ఒకే ఫ్రేంలో కన్పించాలనుకుంటే?

జగన్ ఏ విషయమూ బయటపడరు కానీ ఆయన రాజకీయ శైలి వేరుగా ఉంటుంది. అన్నీ గమనిస్తూనే తన పని తాను కానిచ్చేస్తారు.. ఆయన కొన్ని విషయాల్లో చంద్రబాబుని [more]

Update: 2019-12-08 12:30 GMT

జగన్ ఏ విషయమూ బయటపడరు కానీ ఆయన రాజకీయ శైలి వేరుగా ఉంటుంది. అన్నీ గమనిస్తూనే తన పని తాను కానిచ్చేస్తారు.. ఆయన కొన్ని విషయాల్లో చంద్రబాబుని కూడా అనుసరిస్తారు. రాజకీయం ఒకటే అయినపుడు మార్గం కూడా అలాగే ఉండాలిగా. ఏపీలో అలజడి రేగినా విపక్షలు ఊపిరి సలపనివ్వకపోయినా చంద్రబాబు ఢిల్లీని ముందు పెట్టేవారు. అయితే అప్పట్లో బాబుకు మోడీ మిత్ర పక్షం కాబట్టి ఆయన అనుకున్నట్లుగా కధ సాగిపోయేది. జగన్ కూడా అదే విధంగా వ్యవహారం నడపాలని అనుకుంటున్నారు కానీ హస్తినతో దోస్తీ కుదరడంలేదు. ఈ విషయంలో మాత్రం జగన్ తన వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మోడీతో జోడీ కట్టి ఏపీలో విపక్షం నోళ్ళు మూయించాలని జగన్ తాపత్రయం . అయితే ఇప్పటివరకూ చూసుకుంటే అది విఫల ప్రయత్నమే అవుతోంది. మోడీతో తాను ఒకే ఫ్రేం లో కనిపించాలన్నది జగన్ రాజకీయ వ్యూహం. దాని కోసం గత ఆరు నెలలుగా జగన్ ఢిల్లీని ప్రసన్నం చేసుకుంటూనే ఉన్నారు. కారణాలు తెలియవు కానీ జగన్ అనుకున్నది మాత్రం జరగడంలేదు.

బంధం గట్టిదని చెప్పాలని…..

నిజానికి వైసీపీ, బీజేపీ రెండు వేరు వేరు సిధ్ధాంతాలు కలిగిన పార్టీలు, వైసీపీ ఓటు బ్యాంక్ కూడా వేరు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఓటు బ్యాంక్ తో పాటు, తన తండ్రి వైఎస్సార్ రాజకీయ వారసత్వంతో వచ్చిన ఆదరణ, తాను కష్టపడి జనంలో సంపాదించుకున్న ఇమేజ్ ఇవే వైసీపీకి పెట్టుబడిగా జగన్ మార్చుకున్నారు. అదే సమయంలో హిందూ భావజాలం కలిగిన బీజేపీతో ఆయనకు సిధ్ధాంతపరమైన విభేధాలు గట్టిగానే ఉన్నాయి. బయటకు చెప్పరు కానీ జగన్ రాజకీయం మైనారిటీలు అయితే బీజేపీది హిందుత్వ వాదం. ఈ రెండింటికీ అసలు పొసగదు.

అణిగిమణిగి ఉండేవారే…..

ఇక బీజేపీకి అణిగిమణిగి ఉండే వారే దోస్తులుగా కావాలి. జగన్ ది ఆ విధంగా చూసుకున్న కుదరని తత్వమే. రాజకీయంగా సందర్భానుసారం చంద్రబాబు బీజేపీకి తలొగ్గినట్లుగా కనిపిస్తారు కానీ జగన్ మాత్రం అసలు అలా చేయడానికి ఒప్పుకోరు. ఏపీలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి ప్రధాన మద్దతుదారు. ఆ వర్గం కాంగ్రెస్ భావజాలాన్ని ఇష్టపడుతుంది తప్ప బీజేపీ సిధ్ధాంతాలకు దూరం. ఇవన్నీ చూసినపుడు భిన్న ధ్రువాలుగానే బీజేపీ, వైసీపీలను చూడాలి. కానీ జగన్ రాజకీయంగా దోస్తీ కాకుండా కేంద్రం, రాష్ట్రం అన్న పద్ధతిలో సహకారం అందించుకోవాలని భావిస్తున్నారు. అదే ఆయన ఆశిస్తున్నారు కూడా.

మోడీ వస్తారా…?

జగన్ ఇప్పటికి రెండు మార్లు ప్రధానిని ఏపీకి తీసుకువచ్చి తాను పక్కన నిలబడి మీడియా ఫోటొల ముందు కనిపించా లనుకున్నారు. తాను సీఎం గా ప్రమాణం చేసేటపుడు హాజరుకావాలని మోడీని మొదట జగన్ ఆహ్వానించారు.. అయితే అదే సమయంలో మోడీ కూడా ప్రధానిగా ప్రమాణం చేయడంతో వీలుపడలేదు. ఇక అక్టోబర్ 15న నెల్లూరులో వైఎస్సార్ రైతు భీమా పధకాన్ని జగన్ ప్రారరంభించే ముందు కూడా దానికి హాజరు కావాలని మోడీని స్వయంగా కలసి ఆహ్వానించారు. పధకం పేరు కూడా మార్చి మరీ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకున్నారు. అయినా ఎందుకో ప్రధాని రాలేకపోయారు. ఇపుడు ముచ్చటగా మూడవసారి తన సొంత జిల్లా కడపలో స్టీలు ఫ్య్కాక్టరీ శంఖుస్థాపనకు మోడీని పిలవాలని జగన్ భావిస్తున్నారు. మోడీ తో పాటు అమిత్ షాని కూడా రప్పించడం ద్వారా బీజేపీతో, కేంద్రంతో తనకు ఎక్కడా ఎడం లేదని, బంధం చెడిపోలేదని చెప్పాలన్నది జగన్ ఎత్తుగడ. మరి ఇప్పటికి రెండు మార్లు ఫెయిల్ అయిన జగన్ మూడవసారి అయినా విజయం సాధిస్త్తారా అన్నది చూడాలి. ఒకవేళ ప్రధాని మోడీతో పాటు అమిత్ షా కూడా అంగీకరించి కడపకు వస్తే మాత్రం జగన్ పంట పండినట్లే. రాజకీయంగా ఇప్పట్లో ఆయన్ని ఎదురొడ్డే సాహసం ప్రత్యర్ధులు చేయలేరని కూడా సంకేతలు బలంగానే వెళ్తాయి.

Tags:    

Similar News