అందుకే జగన్ వాటిని ఆపారా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని భావించారు. మంత్రి పదవులు, ముఖ్యమైన పదవులు దక్కని నేతలకు ఈ పదవులు ఇవ్వాలని [more]

Update: 2020-12-03 08:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని భావించారు. మంత్రి పదవులు, ముఖ్యమైన పదవులు దక్కని నేతలకు ఈ పదవులు ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అయితే కొంతకాలం నుంచి ఈ ప్రతిపాదన ఫైల్ కే పరిమితమయింది. దీంతో ఆశావహులు ఎదరుచూపులు చూడటం తప్ప ఏం చేయలేకపోతున్నారు. జగన్ ఇటీవల కాలంలో ప్రాంతీయ మండళ్ల ఊసే ఎత్తకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు……

ప్రాంతాల మధ్య అసమానతలను తొలగింపునకు ఈ ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేశారు. ప్రాంతీయంగా అభివృద్ధితో పాటు రాజకీయంగా పార్టీని నమ్ముకున్న వారికి పదవులు వీటి ద్వారా లభిస్తాయి. కేబినెట్ ర్యాంకు కావడంతో సహజంగానే వీటిపై నేతలకు మక్కువ ఏర్పడింది. తమకు పదవి వస్తుందని ఎంతోమంది నేతలు ఆశలు పెట్టుకున్నారు.

నలుగురు ఛైర్మన్లు…..

మొత్తం నాలుగు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు విజయనగరం కేంద్రంగా ఒక మండలి, కాకినాడ కేంద్రంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు కలిపి ఒక మండలి, గుంటూరు కేంద్రంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, కడప కేంద్రంగా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిపి ఒక మండలిని ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు.

ఉగాది తర్వాతనేనా?

ఇప్పటికే వీటి ఏర్పాటు, ప్రాంతీయ మండలి ఛైర్మన్ల నియామకం జరిగిపోవాల్సి ఉంది. అయితే ఉగాది రోజున కొత్త జిల్లాలను ప్రకటించాల్సి రావడంతో జగన్ ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ప్రకటన తర్వాతనే ప్రాంతీయ మండళ్ల ప్రకటన ఉంటుందని తెలియడంతో ఆశావహులు నీరసపడ్డారు. వచ్చే ఏడాది ప్రాంతీయ మండళ్లను జగన్ ఏర్పాటు చేస్తారని మాత్రం వైసీపీ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News