సీఎం సొంత జిల్లాలో భూ దందాలు చూస్తే?

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని.. భారీ స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేస్తున్నామ‌ని ప్రభుత్వం ప‌దే ప‌దే చెబుతోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ [more]

Update: 2020-11-28 12:30 GMT

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని.. భారీ స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేస్తున్నామ‌ని ప్రభుత్వం ప‌దే ప‌దే చెబుతోంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చేస్తామ‌ని అంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీని తామే క‌డ‌తామ‌ని అంటున్నారు. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గాన్ని స్పెష‌ల్‌గా తీర్చిదిద్దుతున్నామ‌ని అంటున్నారు. దీనికి సంబందించిన ప‌నులు కూడా శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. క‌డ‌ప న‌గ‌ర తీరును నాడు వైఎస్ మార్చిన దాని క‌న్నా భిన్నంగా మార్చేస్తున్నారు. అయితే. అదేస‌మ‌యంలో ఇక్కడ జ‌రుగుతున్న దందాలు.. భూక‌బ్జాలు కూడా అంతే వేగంగా సాగుతుండ‌డంతో ప్రజ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ఒక‌టి కాదు.. రెండు కాదు.. అనేక నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ నేత‌లు, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌మీప బంధులు కూడా భూ క‌బ్జాల‌కు పాల్పడ‌డం.. ఎంత‌టి వారి భూముల‌నైనా తెగేసి లాగేసుకోవ‌డం వంటివి చ‌ర్చకు దారితీస్తున్నాయి.

ఎక్కడ కనిపిస్తే…..

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని తీసుకుంటే.. సీఎంకు స‌మీప బంధువులు ఇక్కడ కీల‌క రాజ‌కీయ ప‌ద‌విలో ఉన్నారు. ఆయ‌నే నియోజ‌క‌వ‌ర్గంలో చ‌క్రం తిప్పుతున్నారు. అయితే.. ఈయ‌న క‌నుసన్నల్లోనే భూక‌బ్జాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు బాధితులు. భూములు ఎలాంటి వైనా ఆయ‌న‌కు సంబంధం లేదు. డీ-ప‌ట్టాలున్నా.. ప‌ట్టాలున్నా.. ఆయ‌న లెక్క చేయ‌డం లేదు. అంతేకాదు. ఆయా నివాసాల్లో ఎవ‌రైనా ఉన్న కూడా వారిని బెదిరించి పంపేసి మ‌రీ క‌బ్జా చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పటికే ఇసుక స‌హా పేద‌ల ఇళ్ల పంపిణీకి సంబంధించి ఈయ‌న‌పై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయిన‌ప్పటికీ.. ఎక్కడా ఖాత‌రు చేయ‌డం లేదు. అధికారుల‌ను సైతం లెక్క చేయ‌డం లేద‌నే విమ‌ర్శలు కూడా ఉన్నాయి.

అటవీ భూములపైన….

ఇక‌, మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో పెద్దాయ‌న‌గా పేరున్న ఓ వ్యక్తి కూడా ప‌లు మండ‌లాల్లో పాగా వేసి మ‌రీ క‌నిపించిన భూమిన‌ల్లా త‌న ఖాతాలో వేసుకుంటున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా 112 ఎక‌రాల అట‌వీ భూమిపై ఈయ‌న క‌న్నేయ‌డం.. రాత్రికి రాత్రి దానిని త‌న హ‌స్తగ‌తం చేసుకోవ‌డం.. వంటివి సంచ‌ల‌నం సృష్టించాయి. ఇక్కడ స‌ద‌రు పెద్దాయ‌న పేరుతోనే ఉన్న ఆయ‌న అనుచ‌రుడు చేస్తోన్న భూ దందాల‌కు అంతేలేదు. వాస్తవానికి అట‌వీ భూముల విష‌యంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ, ఈయ‌న విష‌యంలో నిబంధ‌న‌లు, ఇత‌ర‌త్రా కూడా ప‌క్కన పెట్టారు. ఎక్కడా ఏమీ పాటించ‌లేదు. అన్నీ స‌మ‌కూరాయి. కొండ‌ల‌ను గుట్టల‌ను కూడా తొలిచేసి త‌మ పేరిట పొందేశారు.

బెదిరింపులకు పాల్పడుతూ…

ఇక‌, క‌డ‌ప న‌గ‌రంలో మ‌రో చిత్రమైన ఘ‌ట‌న వెలుగు చూసింది. ఏకంగా ముఖ్యమంత్రి జగ‌న్‌కు అత్యంత స‌మీప బంధువుకు చెందిన ఆయ‌న పేరున్న అనుచరుడు రెచ్చిపోతున్నాడ‌నే విమ‌ర్శలు వస్తున్నాయి. స‌ద‌రు నేత క‌డ‌ప న‌గ‌రంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆ నేత ఆగ‌డాల‌ను ప్రశ్నించే వాళ్లే లేరు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ న‌గ‌ర ఇంచార్జ్‌, చోటా పారిశ్రామిక వేత్త అయిన‌. ఒకరి భూమిని ఆక్రమించుకోవ‌డ‌మ కాకుండా.. భౌతికంగా కూడా బెదిరింపుల‌కు పాల్పడ్డార‌ని స్థానికులు చెబుతున్నారు. రిమ్స్‌కు స‌మీపంలో ఉన్న ప్రభుత్వ భూముల షేపుల‌ను రాత్రికి రాత్రే మార్చేసి త‌మ‌వే అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజ‌నుల భూములు, ఎస్సీ భూముల‌ను కూడా వైసీపీ నాయ‌కులు ఎక్కడా వ‌దిలి పెట్టడం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నెత్తిన కుంపటిగా మారి….

ఇక రైల్వేకోడూరు వైసీపీ రాజ‌కీయాల‌ను గంధంపు చెక్కల స్మగ్లర్‌గా పేరున్న ఓ రెడ్డి కుటుంబం శాసిస్తోంది. ఇప్పుడు వారి క‌నుస‌న్నల్లో జ‌రుగుతోన్న భూ దందాల‌కు అంతే లేదు. జ‌మ్మల‌మ‌డుగులో ఫ్యాక్షన్ రాజ‌కీయాల‌కు భిన్నంగా సేవ చేస్తాడ‌ని నియోజ‌క వ‌ర్గ ప్రజ‌లు అనుకున్న వ్యక్తి ఇప్పుడు త‌న అన‌చ‌రుల భూ దందాల విష‌యంలో ఉదాసీన‌త‌తో ఉండ‌డంతో ప్రజ‌లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ భూ దందాల‌ ప‌రిణామాల‌తో క‌డ‌ప జిల్లా అట్టుడికిపోతోంది. మేం ఎంతో ఆశ‌తో గెలిపించిన వైసీపీ నాయ‌కులు మా నెత్తిన కుంప‌టిగా మారారే.. అని ప్రజ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.

Tags:    

Similar News