జగన్ పదవి ఊడటం లేదా? ఎందుకిలా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవి పోతుందని అంచనా వేసుకున్నారు. న్యాయవ్యవస్థతో పెట్టుకోవడంతో జగన్ తనంతట తాను ముప్పును కొని తెచ్చుకున్నారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఇక టీడీపీ నేతలయితే [more]

Update: 2020-12-08 14:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవి పోతుందని అంచనా వేసుకున్నారు. న్యాయవ్యవస్థతో పెట్టుకోవడంతో జగన్ తనంతట తాను ముప్పును కొని తెచ్చుకున్నారన్న విశ్లేషణలు వెలువడ్డాయి. ఇక టీడీపీ నేతలయితే సుప్రీంకోర్టు నిర్ణయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జగన్ ను పదవి నుంచి తొలిగించే వీలుందని ఆనందపడ్డారు. ఢిల్లీకి వెళ్లి మరీ తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కేసును ఫాలో అప్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరి ఆశలన్నీ అడియాసలుగానే మారాయి.

ఆ లేఖపై….

వైఎస్ జగన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ సంచలనం కల్గించిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, న్యాయవ్యవస్థను కూడా శాసించడానికే ఈ లేఖ రాశారని టీడీపీ పదే పదే ఆరోపించింది. యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలయితే వెంటనే జగన్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరారు. అప్పుడే న్యాయం పదికాలాల పాటు ఉంటుందని పేర్కొన్నారు.

చర్యలు తీసుకుంటారని….

ఇక తెలుగుదేశం పార్టీ వివిధ రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులను రంగంలోకి దించింది. తమిళనాడుకు చెందిన మణి, మరో న్యాయవాది సునీల్ సింగ్ లు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరారు. అంతేకాదు లేఖను బహిర్గతం చేయడంపై వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా పిటీషన్ లలో కోరారు. నిజానికి ఈ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.

తోసిపుచ్చడంతో….

కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటీషన్లను తోసిపుచ్చడంతో టీడీపీ ఆశలు ఆవిరయిపోయాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ ను పదవి నుంచి తొలగించే పిటీషన్ కు అర్హత లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్ కు ఎదురుదెబ్బ తగులుతుందని టీడీపీ భావించింది. అయితే అలా జరగకపోవడంతో ఈ కేసులో జగన్ దూకుడు మరింత పెంచుతారని భావిస్తున్నారు. ఇక చీఫ్ జస్టిస్ నిర్ణయం కోసం ఎదురు చూడటం తప్ప టీడీపీ నేతలు చేయగలిగిందేమీ లేదు.

Tags:    

Similar News