జగన్ కి దసరా సరదా లేదుగా..?

జగన్ ఏం అనుకున్నా దూకుడుతో బొక్క బోర్లా పడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో ఆయనకు అన్నీ ఓకే అనుకున్న వేళ హైకోర్టులో యాభైకి మించి పడిన పిటిషన్లు [more]

Update: 2020-09-07 02:00 GMT

జగన్ ఏం అనుకున్నా దూకుడుతో బొక్క బోర్లా పడుతున్నారు. మూడు రాజధానుల విషయంలో ఆయనకు అన్నీ ఓకే అనుకున్న వేళ హైకోర్టులో యాభైకి మించి పడిన పిటిషన్లు పెద్ద ఎత్తున బ్రేకులేస్తున్నాయి. వరస స్టేలతో ఇపుడు హైకోర్టులో మూడు రాజధానుల చట్టం ఇరుక్కుపోయినట్లైంది. విచారణ ఎపుడు పూర్తి అవుతుంది అన్నది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు పెద్ద సంఖ్యలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా పిటిషన్లు ఉన్నాయి. అన్నీ కలిపి విచారించినా కూడా చాలా సమయమే పట్టేట్లు ఉంది. మరో వైపు సుప్రీంకోర్టు అయితే మూడు రాజధానుల చట్టం అమ‌లు చేసేందుకు వీలుగా హైకోర్టు విధించిన స్టేను తొలగించలేమని చెప్పేసింది. ఇక హైకోర్టు తీర్పు కోసమే జగన్ సర్కార్ ఎదురు చూడాలి.

ఆ ముహూర్తం అంతేనా…?

విజయదశమి ముహూర్తం, అక్టోబర్ 25న విశాఖకు రాజధాని షిఫ్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇది అనధికారికంగా కూడా నిర్ణయం అయిన ముహూర్తం. విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామీజీ ఈ మహత్తరమైన ముహూర్తం పెట్టారని కూడా చెబుతారు. ఇప్పటికి నుంచి చూస్తే విజయదశమికి ఎక్కువ దూరం లేదు. కానీ హైకోర్టులో విచారణ సెప్టెంబర్ 21 తరువాత మొదలవుతుందని అంటున్నారు. అక్కడ ఎంత త్వరగా విచారణ జరిపినా అక్టోబర్ విజయదశమి ముహూర్తం కూడా దాటిపోయేలా ఉంది. దాంతోనే వైసీపీలో మధనం మొదలైందని అంటున్నారు.

ఈ ఏటికింతేనా…?

నిజానికి 2020ని ప్రతీ వారు జీరో ఇయర్ గా పేర్కొంటున్నారు. అంటే ఏ రకమైనా యాక్టివిటీ లేకుండా ఉన్న ఏడాదిగా చూస్తున్నారు. అయితే ఎంత కరోనా వున్నా కూడా జగన్ మాత్రం తాను చేయాల్సిన పనులు చేస్తూ వస్తున్నారు. సంక్షేమ పధకాల విషయంలో మాత్రమే ఆయన అడుగు ముందుకు వేస్తున్నారు. మరో వైపు చూసుకుంటే మూడు రాజధానులు మాత్రం ముందడుగు పడకుండా అలాగే ఉంది. ఇక ఇపుడు న్యాయపరమైన చిక్కులు ఉండడంతో 2020 లో విశాఖ రాజధానికి జగన్ వచ్చే అవకాశం అయితే కనిపించడంలేదన్న విశ్లేషణలు ఉన్నాయి.

అనుకూలమైనా…?

ఇక 2021లో చూసుకుంటే అప్పటికి హైకోర్టు ఈ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అమరావతి రాజధాని జేఏసీ సుప్రీం కోర్టు తలుపు తట్టదన్న గ్యారంటీ ఏమీ లేదు. మరి అక్కడ ఈ కేసు ఎన్నాళ్ళు పడుతుందో దేవుడికే ఎరుక. అంటే మొత్తానికి జగన్ మూడు రాజధానుల ముచ్చట ఇప్పట్లో తీరేది కాదని కచ్చితంగా ఎవరైనా చెప్పవచ్చు, అది ఎప్పటికి తీరుతుంది అన్నది మాత్రం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనా 2020 వరకూ అమరావతిని ఏకైక‌ రాజధానిగా ఉంచడంతో విపక్షాలు రైతులు సక్సెస్ అయినట్లే. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News