జగన్ మౌనం వీడితే ప్రళయం ?

నిశ్శబ్దాన్ని అతి పెద్ద యుద్ధంగా మేధావులు అభివర్ణిస్తారు. సాధారణంగా మాట్లాడేవారు ఎవరూ ఆచరణలో పెద్దగా కనిపించరు. కానీ సైలెంట్ గా ఉన్న వారే వైలెంట్ గా మారిపోతారు. [more]

Update: 2020-09-23 06:30 GMT

నిశ్శబ్దాన్ని అతి పెద్ద యుద్ధంగా మేధావులు అభివర్ణిస్తారు. సాధారణంగా మాట్లాడేవారు ఎవరూ ఆచరణలో పెద్దగా కనిపించరు. కానీ సైలెంట్ గా ఉన్న వారే వైలెంట్ గా మారిపోతారు. ఇపుడు ఏపీ సీఎం జగన్ మౌనం వెనక అతి పెద్ద తుఫాన్ దాగుందా. ఆ విషయాన్ని పసిగట్టినట్లుగా స్పీకర్ తమ్మినేని సీతారాం చేబుతున్నారు. గత ఏడాదిన్నరగా జగన్ కి కోర్టులో అక్షింతలు పడుతున్నాయి. దాదాపుగా ప్రతీ జీవో మీద విపక్షాలు కోర్టుకెళ్ళడం స్టే తేవడం అనవాయితీగా మారిపోయింది. దేనికైనా హద్దు ఉంటుంది, అది దాటితేనే కధ కీలకమైన మలుపు తిరుగుతుంది.

బద్దలవుతుందా …..?

ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన చంద్రబాబు అవినీతి మీద మొదటి నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్ విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి కూడా అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ వస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని కూడా అని నాడు చెప్పారు. ఇపుడు జగన్ అదే పని మీద ఉన్నారు. అమరావతి భూముల మీద ఏసీబీ విచారణ కోసం జగన్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. ఆ తరువాత కోర్టు స్టే ఇచ్చేసింది. దాంతో ఎన్నడూ లేనిది వైసీపీ పెద్దల్లో అసహనం కట్టలు తెంచుకుంటోంది. గత ఏడాదిగా అనేక పరిణామాలు జరుగుతున్నా ఈ విషయాన్ని జగన్ వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారని అంటున్నారు. దాంతో జగన్ లోని సహనం బద్దలవుతుందా అన్న చర్చ అయితే బయల్దేరింది.

స్విచ్ ఎక్కడ ఉందో…?

హఠాత్తుగా జగన్ ఢిల్లీ పర్యటన కూడా ఇందులో భాగంగానే చూడాలని అంటున్నారు. ఏపీలో పాలన సరిగ్గా సాగనీయకుండా చేసే కుట్ర జరుగుతోందని జగన్ సర్కార్ అర్ధం చేసుకునేసరికి పుణ్యకాలం ఏడాదిన్నర గడచిపోయింది. ఇపుడు జగన్ ప్రతి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏపీలో ప్రతీ నిర్ణయానికి బ్రేకులు పడుతున్న తీరుపై ఇపుడు జాతీయ స్థాయిలో వైసీపీ నేతలు చర్చకు పెట్టారు. అంతే కాదు, స్విచ్ ఢిల్లీలోనే ఉందని కూడా కొత్త గుట్టు కనుగొన్నారు. ఆ స్విచ్ ని ఆపేయడానికే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఆయన ఎన్డీయే పెద్దలకు భేషరతుగా మద్దతు ఇవ్వడం వెనక కూడా ఇదే వ్యూహం ఉందని అంటున్నారు. తనకు కావల్సినవి చేసిపెట్టమని కోరేందుకే జగన్ ఢిల్లీ యాత్రను అర్జంటుగా పెట్టుకున్నారని అంటున్నారు.

ప్రళయమేనట…..

ఇదిలా ఉండగా స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. జగన్ మౌనం బద్దలు కొట్టే ప్రయత్నం ఏపీలో జరుగుతోందని, అదే అయితే మాత్రం ప్రళయమే చూడాల్సివుంటుందని తమ్మినేని అంటున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి పాలించే అవకాశం లేకుండా చేస్తున్నారని కూడా ఆయన విపక్షల తీరు మీద మండిపడుతున్నారు. తాము తప్పులు చేస్తే అయిదేళ్ళ తరువాత ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు. అలాంటపుడు తమను పనిచేయనీయకుండా అడ్డుకోవడమేంటని కూడా ఆయన నిలదీస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన వ్యవస్థల మధ్యన మంచి వాతావరణం ఉండాలని, ఘర్షణ ఎవరికీ మంచిది కాదని కూడా తమ్మినేని అంటున్నారు మొత్తానికి జగన్ ధర్మాగ్రహం ఎలా ఉంటుందో, ఏపీలో ఏ రకమైన పరిణామాలు జరగనున్నాయో చూడాలి.

Tags:    

Similar News