కమలం కట్టడికి జగన్ కసరత్తు ?

జగన్ ఇపుడు ఒక విషయం మీద కిందా మీద పడుతున్నారుట. ఏపీలో టీడీపీని బదనాం చేయడానికే ఇంతకాలం దృష్టి పెట్టిన జగన్ కి ఇపుడు పులి మీద [more]

Update: 2020-09-21 03:30 GMT

జగన్ ఇపుడు ఒక విషయం మీద కిందా మీద పడుతున్నారుట. ఏపీలో టీడీపీని బదనాం చేయడానికే ఇంతకాలం దృష్టి పెట్టిన జగన్ కి ఇపుడు పులి మీద పుట్ర అన్నట్లుగా బీజేపీ జనసేన కూటమి దూసుకురావడం షాకింగ్ పరిణామం అంటున్నారు. బీజేపీని చాలా తేలిగ్గా జగన్ తీసుకున్నారు. రెండు సీట్లలో ఓడిపోయిన తరువాత సంచీ సర్దేసి షూటింగ్ చేసుకుంటాడని పవన్ విషయంలోనూ తప్పుడు అంచనా వేశారు. కానీ ఈ ఇద్దరూ అనూహ్యంగా కలసి జగన్ సర్కార్ మీదకు దండయాత్రకు రావడమే కాదు, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అతి పెద్ద ఆందోళనగా అంతర్వేది రధం ఘటనను మార్చేసి జగన్ కుర్చీ కిందకే నీళ్లు వచ్చేలా చేశారు. ఈ పరిణామాన్ని జగన్ అసలు జీర్ణించుకోలేకపోతున్నారుట.

పైఎత్తు వేసినా…?

మొత్తానికి రాగల ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన జగన్ సీబీఐ విచారణతో ఈ రెండు పార్టీల నోరు టెంపరరీగా మూయించినా వారికి ఏపీలో ఎలా ప్రవేశించాలో పొలిటికల్ రూట్ దొరికేసిందని జగన్ మదనపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఆలయాల మీద దాడులు, రధాలు తగలబడిపోవడాలు, ఆలయాలు కూల్చివేతలు చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. కానీ నాడు ఏ మాత్రం ఆందోళన చేయడానికి సాహసించని బీజేపీ జనసేనలకు జగన్ సర్కార్ లో ఒక బలహీనత కనిపించడమే ఇంతటి ఆందోళనకూ బీజం వేసిందని అంటున్నారు.

దాన్ని అడ్డంపెట్టి……

ఇక జగన్ క్రిస్టియన్ అని అంతర్వేది ఆందోళన సందర్భంగా పదే పదే మీడియా ముఖంగా జనాలలో ఫోకస్ అయ్యేలా బీజేపీ నేతలు సున్నిత విషయాన్ని తెచ్చారు. ఇదే ఇపుడు వైసీపీలో అతి పెద్ద చర్చగా ఉంది. జగన్ ఇప్పటికిపుడు తన మతాన్ని మార్చుకోలేరు. పైగా దాన్ని టార్గెట్ చేస్తూంటే ఇవాళ కాకపోయినా రేపు అయినా జనంలోకి అది పోతే అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ అధినాయకత్వం భయపడుతోంది. రాజకీయాలకు మతాన్ని ముడిపెట్టి వాడడం మంచి విధానం కాకపోయినా ఇపుడు అంతా అదే చేస్తున్నారు. దాంతో జగన్ బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని గట్టిగా నిర్ణయించినట్లుగా చెబుతున్నారు.

హోదా అందుకేనా..?

ఏపీలో ప్రత్యేక హోదా కోరుతూ మరింత గట్టిగా డిమాండ్ కేంద్రం ముందు పెట్టడానికి జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. తన పార్టీ ఎంపీలకు ఈ విషయంలోనే జగన్ దిశానిర్దేశం చేశారని చెబుతున్నారు. బీజేపీని, మోడీని నిండు పార్లమెంట్ లో నిలదీయాలని కూడా జగన్ ఆదేశలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను చాలా పద్ధతిగా బీజేపీకి రాజ్యసభలో మద్దతు ఇవ్వడమే కాకుండా అనేక కీల‌క బిల్లులకు కూడా ఆమోదం తెలుపుతున్నా కూడా ఇలా ఏపీని బీజేపీ ఇలా టార్గెట్ చేయడం మీద జగన్ మండిపడుతున్నట్లుగా చెబుతున్నారు. మరి హోదా విషయంలో జగన్ కేవలం బీజేపీ దూకుడు కి చెక్ చెప్పడానికే వాడుకుంటారా, లేక దీన్ని సీరియస్ గా తీసుకుని ముందుకు సాగుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జగన్ ఇపుడు బీజేపీని కార్నర్ చేయాలని నిర్ణయించుకోవడం ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పుగా చూడాలి.

Tags:    

Similar News