ఆ వ్యవస్థలకు నడిబజార్లో పరీక్ష పెట్టారా?

జగన్…పేరుకు మూడు అక్షరాలే కానీ మూడు చెరువుల నీళ్ళు ప్రత్యర్ధులకు తాగించే దమ్ము ఉన్నవాడు. జగన్ డేరింగ్ ఆయన తండ్రి వైఎస్సార్ నుంచి కూడా ఊహించలేము అంటారు [more]

Update: 2020-09-18 05:00 GMT

జగన్…పేరుకు మూడు అక్షరాలే కానీ మూడు చెరువుల నీళ్ళు ప్రత్యర్ధులకు తాగించే దమ్ము ఉన్నవాడు. జగన్ డేరింగ్ ఆయన తండ్రి వైఎస్సార్ నుంచి కూడా ఊహించలేము అంటారు కరడు కట్టిన అభిమానులు. అది నిజమే కూడా. జగన్ తెగింపు, తెగే దాకా లాగే మొండితనం వైఎస్సార్ కి పూర్తి భిన్నం. వైఎస్సార్ నే నిత్య అసమ్మతివాది, అలుపెరగని పోరాటయోధుడు అంటే జగన్ గురించి ఇంకా పదింతలు ఎక్కువే చెప్పాలి. జగన్ తండ్రిలా అసమ్మతి తెలియచేసి ఊరుకునే రకం కాదు, తనకు ఏం జరిగిందో ఇంతకు ఇంతా ప్రత్యర్ధులకు రుచి చూపించి కానీ వదలని రకం. అందుకే జగన్ గిర్రున పదేళ్ళు తిరగకుండానే తాను కోరుకున్న సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం పతనంలో పాతాళం అంచులు చూస్తున్నారు.

ఏటికి ఎదురీతే ….

జగన్ ది దూకుడు అనిపించవచ్చు. కానీ పేరుకు ప్రజాస్వామ్యంగా ఉన్న ఈ దేశంలో ఏడు పదుల స్వాతంత్రం పూర్తి అయిన తరువాత అధికారంలోకి వచ్చినవాడు జగన్. ఆయన వచ్చేటప్పటికే మేడిపండు ప్రజాస్వామ్యం కధలు అందరికీ తెలిసినా ఏం చేయలేని నిస్సహయ స్థితి. కొన్ని వ్యవస్థలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయాయి. ఎటు చూసినా కులం, అవినీతి పంకిలం అయిన వ్యవస్థలతో సమాజం సర్వనాశనం అయిన దైన్య స్థితి ఉంది. జగన్ ఇపుడు ఒక్క రాజకీయ వ్యవస్థతోనే పోరాడడంలేదు, అనుబంధంగా ఉంటూ తనకు ఎదురువస్తున్న అన్ని వ్యవస్థల మీద పోరాటం చేస్తున్నారు. నడివీధిలో పరీక్షకు పెట్టి వాటి విశ్వసనీయతను, చిత్తశుద్ధిని సామాన్యుడి ముందు చర్చకు పెడుతున్నాడు.

దేనికైనా రెడీ ….

జగన్ లో ఉన్న ఆ మొండితనమే ఈ వ్యవస్థలతో అవస్థలు పడుతున్న వారందరికీ నచ్చేది. ఈ దేశంలో పెద్ద వారు, పలుకుబడి ఉన్న వారు ఒక రకమైన జీవితాన్ని, ఏమీ లేని వారు మరో రకమైన బతుకును గడుపుతున్నారు. అటువంటి వారంతా మన ఖర్మ ఇంతేనని సరిపెట్టుకుంటున్నారు తప్ప వ్యవస్థలతో పోరాడే ఓపిక తీరిక వారికి లేవు. కానీ జగన్ మాత్రం ఏకంగా మొత్తం వ్యవస్థలు ఉన్నవి ప్రజా శ్రేయస్సుకేనని నిరూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ దేశంలో ఏ వ్యవస్థ అయినా ప్రజలు పన్నులుగా తమ చెమటను తీసి కట్టిన సొమ్ముతోనే నడుస్తోంది. ప్రజా వికాసం కోసమే అన్ని వ్యవస్థలు పనిచేయడమే అంతిమ విధానం కావాలి. అటువంటిది తెలియని లింకులు, డొంకలు పెట్టుకుని సాగుతున్న వ్యవస్థల వల్ల పేదవారికి ఏమి ప్రయోజనం లభిస్తోంది అన్నది ఈ రోజు మేధావులలోనూ వస్తున్న చర్చ. జగన్ వీటిని ముందుకు జరిపి అతి పెద్ద చర్చకు ఈ రోజు ఆస్కారం కల్పిస్తున్నారు అనుకోవాలి. ఈ ప్రయత్నంలో ఆయన ఎందాకైనా అని అంటున్నారు.

కఠిన దీక్షతో…..

జగన్ ముఖ్యమంత్రి అవాలనుకున్నది తండ్రికి వారసుడిగా మాత్రమే. అది 2010 నాటి మాట. ఇక 2014లో సీఎం కావాలనుకున్నది ఈ దేశంలో రాజకీయ రాక్షసత్వాన్ని తుదముట్టించేదుకు, 2019 నాటికి ఆయన ముఖ్యమంత్రి అవాలనుకున్నది మాత్రం రాజకీయ వ్యవస్థలో సమూల మార్పుల కోసం. ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఆలోచనలు, లక్ష్యాలు కూడా ఇంకా విస్తరించుకుంటున్నాయి. రాజకీయ వ్యవస్థ చుట్టూ అల్లుకున్న అల్లిబిల్లి వ్యవస్థలలో మార్పు కోసం జగన్ కఠిన దీక్షతోనే ముందుకు సాగుతున్నాడనుకోవాలి. నిజానికి ఈ దేశంలో మార్పులు అంత తొందరగా రావు. అధికారంలో ఉన్న ఏ నాయకుడూ ఆ వైపుగా ఇంతవరకూ ద్రుష్టి సారించలేదు. కానీ ఒకే ఒక్కడిగా ఇన్నాళ్లకు స్వతంత్ర భారత దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలలో మార్పు కోరుతూ విప్లవ శంఖమే పూరిస్తున్నారు. చిత్రమేంటంటే జగన్ కారణంగా ఇపుడు కీలకమైన వ్యవస్థలలో లోపాలు సగటు జీవి నుంచి మేధావుల వరకూ చర్చకు వస్తున్నాయి. ఇది జగన్ మొదలెట్టిన యాగం. జగన్ పంతానికి పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News