ఏయూకు వెళ్లారా..? జగన్ కు ఇబ్బందులేనా?

దాదాపు వందేళ్ళ చరిత్ర ఉన్న విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ నాయకులకు అచ్చిరావడం లేదా అన్న దానిపైన చర్చ సాగుతోంది. ఈ యూనివర్శిటీ చదువుల ఉన్నతికే తప్ప [more]

Update: 2019-12-14 06:30 GMT

దాదాపు వందేళ్ళ చరిత్ర ఉన్న విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ నాయకులకు అచ్చిరావడం లేదా అన్న దానిపైన చర్చ సాగుతోంది. ఈ యూనివర్శిటీ చదువుల ఉన్నతికే తప్ప పదవులకు మాత్రం పెద్ద బ్రేక్ వేస్తుందని అంటున్నారు. గతంలో జరిగిన పరిణామాలను గుర్తుకుతెచ్చుకుంటూ ఈ కామెంట్స్ చేస్తున్నారు. ఏయూలో అడుగుపెడితే ఎంతవారికైనా ఇబ్బందులు తప్పవని గత చరిత్ర నిరూపించిందని అంటున్నారు. నాటి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం నుంచి నిన్నటి చంద్రబాబు వరకూ ఏయూ వేదికగా జరిగిన పలు సంఘటలను వల్లె వేస్తే రాజకీయ జీవులకు పెద్దగా కలసిరాలేదని అంటున్నారు.

ఆనాడు అలా….

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు గతంలో జరిగాయంటే ఆశ్చర్యం కలుగకమానదు. 1954 మే నెలలో అప్పటి ఆంధ్ర రాష్త్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏయూ వేదికగా పూర్తి సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఆయన అదే ఏడాది నవంబర్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది ఏయూ యాంటి సెంటిమెంట్ గా చెప్పుకుంటారు. ఇక 2014లో 13 జిల్లాల ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు తొలి క్యాబినెట్ మీటింగును ఏయూ వేదికగా నిర్వహించారు. ఆ తరువాతే ఆయన ఓటుకు నోటు కేసుల్లో చిక్కుల్లో పడ్డార‌ని చెబుతారు. అంతే కాదు ఆయన తొలి క్యాబినెట్లో తీసుకున్న ఒక్క నిర్ణయం కూడా అమలు కాలేదని కూడా అంటారు.

మహామహులకు కూడా….

మరో విషయం కూడా ఆసక్తికరంగా చెబుతారు. ఇపుడు రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వెంకయ్యనాయుడు ఏయూ పూర్వ విద్యార్ధి హోదాలో 2016లో జరిగిన తొలి సదస్సుకు హాజరయ్యారు. ఆ మరుసటి ఏడాదికి ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ఆయనకు ఉన్నతమైన పదవి వచ్చినా కూడా ఇష్టమైన రాజకీయ రంగానికి దూరం కావడాన్ని మాత్రం ఏయూ మహత్స్యంగానే చెప్పుకుంటారు. ఓ విధంగా వెంకయ్యనాయుడు, చంద్రబాబు పూర్వ విద్యార్ధుల సమావేశానికి అన్ని విధాలుగా సలహా సూచనలు ఇచ్చారు, కానీ ఈ సమావేశాలకు వచ్చిన చంద్రబాబు వరసగా రెండవసారి గెలవలేకపోయారు, ఆయన అనుకున్న హామీలూ తీర్చలేకపోయారు.

ఫస్ట్ టైం జగన్…..

ఇవన్నీ పక్కన పెడితే జగన్ ఏయూలో మొదటిసారి హాజరయ్యారు. ఆయన అంతకు ముందు ఏయూ గ్రౌండ్స్ ని తన రాజకీయ సభలకు వాడుకుందామనుకున్నా నాటి టీడీపీ సర్కార్ ఇవ్వలేదు. యువభేరీలు, ఇతర మీటింగులు అన్నీ కూడా ఏయూ బయటే జగన్ నిర్వహించారు. ఇపుడు మాత్రం ఆయన పూర్వ విద్యార్ధుల నాలుగవ సదస్సుకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హోదాలో రావడం జరిగింది. జగన్ కి ఈ యాంటి సెంటిమెంట్ బెడద ఏమైనా ఉంటుందా అని వైసీపీ వర్గాలు కొంత కలవరం చెందుతున్నాయి. మరి జగన్ ఇప్పటివరకూ రాజకీయంగా దూసుకుపోతునే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News