జగన్ ఆయన్ను చేర్చుకున్నా…నేను?

వైసీపీ అధినేత జగన్ ఆలోచన వేరు. క్షేత్రస్థాయిలో జరుగుతుంది వేరు. ఇతర పార్టీల నుంచి పేరొందిన నేతలు తీసుకుంటే ఆ నియోజకవర్గాల్లో ఏక వ్యక్తి ఆధిపత్యానికి తెరదించవచ్చన్నది [more]

Update: 2019-12-16 15:30 GMT

వైసీపీ అధినేత జగన్ ఆలోచన వేరు. క్షేత్రస్థాయిలో జరుగుతుంది వేరు. ఇతర పార్టీల నుంచి పేరొందిన నేతలు తీసుకుంటే ఆ నియోజకవర్గాల్లో ఏక వ్యక్తి ఆధిపత్యానికి తెరదించవచ్చన్నది జగన్ ఆలోచన. అయితే తమ ఆధిపత్యానికి గండి కొడతారేమోనని కొత్తగా వచ్చిన నేతలను వైసీపీ లీడర్లు మనస్ఫూర్తిగా ఆహ్వానించడం లేదు. సహకరించడం లేదు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గాన్నే తీసుకుంటే… ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. రెండుసార్లు గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నారు.

ఆధిపత్యం కోసమే…..

మొన్నటి ఎన్నికల ముందు వరకూ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి, కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి మధ్య గ్రూపులుండేవి. కావలి టిక్కెట్ కోసం ఇద్దరూ పట్టుపట్టారు. అయితే కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డికి చెక్ పెట్టడంలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. అంతా బాగుందనుకున్న సమయంలో తాజాగా జగన్ అదే నియోజకవర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త, టీడీపీ నేత బీద మస్తాన్ రావుకు పార్టీ కండువా కప్పేశారు. దీంతో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి మరోసారి ఆధిపత్య పోరు మొదలయిందని చెబుతున్నారు.

క్యాడర్ కు కండువా కప్పాలని….

బీద మస్తాన్ రావు పార్టీలో చేరిన వెంటనే తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. దాదాపు పదేళ్లుగా బీద మస్తాన్ రావు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్నారు. రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై ఒకసారి బీద మస్తాన్ రావు గెలుపొందారు కూడా. బద్ధ వైరుధ్యం ఇద్దరి నేతల మధ్య ఉండటంతో కావలి నియోజకవర్గంలో క్యాడర్ కూడా ఉప్పు నిప్పులా మారింది. బీద మస్తాన్ రావు పార్టీలో చేరిన తర్వాత తన క్యాడర్ కు కూడా వైసీపీ కండువాలు కప్పేయాలని భావించారు. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు.

చేర్చుకోనంటున్న రామిరెడ్డి…..

ఎక్కువ మంది ద్వితీయ శ్రేణి నేతలు పెండింగ్ బిల్లుల కోసం, కాంట్రాక్టు పనుల కోసం బీద వెంట వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కొందరిని తాను పార్టీలో చేర్చుకునేది లేదని బీద మస్తాన్ రావుకు తెలిపారట. వారు వస్తే పార్టీలోని తమ క్యాడర్ ఆందోళనకు గురవుతుందని చెప్పారట. ఎవరెవరని చేర్చుకునేది లేదన్న లిస్ట్ ను రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి బీద మస్తాన్ రావు ముందు ఉంచారట. అయితే బీద మస్తాన్ రావు మాత్రం తన వెంట వచ్చిన వారందరినీ చేర్చుకోవాలంటున్నారట. దీనిపై తన సహచర ఆడిటర్, సీనియర్ నేత విజయసాయిరెడ్డ వద్ద బీద మస్తాన్ రావు పంచాయతీ పెట్టారట. ఎన్నికల ముందు, తర్వాత ఎప్పుడూ కావలి పంచాయతీ జగన్ ముందు ఉంటూనే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News