ముట్టుకుంటే షాకేనా?

జగన్ యాభై శాతం పైగా జనాల ఓట్లతో 86 శాతం పైగా సీట్లతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన సర్వశక్తిసంపన్నుడు. జగన్ అందుకే దూకుడుగా నిర్ణయాలు [more]

Update: 2020-02-06 08:00 GMT

జగన్ యాభై శాతం పైగా జనాల ఓట్లతో 86 శాతం పైగా సీట్లతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఆయన సర్వశక్తిసంపన్నుడు. జగన్ అందుకే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నా ఏపీలో అత్యంత బలహీనమైన విపక్షం గొంతు కూడా ఎక్కడా వినిపించని పరిస్థితి. జగన్ గత ఎనిమిది నెలల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటి వల్ల కొన్ని చికాకులూ పడ్డారు. అయినా ముందుకు సాగుతున్నారు. ఇక సంక్లిష్టమైన మూడు రాజధానుల సమస్యను కూడా జగన్ సులువుగానే దాటేసే పరిస్థితి కనిపిస్తోంది. దానికి కేంద్రం కూడా పచ్చ జెండా ఊపడం ఒక ప్రధాన కారణమైతే, ఏపీలో ఇతర ప్రాంతాల ప్రజల మద్దతు అమరావతి రైతుల ఉద్యమానికి లేకపోవడం ఇంకో బలమైన కారణం.

హోదా గోదాలోకి…

ఇలా సాఫీగా సాగుతున్న కధను మలుపు తిప్పాలనుకుంటే మాత్రం జగన్ పెద్ద చిక్కుల్లో పడతారని అంటున్నారు. జగన్ హఠాత్తుగా కేంద్రానికి, అదీ ప్రధానికి ప్రత్యేక హోదా గుర్తు చేస్తూ లేఖ సంధించారు. ఎట్టి పరిస్థితుల్లో హోదా ఏపీకి ఇవ్వాల్సిందేనని ఆయన అందులో డిమాండ్ చేశారు. ఇది ఓ విధంగా కేంద్ర పెద్దలకు ఆగ్రహం కలిగించే వ్యవహారమే. హోదా అన్నది ముగిసిన అధ్యాయమని బీజేపీ ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పింది. పైగా నీ కంటే ముందాయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రత్యేక ప్యాకేజికి తలూపాడు కాబట్టి నీవు అలాగే ఉండాలి తప్ప హోదా ఊసు ఎత్తవద్దు అని పార్లమెంట్ సాక్షిగా కూడా గట్టిగా చెప్పేశారు. అయినా జగన్ హోదా అంటూ గోదాలోకి దిగిపోతున్నారు.

హెచ్చరికేనా…?

మూడు రాజధానుల విషయంలో జగన్ చెవిలో తీయగా ఉండేలా నాలుగు మంచి మాటలు చెప్పిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అదే నోటితో హోదా విషయంలో గట్టి హెచ్చరికలే జారీ చేశారు. ఏం జగన్, హాయిగా ఏపీలో పాలన చేసుకోవాలని లేదా? హోదా పోరాటం చేసి బాబు ఏమైపోయారు? 23 సీట్లతో ఓడి వాడిపోయారు. అటువంటి హోదాని ముట్టుకుంటే ఇబ్బందులే తప్ప మరేమీ ఉండవని కూడా జీవీఎల్ పక్కా క్లారిటీగానే చెప్పారు. హోదా అన్నది జనం మరచిపోయారు. అది రాదు అని కూడా వారికి తెలుసు. ఇక జగన్ కి కూడా అది తెలుసు అంటున్నారు జీవీఎల్, అయినా సరే హోదా పేరిట మభ్యపెట్టాలని చూస్తే జగనే చిక్కుల్లో పడతారని ఆయన భవిష్యత్తు వాణిని వినిపించేశారు.

అవునా.. నిజమేనా…?

హోదా అన్న మాట ఎలా పుట్టిందో కానీ అది పట్టుకుని రాజకీయంగా బతికి బట్టకట్టిన వారు ఎవరూ లేరు. హోదా ఇస్తామన్న కాంగ్రెస్ ని ఏపీ జనం కాలగర్భంలో కలిపేశారు. ఇక హోదా అంటూ చివరి ఏడాది పోరాడిన బాబునూ ఇంటికి పంపారు. ఓ విధంగా హోదా విషయంలో జనానికి ఆశ ఉన్నా కేంద్రం, మోడీ మీద ఇంతా ఎక్కువ అవగాహన ఉందనుకోవాలి. హోదా అంటూ ఇపుడు జగన్ లేని పోని తలనొప్పి తగిలించుకుంటే జనానికి ఏం పోయింది అలాగే అని తెమ్మంటారు. జగన్ తేగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న. దానికి సమాధానం సులువే. కేంద్రం ఇవ్వదు. ఆ తరువాత కధ అంతా అచ్చం బాబు, మోడీ ఫైటింగ్ లాగానే డిటోగా సాగుతుంది. పైగా మూడు రాజధానుల విషయంలో మద్దతుగా నిలిచిన కేంద్రం ఇపుడు అడ్డం తిరగడం ఖాయం. ఇక ఏపీలోని విపక్షాలు అంతా లోపాయికారీ అవగాహనతో జగన్ ని జనంలో విలన్ని చేస్తే 2024లో ఆయనకు గడ్డు పరిస్థితులే దాపురిస్తాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి. మరి జగన్ హోదాపై మోడీని ఒప్పిస్తారా..ఆలాకాక నొప్పిస్తారా, లేక తన అజెండా నుంచి తప్పిస్తారా అన్నది చూడాలి.

Tags:    

Similar News