విశాఖను మరచిపోని జగన్ ?

జగన్ కి విశాఖ మీద ప్రేమ ఎక్కువైనకొద్దీ ఆయనకు ఈ సిటీ దూరంగా జరుగుతోంది. జగన్ 2014లో అధికారంలోకి వస్తే విశాఖ గురించి మాట్లాడేవారో కాదో తెలియదు [more]

Update: 2020-10-24 09:30 GMT

జగన్ కి విశాఖ మీద ప్రేమ ఎక్కువైనకొద్దీ ఆయనకు ఈ సిటీ దూరంగా జరుగుతోంది. జగన్ 2014లో అధికారంలోకి వస్తే విశాఖ గురించి మాట్లాడేవారో కాదో తెలియదు కానీ ఇపుడు మాత్రం ఆయన మదిలో విశాఖ ప్రేమ దేవత అయిపోయింది. 2014 ఎన్నికల్లో తన మాతృమూర్తి విజయమ్మని లక్ష ఓట్ల తేడాతో విశాఖ జనం ఓడించారు. అలా విశాఖ గురించి తొలిసారి ఆలోచించిన జగన్ ఆ తరువాత 2019 ఎన్నికల వేళ కూడా విశాఖ నుంచి గట్టి ఝలక్ ఎదుర్కొన్నారు. ఏకంగా సిటీలోని నాలుగు సీట్లూ టీడీపీకే జైకొట్టాయి. బహుశా దాంతో మరింత బలంగా విశాఖ ప్రేమ జగన్ మనసులో నాటుకుందని చెప్పాలేమో.

రాజధాని ఊసు…..

ఇదిలా ఉండగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలసి జగన్ విజయవాడ ఫ్లై ఓవర్ ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడిన మాటలు ఆసక్తిని కలిగించాయి. విశాఖను పాలనారాజధానిగా చేస్తున్నామని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. విశాఖ సిటీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ అయిదు లైన్ల రహదారుల నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విశాఖ మెగా సిటీ అని, అక్కడ అటువంటి రోడ్లు అక్కడ అవసరం అని కూడా జగన్ నొక్కిచెప్పారు. దీనివల్ల ఆయనకు విశాఖ మీదున్న మోజు మరోమారు రుజువు అయిందని అంటున్నారు. అలాగే విశాఖ రాజధాని మీద ఆయన పట్టుదల కూడా చెదిరిపోలేదని కూడా చెబుతున్నారు.

వచ్చే ఏడాదేనా……?

విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్న జగన్ ఆలోచనలు ఈ ఏడాదిలో అసలు నెరవేరే అవకాశాలు అయితే కనిపించడంలేదు. ఓ వైపు రోజూ వారీ విచారణకు హై కోర్టు అమరావతి రాజధాని మీద పిటిషన్లను స్వీకరించింది. అవి విచారణ జరిగి తీర్పు రావాలంటే చాలా టైం పట్టేలా ఉంది. దాంతో మరో రెండు నెలల్లో ముగియనున్న 2020లో జగన్ ఆశలు తీరవని గట్టిగానే చెప్పవచ్చు. దాంతో జగన్ కొత్త ఏడాది మీదనే ఆశలు పెట్టుకున్నారని అంటున్నారు.

ఆటంకాలు వస్తాయా…?

మరో వైపు చూస్తే జగన్ మీద సీబీఐ పెట్టిన కేసులు రోజు వారీ విచారణకు వచ్చాయి. ఎంత నెమ్మదిగా సాగినా తీర్పులు మాత్రం కచ్చితంగా ఏడాదిలో వెలువరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో ఇప్పటి నుంచి చూసుకుంటే వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి జగన్ కేసుల విషయంలో ఏదో ఒకటి తెలుస్తుంది. అంటే రాజధాని కేసుల న్యాయ వివాదాల నుంచి బయటపడినా జగన్ తన సొంత కేసుల విషయంలో ఇబ్బందులో పడితే మాత్రం విశాఖ కు వెళ్ళే ముచ్చట మాత్రం ఎప్పటికీ తీరదు అన్న మాట కూడా ఉంది. మరి జగన్ కి సీబీఐ ఈడీ నుంచి క్లీన్ చిట్ వస్తే ఆయన్ని ఎవరూ అడ్డుకునేవారు ఉండరని కూడా అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే 2021లోనైనా జగన్ విశాఖ మోజు తీరుతుందా లేదా అన్నది ఇప్పటికైతే ఎవరూ చెప్పలేని విధంగానే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News