జగన్ ఆ నింద మోస్తారా.. జనం ఒప్పుతారా..?

వైఎస్సార్ కుటుంబం అంటే రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. వారు ఓడిపోవచ్చు కానీ మాటను ఓడిపోనీయరని. వైఎస్సార్ తన జీవితకాలమంతా అలాగే పనిచేశారు. మూడు దశాబ్దాల [more]

Update: 2020-09-12 02:00 GMT

వైఎస్సార్ కుటుంబం అంటే రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. వారు ఓడిపోవచ్చు కానీ మాటను ఓడిపోనీయరని. వైఎస్సార్ తన జీవితకాలమంతా అలాగే పనిచేశారు. మూడు దశాబ్దాల పాటు ఏ అధికార పదవీ లేకుండానే వైఎస్సార్ తనదైన మార్క్ రాజకీయాన్ని చేసి చూపించారు. జనాలు ఆయన్ని చూసి ఏదైనా అడిగేవారు. ఆయన వెనక పదవులు లేవన్న ఫీలింగే వారికి ఎపుడూ లేదు. ఇదంతా ఎందుకంటే ఆయన కుమారుడు జగన్ కూడా తండ్రి లాంటి వారే. పదవులు లేని పదేళ్ల కాలమంతా జగన్ ఏపీలో టాప్ మోస్ట్ లీడర్ గానే ఉన్నారు. జనం కూడా ఆయన్ని అలాగే చూశారు. ఇపుడు ఆయన సీఎం అయ్యారు. మరి ఆయన నుంచి ఇంకా ఎక్కువ కోరుకుంటారు.

అదేనా తెలివి ….

ఉమ్మడి ఏపీ రాజధానిగా పదేళ్ల పాటు హైదరాబాద్ ఉంటే చవకబారు రాజకీయం కోసం చేసిన విఫలయత్నం కారణంగా రాత్రికి రాత్రి పెట్టే బేడా సర్దుకుని ఏపీకి వచ్చేయడమేనా బాబు తెలివి అన్న విమర్శలు ఎప్పటికీ ఉంటాయి. ఇక ఏపీని ఆర్ధికంగా ముందుకు తీసుకెళ్ళాను అని పదే అదే చెబుతున్న చంద్రబాబు తన పాలనలో దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల అప్పు చేయడం సమర్ధత అని చెప్పుకుంటారా అన్నది జనం నుంచి వచ్చే ప్రశ్నే. హుదూద్ లాంటి ప్రక్రుతి విప్పత్తులే కాదు, కృష్ణా, గోదావరి పుష్కరాల వేళ జనం చనిపోయినపుడు బాబు చేసిందేంటి అన్న చర్చ ఉండనే ఉంది. ఇపుడు కరోనాతో ఏపీ హడలెత్తుతోంది. ఒక్క ఏపీకే ఆ బాధ లేదు, ప్రపంచం అంతా ఉంది. వైద్య నిపుణులు చెప్పినట్లుగా ఎక్కువ టెస్టులు చేయిస్తే ఎక్కువ కేసులు వస్తాయి. అంత మాత్రం చేత జగన్ చేతగానివాడు అయిపోతాడా.

హోదా ఎందుకు అడగలేదు….

అప్పు చేయడం అన్నది తనకు మాత్రమే హక్కు అన్నట్లుగా బాబు మాట్లాడుతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్ల పాటు ఊరేగిన నేపధ్యంలో నాడు ఏపీకి ప్రత్యేక హోదాను ఎందుకు బాబు అడగలేకపోయారు అన్నది ఇప్పటికీ ఆయన సమాధానం చెప్పలేని విషయమే. ఇక ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలోనూ బాబు నోరెత్తరు, అప్పులు చేయవద్దు అని యువ ముఖ్యమంత్రికి సుద్దులు చెబుతున్న బాబు కేంద్రం ఏపీకి చేసిన అన్యాయం మీద ఇప్పటికైనా నిజాయతీగా నోరు ఎత్తగలరా. అది చేయనపుడు కేవలం రాజకీయం కోసం మాత్రమే జగన్ ని ఆడిపోసుకుంటూ చేతకాని సీఎం అని బురద జల్లడం ఎందుకో మరి.

అలా కాకుండానే…..

ఇవన్నీ బాబు వైపు నుంచి తర్కం లేని ఆరోపణలు అయితే వాటిని మోయడానికి వైఎస్సార్ కొడుకు సిధ్ధమేనా అన్నది కూడా మరో చర్చ. ఏది చేసినా జనహితమే వైఎస్సార్ కుటుంబానికి ప్రాధ్యాన్యత అని ప్రజలు ఇప్పటికీ నమ్ముతారు. దాన్ని నిలబెట్టుకోవాల్సిన కర్తవ్యం జగన్ మీద ఉంది. ఊరకే అప్పులు చేయడం, సంక్షేమం పేరిట పంచడం కాదు, తెచ్చిన ప్రతీ రూపాయిని రెండు రూపాయలు చేసేలా ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులుగా పెట్టాలి. ఏపీలో వ్యవసాయ రంగానికి ఊతమివ్వాలి. నీటిపారుదల రంగాన్ని తీర్చిదిద్దాలి. అభివ్రుద్ధికి బాటలు వేయాలి. మూడు రాజ‌ధానుల విషయంలో ఉన్న పట్టుదల కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలోనూ జగన్ కి ఉండాలి. ప్రత్యేక హోదా అపుడపుడు పాడే పాటగా కాదు, కేంద్రం మెడలు వంచి ఎప్పటికైనా తెచ్చేలా ఉండాలి. అపుడే జగన్ని దమ్మున్న సీఎం అని జనం అంటారు. బాబు లాంటి వారు చేతకాని సీఎం అని ఇప్పటికే పదే పదే అంటున్నా వైఎస్సార్ బ్రాండ్ అంటే జనానికి నమ్మకం వల్లనే ఎవరు దాన్ని పట్టించుకోవడంలేదు. ఆ నమ్మకాన్ని తన రాజకీయ జీవితకాలమంతా జగన్ నిలబెట్టుకోవాలంటే చేయాల్సింది చాలానే ఉంది మరి.

Tags:    

Similar News