జగన్ సై అంటే ఎన్నికలే ?

ప్రభుత్వాధినేతలు ఎపుడూ ఎన్నికలు కోరుకోరు. కొందరు ప్రజాదరణ కలిగిన నేతలు మాత్రం దేనికైనా రెడీ అంటారు. అప్పట్లో ఎన్టీఆర్ , ఆ తరువాత వైఎస్సార్ ఇపుడు చూస్తే [more]

Update: 2020-10-26 03:30 GMT

ప్రభుత్వాధినేతలు ఎపుడూ ఎన్నికలు కోరుకోరు. కొందరు ప్రజాదరణ కలిగిన నేతలు మాత్రం దేనికైనా రెడీ అంటారు. అప్పట్లో ఎన్టీఆర్ , ఆ తరువాత వైఎస్సార్ ఇపుడు చూస్తే కేసీయార్, జగన్ తెలుగు రాష్ట్రాల్లో అలా కనిపిస్తారు. వీరందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే అపరిమితమైన జనాదరణ. వారి మీద వారికి మెండైన ఆత్మ విశ్వాసం. ఏపీలో చూసుకుంటే అనూహ్యంగా తిరుపతి ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వచ్చిపడింది. మరో అయిదు నెలల్లో అది జరగడం ఖాయం. ఇది ఎవరూ కోరుకున్నది కాదు, ఇక ఏపీలో ఇపుడు స్థానిక ఎన్నికలు తోసుకువచ్చే సన్నివేశం కనిపిస్తోంది.

వారు వీరుగా …

మార్చిలో కేవలం ఆరేడు కేసులు మాత్రమే ఏపీలో ఉన్న వేళ కరోనా పేరు చెప్పి అర్ధాంతరంగా ఎన్నికలను వాయిదా వేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇపుడు రోజుకు మూడున్నర వేల కేసులు నమోదు అవుతూంటే ఎన్నికలు నిర్వహించడానికి ఆయన తయారు అవుతున్నారు. ఆనాడు నిమ్మగడ్డ చూపించిన కరోనా సాకుని ఇపుడు వైసీపీ సర్కార్ చూపిస్తోంది. ఇక ఎన్నికల సంఘం వెర్షన్ చూస్తే కరోనా తగ్గుముఖం పట్టింది కాబట్టి ఎన్నికలు పెడితే తప్పులేదు అన్నట్లుగా ఉంది. దాంతో వారు వీరు అయ్యారు. మళ్ళీ కొత్త పేచీ మొదలైందన్నమాట.

అదే చేస్తే పోలా ….?

జగన్ విషయానికి వస్తే తెగే దాకా లాగుతారు అని పేరు. నిజానికి నిమ్మగడ్డతో ఆయన ఒక చేదు అనుభవం ఇప్పటికే పొందారు. అయినా రాజ్యాంగ సంస్థ కాబట్టి కోర్టులు నిమ్మగడ్డకే విలువ ఇచ్చాయి. ఇపుడు కూడా అదే జరుగుతోంది. కాబట్టి జగన్ ఈసారి ఘర్షణలకు పోకుండా స్థానిక ఎన్నికలకు తమ వైపు నుంచి అభ్యంతరాలు లేవు అని చెబితే హుందాగా ఉంటుంది. దాని వల్ల టీడీపీ లాంటి ప్రత్యర్ధులు తెర వెనక నుండి ఆడిస్తున్న ఆటలకు చెక్ పడుతుంది. ఎంత కాదనుకున్నా ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలసి పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ సామరస్య వైఖరి అవసరం.

గెలుపు ఖాయమే…..

ఏపీలో ఇపుడున్న రాజకీయ పరిస్థితి ఆలోచిస్తే రాజకీయంగా వైసీపీకే మేలు చేస్తుంది. టీడీపీ జనం నుంచి దాదాపుగా గాయబ్ అయిపోయింది. ఆరేడు నెలలుగా అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. తమ్ముళ్లలో జోష్ అసలు లేదు. వైసీపీలోనో సందడి కనిపిస్తోంది. ఇక జగన్ ఎక్కడా తగ్గకుండా సంక్షేమ పధకలు అమలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఇంకా ఎక్కడా లేదు. జనం ఆశలు అలాగే ఉన్నాయి. నవంబరులో లోకల్ బాడీ ఎన్నికలు అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ కి వైసీపీకి ఎంతో మేలు. గతంలో మాదిరిగానే వైసీపీ బంపర్ మెజారిటీతోనే గెలుస్తుంది. ఈ మధ్య వచ్చిన సర్వేలు కూడా వైసీపీకి ప్రజాదరణ మరింతగా పెరిగిందని చెప్పుకొచ్చాయి. కాబట్టి 2020లొనే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేసుకుంటే అది జగన్ కే కాదు, పార్టీకి అతి పెద్ద బలంగా ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ఆయన ఏమాలోచిస్తారో.

Tags:    

Similar News