అయితే హోదా…లేదా బెయిల్ అవుట్…?

జగన్ ఎక్కడా తగ్గడంలేదు. ఏకంగా మోడీ లాంటి బలమైన ప్రధాని పిలుస్తున్నా పట్టువదలకున్నారు. అపర చాణక్యుడు అయిన అమిత్ షా ఆహ్వానిస్తున్నా కూడా కుదరదు అంటున్నారు. ఇంతకీ [more]

Update: 2020-10-08 03:30 GMT

జగన్ ఎక్కడా తగ్గడంలేదు. ఏకంగా మోడీ లాంటి బలమైన ప్రధాని పిలుస్తున్నా పట్టువదలకున్నారు. అపర చాణక్యుడు అయిన అమిత్ షా ఆహ్వానిస్తున్నా కూడా కుదరదు అంటున్నారు. ఇంతకీ పిలిచి పదవులు ఇస్తామంటే జగన్ కి ఉన్న అభ్యంతరాలు ఏంటి. మూడు తక్కువ పాతిక ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ పార్టీకి పెద్దల సభలో మరో అరడజను మంది ఎంపీలు ఉన్నారు. ఏపీలో చూసుకుంటే ఏడాదిన్నర దాటుతున్నా ఒక్క కేంద్ర మంత్రి కూడా లేరు. ఎంతసేపూ కేంద్రానికి జగన్ విన్నపాలు తప్ప అక్కడ వినిపించుకునేంటంత సీన్ లేదు. ఈ నేపధ్యంలో ఓ విధంగా బంగారం లాంటి అవకాశమే జగన్ ఇంటి తలుపు తట్టిందని అంటున్నారు. ఏపీకి ముగ్గురు కేంద్ర మంత్రులు ఇస్తామని బీజేపీ చెబుతోంది. వారిని చక్కగా వినియోగించుకుంటే అర్జంట్ గా ఏపీకి నిధుల కష్టాలు తీరుతాయి. కేంద్రం అండ ఉంటుంది. రాజకీయ ఇబ్బందులు కూడా చాలా వరకూ తగ్గిపోతాయి.

దొరికిపోతారా ?

అయితే ఇది రాజకీయంగా ఒక వైపు మాత్రమే. రెండవ వైపు చూసుకుంటే కొంత కష్టాలు కూడా వస్తాయి. బీజేపీ మీద ఏపీ జనాలకు ఉన్న కోపం అంతా జగన్ మీదకు మళ్ళుతుంది. ఎన్ని చెప్పుకున్నా ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందన్న బాధ ఆవేదన ఏపీ జనాల్లో ఉంది. దాంతో అదే అస్త్రంగా విపక్షం మార్చుకుంటే జగన్ అడ్డంగా దొరికిపోతారు. మరో వైపు వైసీపీకి బలమైన పునాదులుగా ఉన్న మైనారిటీలు దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక కేంద్రం ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాల ప్రభావాన్ని కూడా జగన్ మోయాల్సివస్తుంది.

అదే తెస్తే మొనగాడే…..

ఇక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి సున్నం పెట్టిన బీజేపీ మీద జనాలు మండుతున్నారు. జగన్ హోదాను తెస్తాను అంటేనే భారీ మెజారిటీతో గెలిపించడమే కాదు ఎంపీలను పెద్ద ఎత్తున ఇచ్చారు. మరి ఇంతా చేసి జగన్ హోదా ఊసు లేకుండా కేంద్రంతో దోస్తీ కడితే జనం ఊరుకుంటారా. అందుకే జగన్ కి అత్యంత సన్నిహితుడైన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వంలో చేరేది అని పక్కా క్లారిటీగా చెప్పేశారు. హోదా విషయంలో రెండవ మాట కూడా లేదనేశారు. బహుశా అది జగన్ మనసులోని మాట కూడా అయి ఉండొచ్చు. ఇదే కనుక గట్టిగా పట్టుపడితే బీజేపీ ఏమంటుందో చూడాలి. హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్పాక ఇక జగన్ దాన్ని తెరిపించి ఏపీకి సాధిస్తే మాత్రం మొనగాడే అవుతాడు అనడంలో సందేహం లేదు.

భారీ ప్యాకేజి ….

ఇక అటు జగన్ హోదా అంటారు, ఇటు బీజేపీ నో అంటుంది కానీ ఇద్దరి మధ్యన రాజీ మార్గం కూడా ఉంటుంది అని అంటున్నారు. అదేంటి అంటే ఏపీకి భారీ ఆర్ధిక ప్యాకేజిని ప్రకటించడం. ప్రత్యేక హోదా కంటే మిన్నగా నిలిచి ఆదుకోవడం. అదే కనుక జరిగితే జగన్ కూడా ఇటు జనాలకూ, అటు విపక్షానికి చెప్పుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే మైనారిటీ వర్గాల నుంచి కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. విశాలమైన రాష్ట్ర ప్రయోజనాల ద్రుష్ట్యా తాను కేంద్రంలో చేరానని జగన్ సమర్ధించుకున్నా పెద్దగా తప్పుపట్టేవారు లేరు. బహుశా ఈ కారణంగానే కేంద్రంలో చేరికపైన జగన్ అండ్ కో ఆలోచిస్తోందని అంటున్నారు. ప్రధానితో జగన్ జరిపిన చర్చలు, అలాగే అమిత్ షాతో వేసిన భేటీలో సారాంశం అంతా విభజన హామీల మీదనే సాగడం విశేషం. అంటే కేంద్రం వీటిని పరిశీలించి ఏదైనా భారీ ఆర్ధిక ప్యాకేజి కనుక ఏపీకి ఇస్తానంటే జగన్ కేంద్రంలో తన మంత్రులను చూసుకోవచ్చునని అంటున్నారు. ఓ విధంగా ఏపీకి ఉన్న ఆర్ధిక బాధలు ఒక్క దెబ్బకు తీరేలా ఫైనాన్షియల్ బెయిల్ అవుట్ కోసం జగన్ ప్రయత్నం చేస్తున్నారు అని కూడా మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News