భజన బ్యాచ్ చేరిపోయిందా? ఇక అయినట్లే?

పార్టీ అన్నది ఉంటేనే అధికారం దక్కుతుంది. పార్టీని పాడుపెట్టిన తరువాత మళ్లీ అధికారం అంటే అది అసాధ్యమే. చంద్రబాబు ఎపుడు అధికారంలోకి వచ్చినా పార్టీని పట్టించుకోరన్న విమర్శలు [more]

Update: 2020-10-04 06:30 GMT

పార్టీ అన్నది ఉంటేనే అధికారం దక్కుతుంది. పార్టీని పాడుపెట్టిన తరువాత మళ్లీ అధికారం అంటే అది అసాధ్యమే. చంద్రబాబు ఎపుడు అధికారంలోకి వచ్చినా పార్టీని పట్టించుకోరన్న విమర్శలు ఆయన కార్యకర్తలే చేస్తారు. అధికారంలో ఉన్నపుడు చుట్టూ భజన బ్యాచ్ చేరుతుంది. ఇక అధికారులతో పని జరిపించాలన్నది కూడా బాబు కనిపెట్టిన కొత్త విద్య. దానివల్ల పాలనలో పార్టీకి భాగస్వామ్యం లేకుండా చేశారు. చివరికి అది టీడీపీ ఓటమికి కారణమైంది. ఇక ఇపుడు చూసుకుంటే జగన్ అచ్చంగా చంద్రబాబు విధానాన్నే అనుసరిస్తున్నారు. ఆయన కూడా జిల్లా క‌లెక్టర్లను నమ్ముతున్నారు. దిగువ స్థాయిలోకి వస్తే వార్డు వాలంటీర్లను నమ్ముతున్నారు. అంటే పార్టీ అసలు అవసరం లేదన్న మాట.

పార్టీ ఆఫీసులేవీ…?

వైసీపీలో ఇపుడు ఎవరూ నోరు విప్పడంలేదు. పార్టీ ఆఫీసుల తలుపులకు తాళాలు పడి చాలా కాలం అయింది. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు తన సొంత ఆఫీసులు తెరచారు. వారి మద్దతుదారులతోనే అవి నడుస్తున్నాయి. మిగిలిన పార్టీ వారికి అక్కడ నో ఎంట్రీ. తమను ఎమ్మెల్యేలు అసలు పట్టించుకోవడంలేదని పార్టీ పెద్దలకు చెబుతామంటే అసలు పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు. జిల్లాల కార్యవర్గాలు ఉన్నాయా. ఈ డౌట్ వైసీపీలోని సగటు కార్యకర్తకు ఉంటే ఇక సామాన్య జనానికి వైసీపీ గుర్తుండాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది.

ప్లీనరీ మాటేమిటి…?

జగన్ 2017లో చివరిసారిగా పార్టీ ప్లీనరీని నిర్వహించారు. ఆ ప్లీనరీలోనే జగన్ పాదయాత్ర మీద అతి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికి మూడేళ్లు అవుతోంది ప్లీనరీ అన్న ఊసే లేదు. మరో వైపు పార్టీ అత్యున్నత విధాయకమండలి అని రాజకీయ వ్యవహారలా కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అతీ గతీ కూడా తెలియడంలేదు. జగన్ విపక్ష నేతగా ఉన్నపుడు చాలామందిని రాష్త్ర కార్యద‌ర్శులుగా, ఉపాధ్యక్షులుగా తీసుకున్నారు. అలాగే ఎంతో మందిని జిల్లా పార్టీ బాధ్యులుగా నియమించారు. మరి వీరిలో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. వారు పార్టీని వదిలేశారు. అధికార పార్టీగా మిగిలిన నేతలను కీలకమైన పార్టీ పదవుల్లో నియమిస్తే వారికీ హుషార్ వస్తుంది. ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీ కూడా పనిచేస్తుంది కదా అని క్యాడర్ అంటోంది.

నాధుడు ఉన్నాడా..?

జగన్ వైసీపీ అధినేత అన్న సంగతిని తాను మరచారో లేక పార్టీ క్యాడర్ కూడా మరచిందో తెలియదు. ఎందుచేతనంటే జగన్ ముఖ్యమంత్రిగానే వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఆయన పార్టీ ప్రెసిడెంట్ గా ఎపుడూ కనిపించడంలేదు. తాడేపల్లిలో రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది. కానీ అక్కడ పార్టీ యాక్టివిటీస్ లేవని అంటున్నారు. ఇక జిల్లాల్లో సమస్యలను చెప్పుకుందామని పార్టీ ఆఫీస్ కి వెళ్తే పట్టించుకునే నాధుడు లేడని వైసీపీ క్యాడర్ ఆక్రోసిస్తోంది. ఇదే విధంగా మరిన్నాళ్ళు జరిగితే వైసీపీకి మిగిలేది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తప్ప పార్టీ నాయకులు ఎవరూ ఉండరని అంటున్నారు. మరి పార్టీ లేకుండా ప్రభుత్వాన్ని నడపడం అంటే దారం వదిలేసిన గాలిపటం లెక్కనే ఉంటుంది అని హితైషులు సలహా ఇస్తున్నారు. ఇప్పటికైనా అధినాయకుడు మేలుకొనాలని అంటున్నారు.

Tags:    

Similar News