నడ్డి విరుగుతోంది..? మొత్తం ఖాళీ అయిపోయిందే?

అభివృధ్ధి అంటే ఆమడదూరంలో ఆంధ్ర ప్రదేశ్ ఉందని చెప్పాలి. అమరావతి కధలతో చంద్రబాబు అయిదేళ్ల పాలన చేశారు. విభజన ఏపీ 90 వేల అప్పుల్లో ఉంటే దాన్ని [more]

Update: 2020-09-16 15:30 GMT

అభివృధ్ధి అంటే ఆమడదూరంలో ఆంధ్ర ప్రదేశ్ ఉందని చెప్పాలి. అమరావతి కధలతో చంద్రబాబు అయిదేళ్ల పాలన చేశారు. విభజన ఏపీ 90 వేల అప్పుల్లో ఉంటే దాన్ని రెండున్నర లక్షలకు పెంచిన ఘనత అక్షరాలా చంద్రబాబుదే. ఆ తెచ్చిన అప్పు దేనికి ఖర్చు పెట్టారో తెలియదు కానీ చంద్రబాబు మాజీ సీఎంగా ఇంటికెళ్ళేముందు చూస్తే ఏపీ ఖజానాలో కేవలం 100 కోట్లు మాత్రమే ఉందట. ఇక జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన పాలన 15 నెలలు పూర్తి అయింది. ఇప్పటికే 97 వేల కోట్ల అప్పులు తెచ్చారని విపక్ష తెలుగుదేశం విమర్శిస్తోంది.

పడకేసిన ప్రగతి…..

అప్పు చేసి పప్పు కూడు అన్నది ఏపీకే సరిపోయే సామెత. ఇక్కడ ఆదాయ వనరులు బహు తక్కువ. మద్యాన్ని అమ్ముకుని ఆ డబ్బులతో బతకాలి. దానికి కూడా జగన్ సర్కార్ పరిమితులు విధించడం వల్ల ఆదాయం తగ్గింది. ఇక రియల్ ఎస్టేట్ రంగాన్ని జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నిండా కూల్చేశాయి. ఇసుక లేకపోవడంతో నిర్మాణాలు ఆప్పట్లోనే ఆగాయి. అలాగే పారిశ్రామిక విధానం విషయంలో కూడా సరైన దూర దృష్టి లేకపోవడం, అందులోనూ కులాలు, కుళ్ళు రాజకీయాలూ చోటు చేసుకోవడంతో ఆ రంగమూ పడకేసింది.

పంచుడేగా ….

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం సంక్షేమ జపం మాత్రమే చేస్తున్నారు. తన హామీలను నెరవేర్చుకోవడానికి ప్రతీ కుటుంబానికి కనీసం అరవై వేలు తక్కువ లేకుండా ఈ ఏడాది కాలంలో నగదు బదిలీ చేశారు. అంటే నెలకు అయిదు వేల రూపాయలు అన్న మాట. ఈ విధంగా అరవై వేల కోట్లు తాము ఖర్చు చేశామని వైసీపీ సర్కార్ గొప్పగా చెప్పుకుంది. మరి ఆ డబ్బులన్నీ కూడా అప్పు చేసి పంచడంగానే చూడాలి. అంటే చేతిలో డబ్బులు లేకపోయినా అనుత్పాద‌క రంగాల కోసం ఇలా కాసులు కరిగించేశారన్నమాట. దీని వల్ల ఏపీ అప్పుల కుప్పగా మారుతోంది.

కరోనాతో కటకట…..

ఇక ఇపుడు చూసుకుంటే ప్రపంచానికే దరిద్రం పట్టేసింది. కరోనా తో ఎక్కడా కరెన్సీ కదలడంలేదు. దాంతో కేంద్రం కూడా అప్పులు చేసుకోండి అంటూ ఎప్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచేసి మరీ పచ్చ జెండా ఊపేసింది. దాంతో ఇప్పటిదాకా ఏపీ వంటి రాష్ట్రాలు తమ జీడీపీలో 3.5 శాతం మాత్రమే అప్పులు తీసుకునేందుకు వీలుండేది. ఈ వెసులుబాటుతో అయిదు శాతం పైగా అప్పులు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా మరో ఇరవై నుంచి పాతిక కోట్ల దాకా ఏపీ సర్కార్ అప్పును తెచ్చుకునేందుకు అర్హత సాధించింది. ఈ పరిణామాల నేపధ్యంలో కొత్త అప్పుల కోసం మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వేట మొదలెట్టేశారు.

అప్పు చెయ్….

దీని మీద టీడీపీ విరుచుకుపడుతోంది. ప్రతీ పౌరుడి నెత్తినా ఇప్పటికే ఇరవై వేల రూపాయల‌ అప్పు పెట్టారని, ఇంకా ఎన్ని వేల కోట్ల అప్పులు చేస్తార‌ని విపక్షం విమర్శిస్తోంది. ఎవరు ఏ రకమైన విమర్శలు చేసినా అప్పు చేయకపోతే కనీసం ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చేందుకు పైసా కూడా లేని దుర్భర పరిస్థీతుల్ల్లో జగన్ ప్రభుత్వం ఉంది. దాంతో అప్పు చేయడానికే రెడీ అవుతోంది. సరే అప్పులు చేస్తారు బాగానే ఉంది కానీ తీర్చడం ఎలా. అంటే ఆ ఒక్కటీ ఎవరూ అడగకూడదేమో. ఏది ఏమైనా రుణ భారంతో ఏపీ నడ్డి విరుగుతోంది. సమీప భవిష్యత్తులో ఎత్తిగిల్లే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి.

Tags:    

Similar News