జగన్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకేనా?

కర్ణుడికి కవచ కుండలాలు మాదిరిగా ఏపీ సీఎం జగన్ తనకు రక్షణ కవచాలుగా సంక్షేమ పధకాలు చేసుకుని దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జగన్ ఎన్ని అప్పులు చేస్తున్నారో [more]

Update: 2020-12-10 06:30 GMT

కర్ణుడికి కవచ కుండలాలు మాదిరిగా ఏపీ సీఎం జగన్ తనకు రక్షణ కవచాలుగా సంక్షేమ పధకాలు చేసుకుని దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జగన్ ఎన్ని అప్పులు చేస్తున్నారో ఎక్కడ నుంచి డబ్బులు తెస్తున్నారో సాక్షాత్తు మంత్రులకే తెలియదు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కన్నబాబు ఆ మధ్య ఒకసారి మీడియా ముఖంగా పంచుకున్నారు. ఏపీలో ఒక్క పధకం కూడా ఆగకుండా జగన్ చూపుతున్న శ్రద్ధ భేష్ అని కూడా వైసీపీయే కాదు, ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తారు. నిజానికి డేట్ టైం చెప్పి మరీ జగన్ చాలెంజిగా పధకాలను అమలు చేస్తున్నారు.

బ్రాండ్ ఇమేజ్ పెరిగింది…

జగన్ అంటే మాట ఇస్తే చేస్తాడు అన్న బ్రాండ్ ఇమేజ్ ని ఈ ఏడాదిన్నరలో జనంలో బిల్డప్ చేసుకున్నాడు. తనకు ఉన్న క్రెడిబిలిటీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎక్కడిది అంటూ నిండు సభలో జగన్ అన్న మాటలు ఆయన రాజకీయాలతో విభేదించేవారు కూడా అంగీకరిస్తారు. మరి జగన్ ఇలా దూకుడుగా పధకాలు అమలు చేసుకుంటూ పోతే ఆయన్ని ఓడించడం కష్టమే. ఈ సంగతి ఆలస్యంగానైనా బీజేపీ గ్రహించినట్లుంది. అది కూడా దుబ్బాక ఉప‌ ఎన్నికల తరువాత ఏపీలో అధికారం మీద ఆశ పెరిగిన తరువాత వచ్చిన మార్పు ఇది.

టీడీపీ తోవలోనే….

ఇక టీడీపీ అయితే జగన్ పధకాలు ఎక్కడికక్కడ ఆపడానికి ఇంతదాకా చూస్తూ వచ్చింది. కోర్టులో కేసులు కూడా ఆ పార్టీ వారే వేస్తూ వచ్చారు. సరే ఎన్ని చేసినా జగన్ మాత్రం కీలకమైన పధకాల విషయంలో అసలు ఆగడంలేదు. దాంతో ఏపీ అప్పుల కుప్పగా మారిందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు లాంటి వారు విమర్శలు చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం అయితే ఇన్నేసి రకాలుగా పధకాలు పెట్టి జనం ఒళ్ళో డబ్బులు కుప్ప పోస్తే ఏపీ దివాళా తీస్తుందంటూ మెసేజ్ లతో ఉద్యమాన్ని లేవదీస్తున్నారు. ఇపుడు అచ్చం అలాగే బీజేపీ గొంతు కూడా సవరించుకుంటోంది.

అక్కడ బిగించేస్తారా…?

ఏపీలో జగన్ అమలుచేస్తున్న పధకాలు అన్నీ కూడా తమవేనన్ని సోము వీర్రాజు ఈ మధ్యనే వాదన మొదలుపెట్టారు. కేంద్రం అన్ని పధకాలకు నిధులు ఇస్తూంటే వాటిని తనవిగా జగన్ ప్రచారం చేసుకోవడం దారుణం అని ఆయన అంటున్నారు. ఇపుడు ఆయనకు తోడుగా ఏపీ నుంచి రాజ్యసభకు గెలిచిన సురేష్ ప్రభు ముందుకు వచ్చారు. ఆయన ఏకంగా ఏపీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో పడిపోయిందని కేంద్రానికి లేఖ రాశారు. ఏపీ సంగతి చూడాలని, అప్పుల పాలు అయి దశ దిశ లేకుండా పోతున్న రాష్ట్రం విషయంలో ఒక కన్ను వేయాలని కోరడం విశేషమే. మోడీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు గెలిచి రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా ఇపుడు అప్పులు కూడా తెచ్చుకోకుండా కట్టడి చేయమంటున్నారు. అంటే అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్లుగా ఏపీ సర్కార్ కి బ్రేకులు వేస్తే జగన్ నిస్సహాయుడుగా మిగిలిపోతాడని, అలా జనంలో నుంచి వచ్చే వ్యతిరేకత నుంచి బీజేపీ అధికారానికి బాటలు వేసుకోవచ్చు అన్న మాస్టర్ ప్లాన్ ఏదో ఉన్నట్లుంది మరి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News