రెడీ మేడ్ రాజధానితో వండర్స్ ?

జగన్ దూరదృష్టి ఇపుడు మేధావుల్లో కూడా చర్చ సాగుతోంది. విశాఖను రాజధానిగా జగన్ చేయాలనుకున్నపుడు భిన్నంగా స్పందించిన వారు కూడా ఇపుడు తరచి తరచి ఆలోచనలు చేస్తున్నారు. [more]

Update: 2020-08-19 12:30 GMT

జగన్ దూరదృష్టి ఇపుడు మేధావుల్లో కూడా చర్చ సాగుతోంది. విశాఖను రాజధానిగా జగన్ చేయాలనుకున్నపుడు భిన్నంగా స్పందించిన వారు కూడా ఇపుడు తరచి తరచి ఆలోచనలు చేస్తున్నారు. విశాఖకు ఉన్న పొటెన్షియాలిటీ ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీ వాడుకోవడానికి పూర్తిగా ఉపయోగపడుతుందని వివిధ రంగాల నిపుణులూ అంటున్నారు. విశాఖ వంటి గ్రోత్ ఇంజన్ సిటీని ఉంచుకుని కొత్త ప్రయోగాలు చేయడం కూడా సమంజసం చేయడమే తప్పు అన్న వాదన కూడా ఉంది. రాజధానిగా విశాఖను నాడే చేసి ఉంటే ఇప్పటికే మిగిలిన సౌతిండియా సిటీలతో పోటీ పడేదని కూడా అంటున్నారు. జగన్ లేట్ గా అయినా మంచి ఆలోచనే చేశారని కూడా అంటున్నారు.

ఆ అనుభవంతోనే …..

జగన్ 2014లో అధికారంలోకి వచ్చి ఉంటే ఆయన కూడా దొనకొండ వైపే మొగ్గు చూపేవారేమో. అయితే అమరావతి పేరిట చంద్రబాబు చేసిన విఫలప్రయోగమే జగన్ కళ్ళు తెరిపించింది అనుకోవాలి. కేంద్రం పెద్దగా సాయం చేయకపోవడం, కొత్త చోట నగరాల పేరిట యుగాలు జగాలు కాలాన్ని ధనాన్ని వెచ్చించడం ప్రజలకూ, రాజకీయాలకూ మంచిది కాదని జగన్ ఆలొచించబట్టే ఆయన 2019 నాటికి పూర్తి ప్లానింగ్ తో రెడీ అయి సీఎం సీట్లో కూర్చున్నారు. ఇక విశాఖ రాజధాని అన్నది శివరామక్రిష్ణన్ కమిటీ నివేదికలో ఉండడం కూడా జగన్ కి కలసి వచ్చే అంశమైంది. దాంతో ఆయన విశాఖ మన రాజధాని ఎటువంటి జంకూ గొంకూ లేకుండా ప్రకటించేశారు.

ఇన్వెస్టర్ల కోసం ….

విశాఖలో ఉన్న అన్ని రకాల వనరులూ వాడుకుంటే చేతిలో ఉన్న నాలుగేళ్ల అధికారంతోనే జగన్ వండర్స్ చేయవచ్చు. సీ, రోడ్, ఎయిర్ రైల్ కనెక్టివిటీతో ఇప్పటికే విశాఖ అలరారుతోంది. అందువల్ల కొత్తగా పెద్దగా ఖర్చు చేయకుండానే డే వన్ నుంచి విశాఖలో జగన్ పాలన చేయవచ్చు. వర్క్ కూడా మొదలుపెట్టవచ్చు. ఇక విశాఖ విషయంలో కూడా జగన్ మాస్టర్ ప్లాన్ ని ఇప్పటికే రూపకల్పన చేయించారు. మూడు జిల్లాలను కలుపుతూ ఈ ప్లాన్ ఉంది. ఎక్కడ ఏమేమి పెట్టాలి. ఎలా ఇన్వెస్టర్లను ఆకట్టుకోవాలి అన్నది కూడా విశాఖ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ ఇప్పటికే ప్లాన్ రెడీ చేసి పెట్టింది. దాని ప్రకారం విశాఖను సినీ, టూరిజం, ఐటీ హబ్ లుగా సులువుగా డెవలప్ చేసేందుకు కొన్ని కీలక స్పాట్స్ ని కూడా సెలెక్ట్ చేసి పెట్టారు.

బెంగ అదేగా ….

ఈ నేపధ్యంలో జగన్ విశాఖకు కనుక షిఫ్ట్ అయితే చాలా తొందరలోనే ప్రగతి ఫలాలు కనిపిస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. విశాఖను చూసి పెట్టుబడులు పెడతామని చంద్రబాబు హయాంలో కూడా ఇన్వెస్టర్లు వచ్చారట. అయితే ఆయన అమరావతిలో పెట్టుబడులు పెట్టమని చెప్పడంతో అవన్నీ వెనక్కిపోయాయి. ప్రతీ ఏటా ఇన్వెస్టెర్ల సెమినార్ల ద్వారా బాబు విశాఖను చూపించే పెట్టుబడుల దారులను రప్పించిన సంగతి తెలిసిందే. వారే ఇపుడు జగన్ వెనకాలా గట్టిగా నిలబడతామని అంటున్నారు. వారి భరోసాతోనే జగన్ విశాఖలో మౌలిక సదుపాయల కల్పనకు రెడీ అవుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే 2024 నాటికి ఇందులో కొన్ని వర్కౌట్ అయినా కూడా జగన్ కి తిరుగు ఉండదు, దీంతోనే ఇపుడు టీడీపీ విశాఖ రాజధానిని అడ్డుకోవడానికి చేయాల్సినవి అన్నీ చేస్తోందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఏది ఏమైనా విశాఖకు రాజధాని వస్తుందని, ఏపీ అభివృధ్ధి పరుగులు తీస్తుందని కూడా వారు కచ్చితంగా చెబుతున్నారు.

Tags:    

Similar News