వారికే టిక్కెట్ అట.. జగన్ డిసైడ్ చేశారు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే సంప్రదాయాన్ని పాటించబోతున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీనిపై త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. [more]

Update: 2020-09-26 12:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదే సంప్రదాయాన్ని పాటించబోతున్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. దీనిపై త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయబోతోంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరు అన్న చర్చ జరుగుతోంది. దుర్గాప్రసాద్ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

బల్లి కుటుంబానికే….

బల్లి దుర్గాప్రసాద్ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన అంతకుముందు టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగారు. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిపోవడంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి లేరని దుర్గాప్రసాద్ వైసీపీలో చేరారు. దుర్గాప్రసాద్ గూడూరు అసెంబ్లీ టిక్కెట్ ను ఆశించారు. కానీ జగన్ మాత్రం అప్పటి వరకూ తిరుపతి ఎంపీగా ఉన్న వరప్రసాద్ కు గూడూరు టిక్కెట్ ఇచ్చి బల్లి దుర్గాప్రసాద్ కు తిరుపతి ఎంపీ టిక్కెట్ ను ఇచ్చారు.

సంప్రదాయంగా….

సహజంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇస్తుండటం సంప్రదాయంగా వస్తుంది. ఈ నేపథ్యంలో దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దాని వల్ల సానుభూతితో పాటు సంప్రదాయాన్ని పాటించినట్లవుతుందన్నది జగన్ ఆలోచన. అందుకే దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.

పోటీ ఉన్నా….

దీనివల్ల విపక్షాలు కూడా పోటీకి దూరంగా ఉంటారన్నది కూడా జగన్ భావన. కానీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏకగ్రీవానికి అవకాశం లేదు. టీడీపీ, బీజేపీ, జనసేనలు తమ అభ్యర్థులను బరిలోకి దించే అవకాశముంది. అందుకోసమే సానుభూతి ఈ ఎన్నికల్లో రావాలంటే దుర్గాప్రసాద్ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రకటన జగన్ త్వరలోనే చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కించనుంది.

Tags:    

Similar News