బొత్తిగా మానేశారుగా… ?

నీ నగు మోమూ కనలేని నా జాలీ అని ఒక సంప్రదాయ కీర్తన ఉంది. జగన్ విషయంలో అలా ఏపీ జనం పాడుకోవాలేమో. జగన్ ముఖం చూసి [more]

Update: 2020-12-13 06:30 GMT

నీ నగు మోమూ కనలేని నా జాలీ అని ఒక సంప్రదాయ కీర్తన ఉంది. జగన్ విషయంలో అలా ఏపీ జనం పాడుకోవాలేమో. జగన్ ముఖం చూసి ఏడాది కావస్తోంది. ఆయన జనంలోకి బొత్తిగా రావడం మానేశారు. టీడీపీ చినబాబు లోకేష్ అన్నాడని కాదు కానీ ఏరియల్ సర్వే అంటూ ఆకాశమార్గం పట్టిన జగన్నాధ రధ చక్రాలను భూమి మీదకు జగనే తీసుకురావాల్సివుంది. గట్టి పట్టుదలతో ఏపీలోని పదమూడు జిల్లాలను పాదయాత్ర పేరిట కదం తొక్కిన జగన్ ఇపుడు నల్లపూస కావడం సాదర జనానికే కాదు పార్టీ జనానికీ రుచించడం లేదుగా.

మీడియాతోనైనా…?

జనాలకూ నేతలకు మధ్య వారధిగా మీడియా ఉంది. కనీసం మీడియా ముఖంగానైనా జగన్ తన మనసులోని భావాలను ఎప్పటికపుడు పంచుకుంటే ఏపీలో పాలన సాఫీగా సాగుతోందని జనం భావించే అవకాశం ఉంది. నిజానికి 2020 కాదు కానీ ఏపీని ట్వెంటీ ట్వెంటీ ఆడేసుకుంది. ఓ వైపు కరోనా ఇంకా తగ్గలేదు కానీ లెక్కలేనన్ని తుఫానులు వచ్చి పడుతున్నాయి. ఇంకా రాబోతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబులా మరీ హడావుడి చేయమని ఎవరూ అనరు కానీ రాష్ట్ర పెద్దగా జగన్ మీడియా ముందుకు వచ్చి ప్రజలతో మంచీ చెడ్డా పంచుకోవాలని మాత్రం గట్టిగానే కోరుతున్నారు.

అలా చేస్తే డేంజరే….

జగన్ ఏ నాయకుడిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారో తెలియడంలేదు కానీ ఆయన మీడియాను దూరం పెట్టేశారు. జయలలిత తొలిసారి సీఎం అయిన వేళ ఇలాగే తమిళనాట చేశారట. ఆ తరువాత ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అపుడు ఆమె మీడియా మేనేజ్ మెంట్ విషయంలో తాను చేసిన తప్పును గ్రహించి దానికి అనుగుణంగా రాజకీయాన్ని దిద్దుకున్నారని చెబుతారు. జగన్ తీరు చూస్తే చాలా మందికి జయలలిత మొదటిసారి సీఎం అయినపుడు పోయిన పోకడలే గుర్తుకువస్తున్నాయట. జగన్ మీడియాను దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసమో ఆలోచన చేయాలని కూడా పార్టీ నుంచి కూడా సూచనలు వస్తున్నాయి. అలా దూరంగా ఉంటే జగన్ కి, వైసీపీకి రాజకీయంగా డేంజరేనని కూడా అంటున్నారు.

భరోసా అదేగా……

ఎంత బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడుతున్నా మరెంత మంత్రులు మాట్లాడుతున్నా జగన్ కూడా బయటకు వచ్చి మాట్లాడితేనే జనాలకు గొప్ప భరోసా వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయం అయినా అమరావతి రాజధాని అయినా మరే పెద్ద సమస్య అయినా ఇదీ నా స్టాండ్ అంటూ జగన్ కనీసం జనం ముందు తమ అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇవాళ కాకుండా ఎన్నికల వేళ అన్నీ వచ్చి చెప్పినా అప్పటికి జనం తమకంటూ ఒక అభిప్రాయం వైసీపీ మీద ఏర్పరచుకుంటే జగన్ ఎన్ని మీటింగులు పెట్తి చెప్పినా కూడా వృధా ప్రయాసే అవుతుంది. ఇక విపక్షాలు ఎన్నో ప్రశ్నలు వేస్తాయి నిలదీస్తాయి. కానీ జగన్ వారికి కాదు జవాబు చెప్పాల్సింది. అయిదు కోట్ల ఆంధ్రులకు. ఆ దిశగా జగన్ ఇకనైనా తన ఆలోచనావిధానని మార్చుకుని ముందుకు వస్తేనే అపోహాలైనా అనుమానాలు అయినా జనాలకు తొలగిపోతాయి. అందుకే జగన్ ని ముఖం చూపించమని జనం గట్టిగా కోరుతున్నారు.

Tags:    

Similar News