జగన్ ఆ సలహా పాటిస్తే మేలేమో ..?

సలహా అన్నది అవసరం. అది ఎవరికి అవసరం అంటే స్వీకరించేవారికి మాత్రమే. అలగని ప్రతీ సలహాలూ స్వీకరించాలని లేదు. తాను చూసే కళ్ళు, ఆలోచించే తీరుకు కాస్తా [more]

Update: 2020-08-31 15:30 GMT

సలహా అన్నది అవసరం. అది ఎవరికి అవసరం అంటే స్వీకరించేవారికి మాత్రమే. అలగని ప్రతీ సలహాలూ స్వీకరించాలని లేదు. తాను చూసే కళ్ళు, ఆలోచించే తీరుకు కాస్తా భిన్నంగా మరొకరు పక్కన నిలిచి ఆలోచించడం పాలకులకు ఎపుడూ అవసరమే. ఎందుకంటే వారు ఒకే వైపునకు కట్టుబడి ఉంటారు. రెండవ వైపు ఏం జరుగుతోందో తెలియదు. ఇక మరో విషయం ఏంటి అంటే ఎంత చెప్పుకున్నా పాలకుడిలో కొంత పక్షపాతం ఉంటుంది. దాంతో దాన్ని సరిచేసేలా చూసేందుకుకే సలహాలు, సలహాదారులు అవసరం

అదే విచిత్రం….

జగన్ విషయానికి వస్తే ఆయన ఎవరి సలహాలు స్వీకరించరని అంటారు. ఆయన తాను అనుకున్నదే చేస్తారని పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న ఒకే ఒక అతి పెద్ద ఆరోపణ. జగన్ తలచింది జరగాల్సిందే. అలాటపుడు ఆయనకు సలహాలు ఎందుకు. వైఎస్సార్ వంటి వారు తన ఆంతరింగుకుల సలహాలను ఆలకించేవారని అంటారు. అలాంటి వైఎస్సారే ఇంత పెద్ద ఎత్తున సలహాదారులను నియమించుకోలేదు. కానీ జగన్ మాత్రం లెక్కలేనంతమందిని సలహాదారులుగా తీసుకోవడమే ఆశ్చర్యకరం. ఓ వైపు ఏపీ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న వేళ వీరి అవసరం ఉందా. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం లక్షల్లో జీతంగా వీరికి దోచి పెట్టాలా అన్నది ఎప్పటి నుంచో ఒక చర్చగా ఉంది.

అందుకోసమేనా…?

జగన్ తన వారు అనుకున్న వారిని ఏరి కోరి సలహాదారులుగా పెట్టుకున్నారు. దాని వెనక రాజకీయం ఏంటి అంటే జగన్ వారికి తన ప్రభుత్వం ద్వారా ఏదో మేలు చేయలన్న సదుద్దేశ్యమేనని చెబుతారు. అంటే మీ సలహాలు కానీ మీ మేధస్సు కానీ నాకు అవసరం లేదని జగన్ ఎపుడో చెప్పేశారన్నమాట. పదేళ్ల పాటు నా వెంట నడిచి నాకు మాట సాయమో మరే సాయమో చేసినందుకు బదులుగా జగన్ ఈ విధంగా వారిని సన్మానించుకున్నారనుకోవాలి. ఆ విధంగా చాలా మంది మాజీ పత్రికా సంపాదకులకు, మాజీ ఐఏఎస్ అధికారులకు, మేధావులకు పదవులు దక్కాయి. జగన్ ఆలోచనలు ఈ విధంగా ఉంటే సలహాదారులుగా నియమితులైన కొందరు దీన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారనిపిస్తోంది.

విలువ లేదట :

ఈ సలహాదారుల మీద మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వారిని ఎందుకు జగన్ తీసుకున్నారని కూడా రచ్చ జరుగుతూనే ఉంది. అయితే తమకు అప్పగించిన పదవికి న్యాయం చేయాలని అతి ఉత్సాహం పడిన కొందరు సలహాదారులు జగన్ కి కొన్ని విషయాల్లో సలహాలు ఇచ్చారుట. జగన్ వాటిని పట్టించుకోలేదని మళ్ళీ వారికి ఆవేదన కలిగిందిట. ముందే చెప్పుకున్నట్లుగా ప్రతీ సలహాను పట్టించుకోవాలని నిబంధన ఏదీ లేదు. ఒక వేళ పట్టించుకోకపోయినా వచ్చిన ముప్పు కూడా లేదు. ఇక్కడ చిత్రమేంటంటే జగన్ సంగతి తెలిసిన మరికొందరు లౌక్యం ఎరిగిన సలహాదారులు ఇప్పటికీ హాయిగా కొనసాగుతున్నారు. వారు తాము సలహాదారులమే తప్ప సలహాలు ఇచ్చేవాళ్ళం కాదని తెలుసుకుని బుద్ధిగా మసలుకుంటున్నారని ప్రచారం ఉంది. ఏది ఏమైనా లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ పదవిలో కూర్చోబెడితే అది కూడా తప్పే అన్నట్లుగా రాజీనామాలు చేసే వారికి ఎవరు ఆ సలహా ఇచ్చారో అన్నదే ఇపుడు వైసీపీలో చర్చగా నడుస్తోంది. మొత్తానికి సలహాదారుల విషయంలో జగన్ కి ఆయన హితైషుల ఏకైన సలహా ఏంటి అంటే మిగిలి ఉన్న వారిని కూడా ఇంటికి పంపించేయండి మహా ప్రభో, సర్కార్ కి తెల్ల ఏనుగులు ఎందుకు అన్నదే ఈ సలహాట. మరి ఈ సలహా అయినా జగన్ పాటిస్తే అలకలు, రాజీనామాలు, దాని మీద రచ్చ, చర్చలు ఈ తలకాయ నొప్పి జగన్ కి తప్పుతాయేమో చూడాలి.

Tags:    

Similar News