మొండితనమే ముప్పు తెచ్చి పెడుతుందిగా?

రాజకీయాల్లో అనుభవం అక్కరకొస్తుంది. మొండితనం పాలిటిక్స్ లో పనికి రాదు. ఇది చంద్రబాబు, జగన్ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన [more]

Update: 2020-11-21 03:30 GMT

రాజకీయాల్లో అనుభవం అక్కరకొస్తుంది. మొండితనం పాలిటిక్స్ లో పనికి రాదు. ఇది చంద్రబాబు, జగన్ విషయంలో స్పష్టంగా తెలుస్తుంది. 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీ కేవలం పదహారు నెలల్లోనే గాడి తప్పింది. ఇది జగన్ మొండితనం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. పాలనలో బిజీగా ఉంటానని చెబుతున్న జగన్ పార్టీని పూర్తిగా గాలి కొదిలేయడంతోనే ఈ సమస్యలు తలెత్తాయి.

బాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా…..

చంద్రబాబు ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. కానీ నియోజకవర్గాల్లో అంత అసంతృప్తి తలెత్తలేదు. జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గాలను ఒకటి చేశారు. కర్నూలులో బద్ధ విరోధులైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తిల కుటుంబాన్ని ఏకం చేశారు. 23 నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి చెలరేగినా చంద్రబాబు సర్దుబాటు చేయగలిగారు. ఇదంతా చంద్రబాబు అనుభవం వల్లనే సాధ్యమయింద. కానీ జగన్ మాత్రం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు లేవనే చెప్పాలి.

వైసీపీ నేతలను సంప్రదించరా?

జగన్ ఇప్పుడు నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అనధికారికంగా వైసీపీలోకి చేర్చుకున్నారు. కానీ చేర్చుకునే ముందు అక్కడ స్థానిక వైసీపీ నేతలతో జగన్ ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. దీంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలకు సఖ్యత కొరవడింది. నిత్యం అక్కడ విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. ఈ సమస్య విషయంలో జగన్ పట్టించుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది.

ఒక్కరోజు కేటాయించలేరా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 70 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్యనే విభేదాలు తలెత్తాయి. దీనికి ప్రధాన కారణం జగన్ ఎమ్మెల్యేలతో సమావేశం కాకపోవడమే. పాలనలో బిజీగా ఉన్నానని చెబుతున్న జగన్ కనీసం వారానికి ఒకసారి ఒక జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యే వీలుంది. కానీ జగన్ మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. జగన్ మొండితనం, అనుభవరాహిత్యమే దీనికి కారణమన్న వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ మేలుకోకపోతే పార్టీ పూర్తిగా గాడి తప్పే అవకాశాలు మాత్రం స్పష్టంగా కన్పిస్తున్నాయి.

Tags:    

Similar News