జగన్ భయపెడుతున్నారా ?

జగన్ చేతిలోకి అధికారం ప్రమాదకరం అని టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు అన్నారు. అయితే జనం మాత్రం జగన్ కే పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయిన [more]

Update: 2020-08-19 15:30 GMT

జగన్ చేతిలోకి అధికారం ప్రమాదకరం అని టీడీపీ నేతలు ఎన్నికలకు ముందు అన్నారు. అయితే జనం మాత్రం జగన్ కే పట్టం కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత తన పని తాను చేసుకుపోతున్నారు. తనకంటూ ప్రభుత్వం తరఫున విజన్ ఉందని చెప్పుకున్నారు ఇక పార్టీ పరంగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని ఆయన ముందుకువెళ్తున్నారు. ఆ యాక్షన్ ప్లాన్ ఏంటన్నది అందరికీ తెలిసిందే. పైగా ప్రతీ పార్టీకి ఉండాల్సిన సహజమైన ఆశయం, ఆకాంక్షగానే చూడాలి. ఎదుటి పార్టీ నిర్వీర్యం కావాలని, తన పార్టీ పది కాలాలు ఉండాలని ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు కూడా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తన వైపునకు తీసుకున్నారు అంటే వైసీపీని సోదిలోకి లేకుండా చేయడానికేకదా.

భయమేస్తోందిట….

ఈ మాటలు అన్నది ఎవరో కాదు విశాఖ జిల్లా రాజకీయాల్లో రాటుదేలిన నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ప్రభుత్వాలు ఏదైనా ప్రతిపక్షలు ప్రశ్నలు అడిగితే వివరణ ఇవ్వాలి, తప్పులుంటే సరిదిద్దుకోవాలి తప్ప వారిని భయపెట్టి బెదిరించి నోరుమూయాలనుకోకూడదు అని అయ్యన్న గట్టిగానే మాట్లాడారు. అంటే తన మీద పెట్టిన కేసులు కానీ టీడీపీ నేతల మీద ఫైల్ అయిన కేసులు కానీ జగన్ సర్కార్ భయపెట్టి చేస్తున్నవే అనుకోవాలా అన్న ప్రశ్న వస్తోంది. ఇక అయ్యన్న మహిళా తాశీల్దార్ ని దూషించినా కేసులు పెట్టకూడదా అన్న మాట కూడా వైసీపీ నుంచి వినిపిస్తోంది.

అబ్బాయి కామ్ గానే….

మరో వైపు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి రెండు నెలలు పైదాటింది. మొదట్లో కాస్తా సౌండ్ చేసిన తమ్ముళ్ళు ఇపుడు మౌనమే మా భాష అంటున్నారు. స్వయంగా తన బాబాయి అచ్చెన్నాయుడు బయటకు రాకపోవడంతో అబ్బాయి. ఎంపీ అయిన రామ్మోహననాయుడు అప్పట్లో విమర్శలు చేశారు కానీ ఇపుడు మాత్రం సైలెంట్ అయ్యారు. ఆయన తన బాబాయ్ అచ్చెన్న పోరాటయోధుడు అని మాత్రమే అంటున్నారు తప్ప వైసీపీ మీద ఒక్క మాట మాట్లాడడంలేదు. మొత్తానికి చూస్తూంటే అచ్చెన్న అరెస్ట్ తరువార తమ్ముళ్లంతా సెట్ అయిపోయారా అన్న మాట కూడా ఉంది.

జేసీలు సైలెంట్ ….

ఇక అనంతపురం జిల్లాలో చూసుకుంటే జేసీ బ్రదర్స్ చాలా ఫ్యేమస్. రాజకీయంగా పెద్ద గొంతు వారిది. జేసీ ప్రభాకరరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో దివాకరరెడ్డి మీడియా ముందుకు వచ్చి గట్టిగానే సౌండ్ చేశారు. అయితే ఆ తరువాత మాత్రం ఆయన ఎందుకో తెరెవెనక్కువెళ్ళారు. ఇక 53 రోజుల పాటు జైల్లో ఉన్న జేసీ ప్రభాకరరెడ్డి బెయిల్ మీద వచ్చి మళ్ళీ కటకటాల వెనక్కు వెళ్ళారు. ఇంకో వైపు చూసుకుంటే ఆయన బెయిల్ ని రద్దు చేయాలని పిటిషన్ పడింది. ఇలా జేసీల రాజకీయ జీవితంలో ఇలాంటి అనుభవాలు లేవుగా. ఓ విధంగా సీమ జిల్లాల్లో ఎదురులేని నేతలుగా ఉన్న జేసీలు ఇపుడు సైలెంట్ అవుతున్నారంటే భయంతోనేనా. ఏది ఏమైనా జగన్ రూలింగ్ తో టీడీపీ తమ్ముళ్లలో వణుకు మొదలైందన్న మాట మాత్రం గట్టిగా ఉంది. అయితే దీనికి వైసీపీ నేతలు అంటున్నది ఏంటంటే తప్పు చేసిన వారు మాత్రమే భయపడతారు తప్ప మిగిలిన వారిని ఎవరూ భయపెట్టలేరని. ఏది ఏమైనా జగన్ భయపెడుతున్నారని ఆయ్యన్నపాత్రుడు అంటున్న మాటలు మొత్తం టీడీపీవిగా భావించాలా.

Tags:    

Similar News