బాబు ఫోబియాతోనే అలా ?

చంద్రబాబు విషయంలో ముఖ్యమంత్రిగా అత్యంత ప్రజాదరణ కలిగిన యువనేత జగన్ అతిగా ఆలోచన చేస్తున్నారా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి. చంద్రబాబు వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అయితే [more]

Update: 2020-10-20 13:30 GMT

చంద్రబాబు విషయంలో ముఖ్యమంత్రిగా అత్యంత ప్రజాదరణ కలిగిన యువనేత జగన్ అతిగా ఆలోచన చేస్తున్నారా అన్న డౌట్లు ఇపుడు వస్తున్నాయి. చంద్రబాబు వ్యూహాలు రూపొందించడంలో దిట్ట అయితే కావచ్చు కానీ ఆయన ఎత్తులు జిత్తులు చాలా సార్లు గురి తప్పాయి కూడా. అంతెందుకు 2019 ఎన్నికల ముందు ఆయన అనేకరకాలైన మాస్టర్ ప్లాన్స్ వేశారు. చివరికి ఏమైంది, బొక్క బోర్లాపడ్డారు. ఇక చంద్రబాబుకు వ్యవస్థలను మ్యానేజ్ చేస్తారని పేరుంది కానీ ఆయన ఇపుడు ఏమీ కారు, అలాంటి ఆయనని నమ్ముకుని ఉన్నత స్థానాలలో ఉన్న వారు అనుసరిస్తారా? అన్నది కూడా ఇక్కడ మరో లాజికల్ పాయింట్. ఇక రాజకీయాలైనా, మరేదైనా అన్నీ కూడా అవసరాల మేరకు ఉన్న బంధాలే. అవన్నీ సామాజిక బంధాలకు అతీతం. అలాంటపుడు ఒకటే సామాజికవర్గం అని అన్ని వ్యవస్థలలో ఉన్న వారు చంద్రబాబుకు ఎందుకు సహకరిస్తారు. తాము ఎందుకు కోరి మరీ బురద జల్లించుకుంటారు అన్నది మరో ప్రశ్న.

ఆ కోణంలోనే….

ఇక జగన్ విషయానికి వస్తే ఎవరినీ నమ్మరు అని అంటారు. అక్కడే ఆయనకూ తండ్రి వైఎస్సార్ కి పెద్ద తేడా ఉందని కూడా చెబుతారు. జగన్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఆయనకు ఎదురైన నమ్మకద్రోహాలు అలాంటివి. అందువల్ల ఆయన వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుని చివరికి ఇలా మారిపోయారని అంటారు. చంద్రబాబు మీద జగన్ కి నిశ్చితమైన అభిప్రాయం ఉంది. ఆయన మ్యానుపలేటర్ అని, తనకు అనుకూలంగా మొత్తం వ్యవస్థలను మార్చుకుంటారని, అది ఎపుడో జరిగితే జరగవచ్చు కానీ అన్ని సార్లూ జరగదు, అలాగనీ అందరూ ఆయన్ని గుడ్డిగా నమ్మాలని లేదు. కానీ జగన్ మాత్రం బాబు ఫోబియాలో ప‌డి కొన్ని అనవసరంగా నెత్తికెక్కించుకుంటున్నారా అన్న చర్చ అయితే పార్టీ లోపలా బయటా కూడా జరుగుతోంది.

చిలవలూ పలవలూ…..

ఎవరికైనా వారి పేరు ఇష్టం. తరువాత కుటుంబం ఇష్టం. ఆ తరువాత కులం, ఉన్న ఊరూ ఇలా విపరీత‌మైన ఇష్టాలు ఉంటాయి. అందులోనే వారి ఉనికి ఉంటుంది. కాబట్టి ఇది ఎవరికైనా సహజం. కానీ దాన్నే పట్టుకుని బాబు సామాజికవర్గం వారంతా ఆయనకే హెల్ప్ చేస్తారని ఒక దురభిప్రాయం ఉంచుకోవడం కూడా జగన్ లాంటి యువనేతకు తగదు అని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో బాబు ఆయనను మొదట సిఫార్స్ చేయలేదు. తరువాత తెచ్చి పదవిలో కూర్చోబెట్టినా ఆయన ఆద్వర్యంలో ఎన్నికలు పెట్టి రాజకీయ లాభాలను పొందలేదు అన్నది ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. కానీ జగన్ ఆ విషయంలో ఎక్కువ చేశారని ఇప్పటికీ అంటారు. ఇపుడు కూడా ఒక న్యాయమూర్తి విషయంలో కూడా జగన్ అతిగా స్పందించి బాబు మీద ద్వేషంతో తనకే చేటు తెచ్చుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

హుందాగా ఉండాలి….

గతంలో కాంగ్రెస్ హయాంలో ఎందరో రెడ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారు టీడీపీ అధికారం నుంచి దిగిపోయాక పదవుల్లోకి వచ్చారు. ఆనాడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో వారు బలమైన ముఖ్యమంత్రులు. సుదీర్ఘమైన అనుభవం ఉంది. అయినా కొందరు తెలుగుదేశం అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నా కూడా బయటకు కిక్కురుమనలేదు. నానా యాగీ చేయలేదు. కానీ వీలు చూసి మరీ కీలెరిగి వాత పెట్టారు. ఆ నైపుణ్యం జగన్ వద్ద లేనందువల్లనే బయట పడిపోతున్నారు అంటున్నారు. ఊరికే బాబు మీద అక్కసుతో జనాలు మరచిపోయిన పెద్ద మనిషికి ఎక్కడ లేని శక్తులు ఆపాదించి పెద్దవాడిని చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఏపీ హైకోర్టులో తీర్పులు ఇబ్బందిగా ఉంటే వాటి మీద నమ్మకం లేకపోతే పొరుగు రాష్ట్రానికి ఆయా కేసులను బదిలీ చేయమని సీఎం హోదాలో అడిగితే జగన్ కు మర్యాదగా ఉండేదని అన్న మాట కూడా వినిపిస్తోంది. అలా కాకుండా రాజ్యాంగంలో అత్యున్నతమైన వ్యవస్థగా ఉన్న న్యాయ వ్యవస్థ మీద అపనమ్మకం కలిగేలా ఆరోపణలు చేయడం యువ ముఖ్యమంత్రి స్థాయికి తగదన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తానికి జగన్ బాబు ఫోబియా నుంచి బయటపడితేనే ఈ తడబాట్లూ తప్పటడుగులూ వేయకుండా ఉండగలరని అంతా అంటున్నారు.

Tags:    

Similar News