బీసీల ఖిల్లాలో జగన్ పాగా

ఉత్తరాంధ్రను బీసీల ఖిల్లాగా చెబుతారు. ఇక్కడ ఉన్న జనాభాలో ఎనభై శాతం బీసీల ఉంటారు. పైగా అనేక కులాలకు చెందిన వారు బీసీల్లో ఇక్కడే కనిపిస్తారు. ఉత్తరాంధ్ర [more]

Update: 2020-10-24 14:30 GMT

ఉత్తరాంధ్రను బీసీల ఖిల్లాగా చెబుతారు. ఇక్కడ ఉన్న జనాభాలో ఎనభై శాతం బీసీల ఉంటారు. పైగా అనేక కులాలకు చెందిన వారు బీసీల్లో ఇక్కడే కనిపిస్తారు. ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోటగా నిలిచి ఎన్నో విజయాలను నమోదు అయ్యేలా చూసింది. అటువంటి మూడు జిల్లాలు ఇపుడు తమ రూటు మార్చుకున్నాయి. గత ఏడాది జగన్ ప్రభంజనం ఈ జిల్లాలలో వీచింది. విజయనగరం జిల్లా అయితే టీడీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చెక్ పెట్టేశారు. అటువంటి బీసీల జిల్లాలకు జగన్ పెద్ద పీట వేశారు. ఏపీ మొత్తంగా 56 కార్పొరేషన్లు ఉంటే ఏకంగా 15 కార్పొరేషన్లను ఈ మూడు జిల్లాలకే పంచారంటే జగన్ బీసీ పక్షపాతం ఏంటన్నది అర్ధమవుతుంది అంటున్నారు.

సిక్కోలుకే…..

ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లాకు ఎన్నడూ లేని విధంగా ఆరు కార్పొరేషన్లు దక్కాయి. ఇది రాష్ట్రంలోనే ఎక్కడా లేదు. అన్ని జిల్లాలకు నాలుగు మాత్రమే కార్పొరేషన్లు ఇచ్చిన వైసీపీ సర్కార్ ప్రత్యేకించి ఈ వెనకబడిన జిల్లాకు మాత్రం సింహ భాగమే ఇచ్చేసింది. దీంతో ఎక్కడలేని హుషార్ వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. అదే విధంగా విశాఖ జిల్లాకు అయిదు కార్పొరేషన్లు లభించాయి. ఇది కూడా రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వనంత పెద్ద సంఖ్యగానే చూడాలి. విజయనగరానికి నాలుగు కార్పొరేషన్లు దక్కాయి. మొత్తానికి సమతూకం పాటించడమే కాకుండా అన్ని బీసీ కులాలు కవరయ్యేలా వైసీపీ తగిన జాగ్రత్తలు తీసుకుంది అంటున్నారు.

అచ్చెన్న టార్గెట్……

అదే విధంగా శ్రీకాకుళంలో అతి పెద్ద బీసీ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని టార్గెట్ చేస్తూ జగన్ పదవుల పంపిణీ చేసినట్లుగా కనిపిస్తోంది. అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం నుంచి పేరాడ తిలక్ ని ఏకంగా కాళింగ కర్పొరేషన్ చైర్మన్ని చేశారు. శ్రీకాకుళంలో కాళింగులే అతి పెద్ద జనాభా. వీరే బీసీలలో చురుకైన రాజకీయం చేస్తారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిలక్ కేవలం ఆరు వేల ఓట్ల తేడాతో అచ్చెన్న మీద ఓడారు. ఇపుడు ఈ కొత్త పదవితో ఆయన పాత శత్రువు మీద కత్తి దూసేందుకు అవకాశం ఏర్పడింది అంటున్నారు. ఇప్పటికే టెక్కలిలో మరో బలమైన కాళింగ నేత దువ్వాడ శ్రీనివాస్ పార్టీ ఇంచార్జిగా ఉన్నారు. ఇద్దరూ కలిస్తే అచ్చెన్నకు చుక్కలు కనిపించడం ఖాయం అంటున్న్నారు.

చేసి చూపించారుగా……?

బీసీల పార్టీ అని టీడీపీ గత నాలుగు దశాబ్దాలుగా చెప్పుకుంటూనే ఉంది. కానీ బీసీల్లో పేరుకు మూడు నాలుగు కులాలకే పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు దక్కుతూ వచ్చాయి. లెక్క తీస్తే బీసీ కులాలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. కానీ మిగిలిన వారిని తొక్కి పెట్టి పేరున్న బీసీ కులాలనే చంద్రబాబు చేరదీశారు దాంతో జగన్ అన్ని బీసీ కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. బీసీల మద్దతు పూర్తిగా సొంతం చేసుకునేందుకు వైసీపీ చేసిన ఈ కసరత్తు ఫలిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News