన్నారా అంటే అది వీహెచ్ అని చెబుతారు. అలాంటిది వై.ఎస్.జగన్ ని కలవండని హనుమన్న చెప్పడంతో పరమార్ధం ఏమై ఉంటుందో.

ఇదీ విషయం….

ఇంతకీ కధేంటంటే నల్లమల అడవులలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమించాలని హనుమంతరావు పార్టీ నాయకులను కోరారు. స్థానిక ప్రజలను సమీకరించి కార్యాచరణ రూపొందించాలని పిసిసి అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు యురేనియం తవ్వకాలతో నష్టం జరుగుతుందని, అవసరమైతే ఈ అంశంపై ఏపీ సీఎం వై.ఎస్.జగన్ ను కూడా కలవాలని హనుమంతరావు కాంగ్రెస్ నేతలకు సలహా ఇచ్చారు. మరి వీహెచ్ మాటలను తీసుకుని టీ కాంగ్రెస్ నేతలు కలవడానికి వచ్చినా వై.ఎస్.జగన్ భేటీ అవుతారా. వారితో కలసి పోరాటానికి అడుగులు వేస్తారా అన్నదే ఇపుడు చర్చ. ఇక్కడ హనుమంతరావు వై.ఎస్.జగన్ పేరు సూచించడం వెనక కూడా వ్యూహం ఉంది. రెడ్డి సామాజికవర్గానికి ఐకాన్ గా వై.ఎస్.జగన్ ఉన్నారు. చరిష్మాటిక్ ఫిగర్ వై.ఎస్.జగన్. ఆయన లాంటి వారు టీ కాంగ్రెస్ లో ఎవరూ లేరు. ముందు ప్రజా సమస్యలపైన జగన్ ని దారికి తెస్తే తరువాత రోజుల్లో ఆయనతో కలసి తెలంగాణాలో కూడా పోరాడవచ్చునని వ్యూహం ఏదైనా ఉండి ఉండొచ్చని అంటున్నారు. ఇదెంతవరకు నిజమైనా కాకున్నా వై.ఎస్.జగన్ మాత్రం కాంగ్రెస్ కి డోర్లు ఎపుడో వేశారని అంటున్నారు.

Tags:    

Similar News