సిక్కోలు ప్రేమ ఒక లెక్కన పెరిగిపోతోందే..?

సిక్కోలు అంటారు స్థానిక జనం. శ్రీకాకుళం అంటారు దూరం నుంచి చూసే జనం, ఎవరు ఎలా అనుకున్నా సిక్కోలు మాత్రం చిక్కులతో సావాసం చేసే జిల్లా అని [more]

Update: 2020-09-09 11:00 GMT

సిక్కోలు అంటారు స్థానిక జనం. శ్రీకాకుళం అంటారు దూరం నుంచి చూసే జనం, ఎవరు ఎలా అనుకున్నా సిక్కోలు మాత్రం చిక్కులతో సావాసం చేసే జిల్లా అని అందరికీ తెలిసిందే. విశాఖ వంటి అతి పెద్ద జిల్లా నుంచి విడిపోయి 1950 ఆగస్ట్ 15న పుట్టిన శ్రీకాకుళం జిల్లా తన నుంచి కొంత భాగాన్ని ఒడిషా రాష్ట్రానికి, ఆ తరువాత 1978లో విజయనగరం జిల్లా ఆవిర్భావానికి వదిలేసుకుంది. చిత్రమేంటంటే తల్లి లాంటి విశాఖ, పిల్లల్లాంటి విజయనగరం, ఒడిషాలోని ప్రాంతాలు ఎంతో కొంత బాగుపడినా శ్రీకాకుళానికి మాత్రం ఆ బాగూ భాగ్యం రెండూ లేకుండా పోయాయి.

జగన్ చూపుతో….

అదేంటో ఎందరో ముఖ్యమంత్రులు శ్రీకాకుళాన్ని చూసి వెళ్లారు కానీ ఎవరూ పెద్దగా ఈ జిల్లా మీద సెంటిమెంట్లు ఏవీ పెట్టుకోలేదు. తమకు తోచిన కార్యక్రమాలు చేసారంతే. జగన్ కి మాత్రం సిక్కోలు అంటే ఎందుకో ప్రేమ అలా పొంగుతోంది. ఆయన పాదయాత్ర చేసిన ప్రభావమో, లేక అక్కడ అమాయక జనం గుండెల్లో హత్తుకున్నారో కానీ ఏపీలో ఏ పధకం ప్రకటించినా సిక్కోలు ముందు అంటారు. ఏపీలో ప్రజలకు నాణ్యమైన బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తామని జగన్ పాదయాత్ర వేళ ప్రకటించారు. కానీ ఏడాది క్రితమే అంటే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్ట్ గా మొదలెట్టేశారు. ఇప్పటికీ మిగిలిన జిల్లాలకు ఆ సూపర్ ఫైన్ బియ్యం దక్కలేదు కానీ సిక్కోలు లక్కీగా అనుభవిస్తోంది.

నగదు బదిలీ కూడా….

ఇపుడు రైతులకు ఉచిత విద్యుతుకు నగదు బదిలీ పధకం ప్రవేశ పెడుతున్న జగన్ ఆ పైలెట్ ప్రాజెక్ట్ ను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభిస్తున్నారు. ఆ విధంగా నగదుని తొలిసారిగా అందుకునే వారుగా సిక్కోలు రైతులు ముందు వరసలో ఉంటారన్నమాట. అంతేనా శ్రీకాకుళం జిల్లాలో బీసీలకు జగన్ అరడజన్ కి పైగా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. మిగిలిన జిల్లాలకు మూడో రెండో అనుకుంటున్నారు. కానీ సిక్కోలు మాత్రం అంతకు రెట్టింపు పదవుల‌ పందేరం అన్నమాట. ఇక ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన క్రిష్ణ దాస్ ని నియమించిన జగన్ రేపటి ఎన్నికల్లో రాజ్యసభ సీటు కూడా ఇక్కడే ఇవ్వబోతున్నారు. స్పీకర్ పదవిని రెండు దశాబ్దాల తరువాత సిక్కోలు కి కేటాయించిన జగన్ ఈ జిల్లా మత్సకారులకు తొలిసారి మంత్రి పదవి అందించారు.

అభివృధ్ధిలోనూ….

ఇక భావనపాడు పోర్టు అన్నది ఒక కల. దాన్ని జగన్ తొలి ఏడాదిలోనే నేరవేరుస్తున్నారు. తాను పదవిలో ఉండగానే ఆ పోర్టుని ప్రారంభిస్తానని కచ్చితంగా చెబుతున్నారు. నిధులను కూడా విడుదల చేస్తున్నారు. ఈ పోర్టు పనుల కోసమే అన్నట్లుగా మంత్రిగా ఆ ప్రాంతానికి చెందిన సీదరి అప్పలరాజుని నియమించారు. ఇక ఉత్తరాంధ్రా సుజల స్రవంతి పధకానికి పదహారు వేల కోట్ల నిధులు జగన్ మంజూరు చేశారు. దీనివల్ల శ్రీకాకుళం రైతాంగమే కాదు, ప్రజానీకం కూడా లబ్ది పొందుతారు. ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం 700 కోట్లతో రక్షిత మంచినీటి పధకానికి కూడా జగన్ శ్రీకారం చుట్టారు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని జగన్ అంటున్నారంటే ఆయన సిక్కోలు ప్రేమను లెక్కవేయగలమా..

Tags:    

Similar News