బల్లి కుటుంబం బలి అయినట్లేనా?

జగన్ వ్యవహారశైలి అస్సలు మింగుడపడటం లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి జగన్ కట్టుబడి ఉండేవారు. వెనక్కు తగ్గేవారు కారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత [more]

Update: 2020-11-28 08:00 GMT

జగన్ వ్యవహారశైలి అస్సలు మింగుడపడటం లేదు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి జగన్ కట్టుబడి ఉండేవారు. వెనక్కు తగ్గేవారు కారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇది పార్టీలో చర్చనీయాంశమైంది. జగన్ తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోగలడు. మరలా దాని గురించి మర్చిపోయే నేతగా పార్టీలో జగన్ పై జోరుగా చర్చ జరుగుతుండటం విశేషం.

ఎవరడిగారని….

జగన్ ను ఎవరూ అడగలేదు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లులను టీడీపీ వ్యతిరేకించిందన్న ఆగ్రహంతో దానిని రద్దు చేస్తూ తీర్మానం చేసి పంపారు. శాసనమండలి రద్దు అంశం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ లోనే ఉంది. దానిపై జగన్ కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద పెద్దగా వత్తిడి చేయడం లేదు. ఈలోగా శాసనమండిలిలో భర్తీ అయిన ఖాళీలను జగన్ భర్తీ చేసుకుంటూ పోతున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, పెనుమత్స సురేష్ బాబును ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ రెండు ఖాళీ అయిన వాటిని భర్తీ చేయడంలో భాగంగా జగన్ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు.

బల్లి కుటుంబానికి….

ఇక తాజగా తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు మృతి చెందారు. ఆయన మృతితో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే సంప్రదాయంగా బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబానికే జగన్ టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తిని ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

రద్దు చేస్తానన్న సభకు…..

బల్లి కుటుంబానికి తిరుపతి ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడం జగన్ ఇష్టమే. అయితే బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పడం పార్టీలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో సయితం జగన్ కు వ్యతిరేకంగా కామెంట్స్ వినపడుతున్నాయి. శాసనమండలినే రద్దు చేసినప్పడు ఇక ఆ ఛాన్స్ ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. అంటే శాసనమండలి రద్దుపై జగన్ తన నిర్ణయాన్ని వెనక్కుతీసుకున్నట్లే కనపడుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే బల్లి కుటుంబం పరిస్థితి ఏంటన్న సందేహాలు కలగకమానవు. మొత్తం మీద జగన్ నిర్ణయాలు ఇప్పడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News