ఇప్పుడు ఆ భయం పోయినట్లుందే

జగన్ తోనే చావో రేవు అనుకుంటూ పదేళ్ల పాటు రాజకీయ పోరాటం చేశారు ఏపీలోని రెడ్డి సామాజికవర్గం. 2014లోనే జగన్ అధికారంలోకి రావాలి కానీ చేసిన చిన్న [more]

Update: 2019-08-14 02:00 GMT

జగన్ తోనే చావో రేవు అనుకుంటూ పదేళ్ల పాటు రాజకీయ పోరాటం చేశారు ఏపీలోని రెడ్డి సామాజికవర్గం. 2014లోనే జగన్ అధికారంలోకి రావాలి కానీ చేసిన చిన్న పొరపాట్లు కారణంగా జారిపోయింది, దాంతో ఈసారి కసిగా రెడ్లు పనిచేశారు. కడప జిల్లాకు చెందిన రాచమల్లు శివప్రసాదరెడ్డి మాటల్లోనే చెప్పాలంటే రెడ్లు ఈసారి జగన్ కోసం ఎందాకైనా వెళ్ళాలి అనుకున్నారట. అలా జగన్ కోసం చావడానికైనా సిధ్ధమైన రెడ్డి బ్రిగేడ్ ఏపీవ్యాప్తంగా గట్టిగా పనిచెసిందని ఆయన చెప్పారు. మరి అలాంటి వారందరి కృషితో జగన్ ముఖ్యమంత్రి కాగలిగారు. అక్కడివరకూ రెడ్ల ప్రస్థానం ఒక ఎత్తు, తరువాత మరో ఎత్తు. ఎందుకంటే వైసీపీలో గెలిచిన మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో 53 మంది రెడ్డి సామాజికవర్గం వారున్నారు. అంటే ప్రతి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒకరు రెడ్డి అన్నమాట. అటువంటి రెడ్లకు పాతిక మంది వరకూ ఉండే మంత్రివర్గంలో ఎంత శాతం వాటా రావాలి. కచ్చితంగా ఎనిమిది నుంచి పది మంది వరకూ రెడ్లు మినిస్టర్లు కావాల్సింది. కానీ ఇచ్చింది కేవలం నలుగురికి మాత్రమే. దాంతో రెడ్లలో అసంతృప్తి దావానలంగా పెరిగిపోతోంది.

సరైన టైంలో….

దాన్ని గుర్తించలేనంత అమాయకుడు జగన్ కాదు. అయితే జగన్ ఆలోచనలు వేరు. రెడ్లు పార్టీ కోసం కష్టప‌డ్డారు. డబ్బు, వ్యాపారం, పదవులు అన్నీ కోల్పోయి కూడా పనిచేశారు. అలాగని వారికే అన్ని పదవులు ఇచ్చేస్తే ఒక్కసారితోనే ఏపీలో వైసీపీ కధ ముగుస్తుంది. ఇది జగన్ లోని రాజకీయనాయకుని ఆలోచన. పదవులు ఇవ్వకపోయినా రెడ్డి ప్రభుత్వం అన్న పేరు ఎటూ ఉంది. కేవలం కుర్చీలో కూర్చోబెట్టకపోయినా వేరే విధంగా అధికారాన్ని సాధించవచ్చు, శాసించవచ్చు. అంత వరకూ ఎందుకు తానే వారి మనిషి కదా ఇదీ జగన్ ఆలోచన. ఇక ఏపీలో టీడీపీని సమూలంగా ఏరేసే పనిలో జగన్ ఉన్నారు. అందుకోసం ఆయన ఆ వైపు ఉన్న బీసీలను లాగేసే పనిలో పడ్డారు. అందుకే ఎన్నికల్లో ఓటేసి జై కొట్టిన ఆ వర్గం మళ్లీ పక్క చూపులు చూడకుండా అందలం ఎక్కించి కట్టిపడేశారు. అదే సమయంలో రెడ్లకు ప్రాధాన్యత ఏమీ తగ్గలేదని చెప్పడానికి నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట వేస్తున్నారు. అలాగే ఇతర అవకాశాలు వారికే దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇపుడు ఎమ్మెల్సీ పదవి ఎంపికలో చల్లా రామక్రిష్ణారెడ్డికి అవకాశం ఇచ్చి రెడ్లకు తరగని ఆదరణ ఉందని జగన్ నిరూపించారు.

క్లిష్టమైన ఎంపికలోనూ….

నిజానికి ఉన్నవి మూడే ఎమ్మెల్సీ సీట్లు. అందులో ఒకటి కచ్చితంగా మంత్రి మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సిందే. రెండవది మైనారిటీ నాయకుడు ఇక్బాల్ అహ్మద్ కి రంజాన్ పండుగ వేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. దాంతో మిగిలిన ఒక్క సీటు అగ్ర కులానికా, ఇతర వర్గాలకా అన్న చర్చ నడిచింది. పైగా రాజీనామా చేసిన వారిలో ముగ్గురూ అగ్ర వర్ణాలకు చెందిన వారే. దాంతో ఆ వర్గాల నుంచి వత్తిడి ఎక్కువగా ఉంది. ఆళ్ల నాని సీటు కాపులకే ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. కోలగట్ల సీటు కోసం ఉత్తరాంధ్రా వైసీపీ నేతలు పోటీ పడ్డారు. గుంటూరులో మర్రి రాజశేఖర్ కమ్మ వారి కోటాలో సీటు ఆశించారు. ఇంత వత్తిడి మధ్య చల్లా రామక్రిష్ణారెడ్డి ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా జగన్ తన మనసులో రెడ్లకు తగిన స్థానం ఉంటుందని గట్టిగా చెప్పగలిగారు. పైగా రాయలసీమ వాసికి అవకాశం ఇవ్వడం ద్వారా రెడ్డి సామాజికవర్గంలో తన ఆదరణ చెక్కుచెదరకుండా చూసుకున్నారు. ఓ విధంగా జగన్ రాజకీయ తెలివిడిని ప్రదర్శించారు. ఇకపై వచ్చే మరిన్ని పదవుల్లో కూడా రెడ్లకు సముచితమైన స్థానం కల్పించడం ద్వారా జగన్ ఆ వర్గంలో అనవసర భయాందోళనలకు , సందేహాలకు శాశ్వతంగా తెర వేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News