పలికేది జగన్ అట…పలికించేది బీజేపీనట…?

అపుడెపుడో భక్తి కవి పోతనామాత్యుడు తన గురించి తాను చెప్పుకుంటూ పలికేది భాగవతమట‌, పలికించేది రామభద్రుడట అన్నారు. మరి ఈనాటి రాజకీయానికి దానిని అన్వయిస్తే ఏపీ తెరపైన [more]

Update: 2020-09-17 12:30 GMT

అపుడెపుడో భక్తి కవి పోతనామాత్యుడు తన గురించి తాను చెప్పుకుంటూ పలికేది భాగవతమట‌, పలికించేది రామభద్రుడట అన్నారు. మరి ఈనాటి రాజకీయానికి దానిని అన్వయిస్తే ఏపీ తెరపైన హీరోగా జగన్ ఉన్నారు. ఆయన నోట కొన్ని సంక్లిష్ట నిర్ణయాలను తెర వెనక ఉండి బీజేపీ ఢిల్లీ పెద్దలు పలికిస్తున్నారా అన్న డౌట్లు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే మూడు రాజధానుల మీద ఒక్క జగన్ కే మూడ్ ఉందని ఇంతదాకా అందరూ భావించారు. కానీ కేంద్రం వరసపెట్టి కోర్టుకు ఇస్తున్న అఫిడవిట్లు చూసిన వారికి ఇదంతా జగన్ ఒక్కడి ఆరాటమా, లేక బీజేపీ పోరాటామా అనిపించకపోతే తప్పేనేమో.

అలాగే కానిచ్చేయ్…..

ఏపీలో మూడు రాజధానులు అని జగన్ అన్న నాడు ఇదేంటి ఈయన ఇలా ఆలోచిస్తున్నాడు అసెంబ్లీలోని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఇక అప్పటికే ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి రాజధాని ఉండగా ఆ నడిబొడ్డున ఉన్న అసెంబ్లీలో నిలుచుని జగన్ అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేస్తాననడానికి ఎన్ని గుండెలు ఉండాలి. కేంద్రంలో ముడిపడి ఉన్న అతి కీలకమైన విషయం ఇది. పైగా రాజకీయ గండరగండడు చంద్రబాబు కలల రాజధానిని కాదనడానికి ఎన్ని గట్స్ ఉండాలి. మరి జగన్ అప్పటికి ఆరు నెలల సీఎం మాత్రమే. ఏ దన్ను చూసుకుని జగన్ అలా అని ఉంటారని అంతా అనుకున్నారు. తెర వెనక బీజేపీ ఉండి అలాగే కానిచ్చేయ్ అన్న ధైర్యం ఇవ్వకపోతే జగన్ ఇంతా చేసేవారా అన్నది కూడా లాజికల్ పాయింటే మరి.

అందుకోసమేనా…?

ఈ సంగతి సామాన్యులకు నాడు తెలియకపోయినా చంద్రబాబు లాంటి చాణక్యునికి తెలీయకుండా ఉండదు. జగన్ ఒక్కరే మూడు రాజధానులు అన్న మాట అనలేరని బాబు ఎపుడో ఊహించారు. అందుకే బీజేపీని ఇరికించాలని ఈ రోజు వరకూ తన ప్రయత్నాలను తాను చేస్తున్నారు. జగన్ తో పాటు బీజేపీని కలిపి చెడ్డ చేయడం చంద్రబాబు వ్యూహం. అయితే ఆయన నోరెత్తి బీజేపీని, మోడీని ఏమీ అనరు. అలా అంటే ఆయన అడ్డంగా బుక్ అవుతారు అని భయం. అసలు అమరావతిని ముక్కలు చేయడానికి తానే ప్రధాన కారణం అన్న సంగతీ కూడా బాబుకు తెలుసు. అమరావతిని ఫక్త్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేసిన బాబు మీద బీజేపీని అయిదేళ్ళుగా గుస్సా ఉందని అంటారు. అన్ని ఆధారాలు తమ దగ్గర పెట్టుకున్న మీదటనే జగన్ గద్దెనెక్కగానే బీజేపీ ఇలా మూడు ముక్కలాటకు తెరలేపిదని అంటారు.

ఏదైనా లాభమే …?

మరి ఇంత చేస్తున్న బీజేపీకి ఈ విషయంలో లాభం ఏంటి అంటే చంద్రబాబు ఆర్ధిక మూలాలను విచ్చిన్నం చేయాలన్నదే బీజేపీ హిడెన్ అజెండా. అది కూడా తమ చేతికి మట్టి అంటకుండా జగన్ ద్వారా మొత్తం కధను నడిపించేస్తారన్నమాట. ఈ మూడు ముక్కలాట‌ ప్రయోగం ఎక్కడైనా ఫెయిల్ అయితే ఆ పాపం పూర్తిగా జగన్ మోస్తారన్నమాట. పైగా ఒకసారి రాజధాని విశాఖకు వెళ్లగానే కోస్తాలోని అయిదారు జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుందని బీజేపీ వద్ద ఉన్న సమాచారమట. అలా జగన్ మీద వచ్చే వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకుని ఎదగాలన్నది కమలం మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు. మరో వైపు మూడు ముక్కలాట సక్సెస్ అయి ఏపీలో జగన్ బలపడినా కూడా చంద్రబాబుని దెబ్బకొట్టిన రాజకీయ లాభం తమ ఖాతాలోనే ఉంటుందని బీజేపీ ఇలా ద్విముఖ వ్యూహం రచించిందని చెబుతున్నారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మూడు రాజధానులు అయినా మరోటి అయినా కేంద్రం సహాయం లేకపోతే ఏపీ అభివృధ్ధి ఇంచి కూడా ముందుకు సాగదు అన్నది. సో బీజేపీ రాజకీయం చూసి అంతా నోరెళ్ళబెడుతున్నారుట.

Tags:    

Similar News