ఒక్కొక్కటి సెట్ చేసేస్తున్న జగన్

విశాఖను జగన్ రాజధానిగానే భావిస్తున్నారు. తన చేతుల్లో ఉన్నంత మేరకు మూడు రాజధానుల చట్టం చేశారు. అది న్యాయ వివాదంలో చిక్కుకుంది. అయినా సరే విశాఖ క్యాపిటల్ [more]

Update: 2020-11-13 15:30 GMT

విశాఖను జగన్ రాజధానిగానే భావిస్తున్నారు. తన చేతుల్లో ఉన్నంత మేరకు మూడు రాజధానుల చట్టం చేశారు. అది న్యాయ వివాదంలో చిక్కుకుంది. అయినా సరే విశాఖ క్యాపిటల్ అనే భావనతో ప్రతీదీ ఏర్చి కూర్చి అక్కడకే తెచ్చి పెడుతున్నారు. విశాఖలో ఆదానీ గ్రూప్ చంద్రబాబు టైం లో తెగ హడావుడి చేసింది. విశాఖను ఐటీ రాజధాని చేస్తామని బాబు, ఆయన కుమారుడు ఐటీ మంత్రి లోకేష్ చాలానే కబుర్లు చెప్పారు. కానీ నాడు అది అమలు కాలేదు. ఇపుడు జగన్ మాత్రం అదే అదానీ గ్రూపుతో కొత్త ఒప్పందం చేసుకున్నారు.

నాలుగు రెట్లుగా…

జగన్ ఒప్పందం చూస్తే చంద్రబాబు ఏలుబడిలో అదానీ గ్రూప్ పెద్దలు కావాలని చేశారా? లేక ప్రభుత్వమే అక్కడితో ఆగిపోయిందా అన్న డౌట్లు వస్తాయి. అదాని గ్రూప్ కి అప్పనంగా అయిదు వందల ఎకరాలు చంద్రబాబు ఇచ్చారు. వారి నుంచి కేవలం ఆరు వేల మందికే ఉద్యోగాలు ఆశించారు. ఇక జగన్ గత ఏడాదిన్నర కాలంలో ఆదానీ గ్రూప్ తో జరిపిన చర్చల ఫలితంగా అధ్బుతమైన ఫలితాలే వచ్చాయనుకోవాలి. కేవలం 130 ఎకరాల భూమి మాత్రమే వైసీపీ సర్కార్ వారికి ఇస్తోంది. కానీ వారి నుంచి పాతిక వేల మందికి ఉద్యోగాలను రాబడుతోంది. ఈ తేడాను నిజంగా గమనిస్తే వైసీపీ హాయంలో జరిగిన మేలు ఏంటో అర్ధమవుతుందని పార్టీ నాయకులు అంటున్నారు.

అబద్దాలేనా …?

ఆదానీ గ్రూప్ విశాఖ నుంచి వెళ్ళిపోయింది. ఐటీ రాజధానిగా చేద్దామనుకుంటే వైసీపీ సర్కార్ కాకుండా చేసిందని ఆ మధ్య దాకా టీడీపీ తెగ రచ్చ చేసేది. మరి ఇపుడు తాజాగా రాష్ట్ర మంత్రివర్గం ఆదానీ గ్రూప్ కి విశాఖలో భూమిని కేటాయిస్తూ అన్ని అనుమతులు మంజూరు చేయడాన్ని చూసిన తరువాత అయినా టీడీపీ తమ్ముళ్ళు ఏమంటారో మరి. పైగా అయిదు వందల ఎకరాలు ఎందుకు నాడు ఇచ్చారన్నది కూడా టీడీపీ పెద్దలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది కదా అని మేధావులు అంటున్నారు.

ఇలా అయితే నమ్మరుగా…?

విశాఖలో ఆరు లైన్ల జాతీయ రహదారులను నిర్మించాలని ఈ మధ్యనే జగన్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ తీసుకువస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం దాకా దాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి తొందరలోనే జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. ఇక్కడ కూడా మొత్తం మూడు వేల ఎకరాల భూమిని సేకరిస్తే అందులో నుంచి అయిదు వందల ఎకరాలను వైసీపీ సర్కార్ వెనక్కు తీసుకుని మిగిలిన దాంట్లో నుంచే పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కచ్చితంగా 15 వేల కొట్ల రూపాయల విలువ చేసే ఆర్ధిక లాభం. ఆదానీ భూముల విషయంలో కూడా అంతే విలువ చేసే భూమి ప్రభుత్వం కాపాడిందని చెబుతున్నారు. విశాఖను జగన్ సర్కార్ విద్వంసం చేస్తోంది. కూల్ సిటీని సర్వ నాశనం చేస్తోంది అని పెద బాబు, చినబాబు ఇకమీదట గొంతు చించుకుంటే జనం నమ్ముతారా. టీడీపీ తమ్ముళ్ళు కూడా తాజా పరిణామాలను అర్ధం చేసుకుంటే పార్టీకి అసలుకే ఎసరు అయ్యే సీన్ ఉంటుంది. మొత్తానికి జగన్ అటెన్షన్ విశాఖ మీద చూపిస్తూంటే టీడీపీ టెన్షన్లో పడుతోంది.

Tags:    

Similar News