అటు ఆర్ఎస్ఎస్.. ఇటు స్వామీజీ..?

జగన్ కి మోడీకి మధ్య బంధం మరింత గట్టిపడేలా చేసిన వారధి ఎవరు అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. బీజేపీకి సిద్ధాంతకర్త, మాతృ [more]

Update: 2020-10-08 08:00 GMT

జగన్ కి మోడీకి మధ్య బంధం మరింత గట్టిపడేలా చేసిన వారధి ఎవరు అన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది. బీజేపీకి సిద్ధాంతకర్త, మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ ఈ కొత్త బంధాన్ని గట్టి చేయాలని పట్టుదలగా ఉందని అంటున్నారు. దేశంలో కమల ప్రభంజనం మరింతకాలం కొనసాగాలని కోరుకుంటున్న ఆర్ఎస్ఎస్ 2024 ఎన్నికల మీద ఇప్పటి నుంచే గురి పెట్టిందని అంటున్నారు. బీజేపీ ప్లస్సులు, మైనస్సులు బాగా అవగతం చేసుకున్న ఆర్ఎస్ఎస్ పెద్దలు దక్షిణాదిన జెండా పాతడం వచ్చే ఎన్నికల నాటికి కూడా బహు కష్టమన్న అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణాలో కొంత అనుకూలత ఉన్నా ఏపీలో మాత్రం బీజేపీకి కాళ్ళూనుకోవడం ఇప్పట్లో కష్టమని విశ్లేషించారని టాక్. ఈ పరిణామాల నేపధ్యంలోనే వారి కన్ను జగన్ మీద పడిందని అంటున్నారు.

చిత్రమే మరి….

కొన్నాళ్ళ క్రితం ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటి అంటే చంద్రబాబు మళ్ళీ మోడీ, బీజేపీ ప్రాపకం కోసం ఆర్ఎస్ఎస్ పెద్దలను ఆశ్రయించారని, వారు ఆ విషయంలో మౌనంగా అంతా విన్నారు కానీ హామీ ఇవ్వలేదని చెబుతారు. అయితే దీని మీద మోడీ, అమిత్ షాల మనసెరిగిన ఆర్ఎస్ఎస్ పెద్దలు బాబుకు మౌనంతోనే సమాధానం చెప్పారని అంటారు. మరో వైపు చూసుకుంటే చంద్రబాబు రాజకీయ అవకాశవాదం పట్ల కూడా ఆర్ఎస్ఎస్ పెద్దలకు పూర్తి అవగాహన ఉండడం చేతనే వారు అంతగా స్పందించలేదని అంటారు. ఇదే సమయంలో చూసుకుంటే ఏపీలో జగన్ వారి దృష్టిలో పడ్డారని అంటున్నారు. గత ఏడాదిన్నర పాలనలో అవినీతి లేకపోవడం, సంక్షేమానికి పెద్ద పీట వేయడం ద్వారా జగన్ మంచి మార్కులు తెచ్చుకోవడంతో ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆయనకు ఓటు వేశారని అంటున్నారు. అంతే కాదు జగన్ పదేళ్ళ రాజకీయ జీవితంలో ఇచ్చిన మాటకు కట్టుబడడం వంటివి చూసిన మీదట నమ్మకమైన నేస్తంగా ఆయన తోచారని అంటున్నారు.

మేలే జరుగుతుందిట ….

ఇక జగన్ కి కొద్ది కాలం క్రితమే బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరమని ప్రతిపాదనలు వచ్చాయి. దాన్ని ఆయన తాను బాగా నమ్మే విశాఖ శ్రీ శారదాపీఠం స్వామీజీతో తన సన్నిహితుల ద్వారా చర్చించారని అంటున్నారు. బీజేపీతో జట్టు కడితే మేలు జరుగుతుందని జగన్ మీద హిందూ వ్యతిరేక ముద్ర పూర్తిగా పోతుందని కూడా స్వామీజీ సలహా ఇచ్చారని చెబుతారు. ఇక జగన్ కి రాష్ట్రానికి కూడా ఈ కొత్త కలయిక వల్ల భారీ ప్రయోజనం సమకూరుతుందని రాజకీయంగా జగన్ బలమైన నేతగా మారుతారని కూడా రాజగురువు స్థానంలో ఉన్న స్వామి విడమరచి చెప్పారని అంటున్నారు. ఆయన ఇచ్చిన సలహాలతోనే జగన్ బీజేపీ వైపుగా సానుకూలత చూపుతున్నారని కూడా అంటున్నారు.

మొత్తానికి కుదిరేదే …..

ఎవరెన్ని చెప్పినా బీజేపీకి జగన్ కావాలి. ఆ విషయంలో మోడీ షా గట్టి పట్టు మీద ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి కూడా సూచనలు అలాగే ఉన్నాయి. ఇక జగన్ శ్రేయోభిలాషులు కూడా దోస్తీ కడితేనే తప్ప చంద్రబాబు వంటి రాజకీయ గండరగండను నిలువరించలేమని చెబుతున్నారుట. అందువల్ల ఈ బంధం గట్టిపడడానికి తెర వెనక చాలా శక్తులే పనిచేశాయని అంటున్నారు మొత్తానికి రేపో మాపో దీనికి సంబంధించిన అతి ముఖ్య ప్రకటన అయితే అంతా వినడమే తరువాయి అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News