బీజేపీని అలా చూడాలని జగన్ కోరికట ?

జగన్ పార్టీ వేరు. ఆయన రాజకీయాలు, సిద్ధాంతాలూ వేరు, పైగా ఆయన వస్తుతహా క్రిస్టియన్. పూజలు, జపాలు, కాషాయాలు లాంటి బలమైన మతాచారాలు ఎన్నో ఉన్న బీజేపీకి [more]

Update: 2020-09-10 12:30 GMT

జగన్ పార్టీ వేరు. ఆయన రాజకీయాలు, సిద్ధాంతాలూ వేరు, పైగా ఆయన వస్తుతహా క్రిస్టియన్. పూజలు, జపాలు, కాషాయాలు లాంటి బలమైన మతాచారాలు ఎన్నో ఉన్న బీజేపీకి మామూలుగా అయితే జగన్ కడు దూరం. అసలు ఆయన వేరే వైపు ఉండాలి. కానీ రాజకీయాన్ని మించినది మరొక‌టి లేదు కదా. అది ఆకాశాన్ని భూమినీ కలిపేస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. అందువల్ల మోడీ అంటే మక్కువతో మొక్కుతున్న జగన్ అమిత్ షాను అమితానందంతో అక్కున చేర్చుకుంటారు. ఇక ఏపీ వరకూ చూస్తే కన్నా లక్ష్మీనారాయణ టైంలో ఎడముఖం, పెడముఖంగా ఉండే బీజేపీ బంధం ఇపుడు సోము వీర్రాజు వచ్చాక చాలా బాగా హత్తుకుపోతోంది.

మిత్రుల కన్నా ….

నిజానికి అధికారికంగా బీజేపీ, వైసీపీల మధ్యన ఎటువంటి మితృత్వంలేదు. కానీ తెర చాటున మాత్రం ఇద్దరినీ మించిన దోస్తులు ఎవరూ లేరుగా. బీజేపీ ఏం చేయమన్నా చేయడానికి జగన్ రెడీ. ఒక విధంగా ఏపీ సర్కార్ ని మీదే అనుకోండి అంటూ బీజేపీ నేతలకు సంకేతాలు పంపుతున్నారు యువ ముఖ్య మంత్రి. ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీ ఏది చెప్పినా జగన్ కి ఈ మధ్య వేదవాక్కుగా ఉందిట. అందుకే ఆయన వరసగా పలు నిర్ణయాలను క్యాబినెట్లో పెట్టి మరీ ఆమోదించేశారు.

హుషారే మరీ….

ఇక ఆన్ లైన్ జూదాన్ని అరికట్టాలని వైసీపీ తాజాగా తీసుకున్న నిర్ణయం వెనక బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి లేఖ ఉందట. ఆయన దీని మీద జగన్ కి లెటర్ రాయడం, దాన్ని జగన్ టేకప్ చేసి ఆఘమేఘాల మీద ఆమోదించారుట. అదే విధంగా ఎండీవోలను డీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ జగన్ తీసుకున్న మరో నిర్ణయం వెనక సోము వీర్రాజు ఉన్నారుట. ఆయన తాము ప్రభుత్వానికి చెప్పి పరిష్కారం చేయించామని ఎండీవో సంఘం నేతలతో హుషార్ చేస్తున్నారుట. వీటికి మించి మరో అతి ముఖ్య నిర్ణయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయ వ్యయాల మీద కాగ్ విచారణకు జగన్ సర్కార్ ఒప్పుకోవ‌డం, ఇది ఏకంగా 2014 నుంచి 2019 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ పాలన టైం నుంచి కూడా టీడీపీ ఆదాయ వ్యయాలను కాగ్ విచారణ చేసేలా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీని మీద బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి జగన్ని మెచ్చుకుంటూ లేఖ రాశారు కూడా.

బీజేపీయే కావాలట….

ఏపీలో టీడీపీ ప్రతిపక్షం కాదని జగన్ అంటున్నారు. ఆ పార్టీ విద్వంస రాజకీయాలు చేస్తోందని కూడా ఆయన భావన. పైగా చంద్రబాబు ఎప్పటికీ అధికారంలోకి రాకుండా జగన్ స్కెచ్ వేస్తున్నారు. బాబు ప్లేస్ లోకి బీజేపీని తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఎంత సపోర్ట్ చేసినా బీజేపీ ఏపీలో బలమైన పార్టీగా మారడం కష్టమని జగన్ తో పాటు వైసీపీ నేతల విశ్లేషణ. దాంతో బీజేపీ ఏంకోరినా ప్రభుత్వం తరఫున నెరవేరుస్తూ వారికి జనంలో ఇమేజ్ పెంచితే ఆటోమెటిక్ గా విపక్షంగా వారే ఉంటారని జగన్ మాస్టర్ ప్లన్. 2024 నాటికి ఏపీలో బీజేపీ ప్రతిపక్షంగా తాము మరోసారి అధికారంలోకి రావడానికే జగన్ ఇదంతా చేస్తున్నారుట. అంటే టీడీపీని సోదిలో లేకుండా చేయడానికి జగన్ ఎంచుకున్న ఈ రాజకీయ వ్యూహాన్ని బాబు ఎలా ఛేదిస్తారో చూడాలి.

Tags:    

Similar News