జగన్ ని మోడీ లైట్ తీసుకుంటున్నారా ?

జగన్. రాజకీయ వ్యూహాల కంటే పంతాలు పట్టుదలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్ధులు లేరు. ఉన్నది శత్రువులు. ఆయనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె [more]

Update: 2020-09-21 14:30 GMT

జగన్. రాజకీయ వ్యూహాల కంటే పంతాలు పట్టుదలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్ధులు లేరు. ఉన్నది శత్రువులు. ఆయనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె పుత్రుడు రాహుల్ గాంధీ, ఏపీలో చంద్రబాబు పరమ రాజకీయ శత్రువులు. వీరి విషయంలో జగన్ రెండో మాట లేకుండా నో చెబుతారు. వీరి ముఖానికి చూసేందుకు కూడా జగన్ ఇష్టపడరని అంటారు. అవును జగన్ పదహారు నెలలు జైలు జీవితానికి అనేక కష్టాలకు వీరే కారణం అన్నది ఆయనతో పాటు అభిమానుల వేదన కూడా.

మోడీతో బంధం….

ఇక జగన్ అధికారంలోకి వచ్చారు. కష్టాలు తీరినట్లే అనుకుంటే కొత్త కష్టాలు సవాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతీ రోజూ ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే శత్రువుకు శత్రువు తనకు ఆప్త మిత్రుడు అన్న విధంగా జగన్ మోడీని ఆకాశానికెత్తేస్తున్నారు. జగన్ సీఎం అయిన కొత్తలో తిరుపతికి మోడీ వస్తే ఆయన పాదాలకు కూడా జగన్ నమస్కారం చేశారు. అది జగన్ మెంటాలిటీకి కూడా అసలు కుదరని వ్యవహారం. ఇదంతా ఎందుకు చేశారంటే అటు సోనియాకు, ఇటు చంద్రబాబుకూ మోడీ అతి పెద్ద శత్రువు కాబట్టి. ఆ విధంగా మోడీ తనకు ఆత్మ బంధువుగా జగన్ భావించి ఆయనకు సరెండర్ అయ్యారు.

అదే ప్లస్ ….

ఇక రాజకీయంగా తలపండిన మోడీ జగన్ లోకి ఈ బలహీనతను చూసి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లో సోనియతో జట్టు కట్టరని మోడీకి బాగా తెలుసు. అంతే కాదు, ఏపీలో చంద్రబాబు తో ఆజన్మ వైరం జగన్ ది అని కూడా మోడీకి అవగాహన ఉంది. దాంతో తన కంటే జగన్ కి వేరే ఆధారం లేదన్న సంగతిని కూడా ఆయన బాగా గ్రహించారు. దానికి తోడు ఏపీ రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు జగన్ పోటీ పడుతూ మోడీకి మొక్కుతున్నారు. అయితే జగన్ కి 28 మంది ఎంపీల (రాజ్యసభ సభ్యులతో) మద్దతు ఉంది. పైగా ఏపీలో బలమైన అధికార పక్ష నేతగా ఉన్నారు. దాంతో మోడీ జగన్ మద్దతుని పూర్తిగా వాడుకుంటూ కేంద్రంలో సునాయాసంగా ప్రభుత్వాన్ని నడిపేస్తున్నారు. ఎగువ సభలో బిల్లులను కూడా ఈజీగా
నెగ్గించుకుంటున్నారు.

ఎందుకో అలా…?

సరే జగన్ నుంచి ఇంత సహకారం పొందుతున్న మోడీ సర్కార్ ప్రతిఫలంగా ఏపీకి ఏమిస్తోంది అంటే రిక్త హస్తమే అని చెప్పాలి. గత నెలలో కేంద్రానికి జగన్ తాము ఖర్చు చేసిన పోలవరం నిధులు విడుదల చేయమని కోరుతూ లేఖ రాస్తే అందులో 760 కోట్ల నిధులకు కొర్రీ పెట్టారు. మిగిలిన వాటిని నెమ్మదిగా విడుదల చేస్తామని తాపీగా ఒక లేఖ రాశారు. ఇక ఏపీకి ఆర్ధిక ప్యాకేజీలు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడంలేదు. అప్పులు చేసుకుని పప్పు కూడు వండుకోమంటున్నారు. ప్రత్యేక హోదా ఊసే లేదు, ప్యాకేజి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మరో వైపు చూస్తే జగన్ సొంత సమస్యలు అయినా కేంద్రం పరిష్కరిస్తోందా అంటే అదీ లేదు అంటున్నారు. అమరావతి రాజధాని భూముల విషయంలో సీబీఐ విచారణ కోరుతూ ఆరు నెలల క్రితం జగన్ లేఖ రాస్తే బుట్టదాఖలు చేశారు. ఇపుడు ప్ల కార్డులు పట్టుకుని వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో తిరగాల్సివస్తోంది.

ఇదేనా స్ట్రాటజీ……

అలాగే శాసన మండలి రద్దు విషయంలో జగన్ మాట నెగ్గలేదు, ఇక చెవిలో జోరీగ మాదిగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణంరాజు జగన్ మీద నిత్యం రెచ్చిపోతున్నారు. ఆయన ఎంపీ సభ్యత్వం రద్దు చేయండి అని జగన్ మొరపెట్టుకున్నా అక్కడ కరుణించేవారు లేదు. ఇవన్నీ చూస్తూంటే జగన్ తనకేదో కోరిక ఉండి మరీ మోడీకి మద్దతు ఇస్తున్నారు తప్ప మాకెంటి అన్నట్లుగా కేంద్రం లైట్ తీసుకుంటున్నట్లుగా ఉంది. ఏపీ రాజకీయాల్లో ఏమీ చేయలేక బాబు మీద ప్రతీ దానికీ ఓడిపోతూ వాడిపోతూ జగన్ ఉండాలన్నదే మోడీ బ్యాచ్ కోరిక అయినా అయిఉండాలేమో.

Tags:    

Similar News