ఆ అయిదు నెలలూ గండమేనా..?

ఎందుకో ఎంత కాదనుకున్నా రాజకీయాల్లో సెంటిమెంట్లు కచ్చితంగా నమ్మాల్సిందే. యాంటీ సెంటిమెంట్లు కూడా నమ్ముతూ వణికిపోయేవారూ ఉన్నారు. టీడీపీ విషయానికి వస్తే ఆగస్ట్ నెల అంటే ఇప్పటికీ [more]

Update: 2020-09-12 00:30 GMT

ఎందుకో ఎంత కాదనుకున్నా రాజకీయాల్లో సెంటిమెంట్లు కచ్చితంగా నమ్మాల్సిందే. యాంటీ సెంటిమెంట్లు కూడా నమ్ముతూ వణికిపోయేవారూ ఉన్నారు. టీడీపీ విషయానికి వస్తే ఆగస్ట్ నెల అంటే ఇప్పటికీ జడుసుకునే పరిస్థితి. ఇక జగన్ గురించి మాట్లాడాలంటే ఆయన ప్రభుత్వానికి బాలారిష్టాలు ఇంకా తొలగిపోలేదని అంటారు. జగన్ వచ్చిన ఏడాదిలోనే అనేక కార్యక్రమాలకు ఒకేసారి శ్రీకారం చుట్టడం, అతి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చిన గొడవ ఇదంతా అన్న వారూ ఉన్నారు. ఇక జగన్ కి ఎన్టీయార్ కి పోలికలు పెట్టిన వారు ఉన్నారు. వైఎస్సార్ తో పోల్చుకున్న వారూ ఉన్నారు.

అన్నగారు అలా ….

అన్న ఎన్టీయార్ 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1984 జూలైలో గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్తే ఆగస్ట్ 16న ఆయన సర్కార్ కూలిపోయింది. నాదెండ్ల భాస్కర రావు ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే అప్పటికి అధికారంలోకి వచ్చి ఎన్టీయార్ ఇరవై నెలలు అయింది. అలా నాదెండ్ల వెన్నుపోటు గురైన రామారావు ప్రజా పోరాటం ద్వారా నెల రోజుల్లో అధికారం దక్కించుకున్నారు అది వేరే విషయం. జగ‌న్ విషయంలో కూడా ఎన్టీయార్ తో పోలికలు తెచ్చి కొంత భయపెట్టిన వారు వైఎస్సార్ సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. భారీ మెజారిటీలు ఉన్నా రాజకీయాల్లో పెద్ద ఇబ్బందులు తప్పవని జగన్ సీఎం అయిన కొత్తల్లోనే ఉండవల్లి సున్నితంగా హెచ్చరించారు.

కీలకమేనా….?

జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి పదిహేను నెలలు కావస్తోంది. ఎన్టీయార్ తొలివిడత అధికారాన్ని 20 నెలల్లో పోగొట్టుకుంటే మలి విడత అధికారాన్ని ఎనిమిది నెలల్లో పోగొట్టుకున్నారు. జగన్ సర్కార్ ఇపుడు రెండు ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్నందువల్ల తొలి విడత ముప్పు తప్పినట్లే. ఇక 20వ నెల మైలు రాయి మీదనే అందరి చూపూ ఉంది. ఈ అయిదు నెలల్లోనే ఏపీలో అనేక కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందులో ప్రధానమైనది ఏమిటీ అంటే మూడు రాజధానుల మార్పు. దీన్ని జగన్ ఎలా డీల్ చేస్తాడన్నది కూడా అసక్తికరమైన చర్చనే.

కుట్ర మొదలైందా…?

జగన్ ఎదురుగా నిలిచి గెలవడం కష్టమని టీడీపీకి ఈపాటికే అర్ధమైపోతోంది. ఆయన చేతికి ఎముక లేకుండా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. దాంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఆయన సర్వం సిధ్ధంగా ఉన్నారు. ఇమేజ్ కూడా ఇప్పటిదాకా చెక్కుచెదరలేదు. ఇలాగే జోరు కొనసాగితే 2024 నాటికి కూడా ఆయన రెండవ విడత రావడం ఖాయమని కూడా చెప్పగలరు. మరి జగన్ ని గద్దె దింపే మార్గం ఏంటి. అంటే జగన్ సర్కార్ కి వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు మధ్యన ఎడం పెంచడం. జగన్ మీద అదే పనిగా రాతలు రాస్తూ ఏపీలో ఏదో జరిగిపోతోందని కలరింగ్ ఇవ్వడం. మొదటి దాని వల్ల వచ్చేవి అతి సున్నితమైన ఇబ్బందులు, అవి ఏ వైపునకు దారితీస్తాయో చెప్పడం కష్టమే. ఇక రెండవ దాని ద్వారా వైసీపీలోనూ ఎమ్మెల్యేలలోనూ నైతిక స్థైర్యం దెబ్బతీయడం. ఇలా ద్విముఖ వ్యూహంతో టీడీపీ దాని అనుకూల మీడియా రెడీగా ఉన్నాయట‌.

దాని మీద ఆశ…..

మరో వైపు ఏపీలో పెను ఆర్ధిక సంక్షోభం వస్తుందని కూడా టీడీపీ ఆశ పెట్టుకుంటోంది. దాన్ని మరింత చేసి భయపెట్టడానికి ఎటూ అనుకూల మీడియా ఉంది. ఏపీలో కరోనా కారణంగా ఆదాయం దారుణంగా పడిపోయింది. మరో వైపు చూస్తే కేంద్రం సాయం కూడా తగ్గుతోంది. దీంతో ఈ రెండింటికీ బ్యాలన్స్ చేయడం జగన్ కి కష్టమే కావచ్చు. తొలి ఏడాది ఎలాగోలా నెట్టుకువచ్చిన జగన్ రెండవ ఆర్ధిక సంవత్సరం ఇబ్బందుల్లో పెడితే అది రాజకీయ సంక్షోభంగా మలచాలని కూడా విపక్షం ఆశ పెట్టుకుంది. ఇవన్నీ పక్కన పెడితే యాంటీ సెంటిమెంట్ల మీద వైసీపీలోనూ భయాలు ఉన్నాయి. వైఎస్సార్ రచ్చబండకు వెళ్తూ మరణించారు. జగన్ కూడా నవంబర్ నుంచి రచ్చ బండ అంటున్నారు. దానికే వైసీపీలో భయం కనిపిస్తోంది. ఇంకో వైపు ఎన్టీయార్ తొలి పాలనలో జరిగినట్లుగా 20 నెలలకే సర్కార్ కి ఏమైనా అనుకోని ఇబ్బందులు వస్తాయా అన్నది కూడా ఆ పార్టీ శ్రేయోభిలాషుల వద్ద చర్చగా ఉందిట. దీంతో వైసీపీలో కీలక నేతలు అన్ని రకాలుగా ముందు జాగ్రత్త పడేందుకు సిధ్ధంగా ఉన్నారని భోగట్టా.

Tags:    

Similar News