అచ్చెన్న సాక్షిగా కరోనా పీక్స్ ?

ఏపీలో కరోనా మూడు లక్షలకు చేరువలో ఉంది. రోజుకు పదివేల కేసులకు తక్కువ లేకుండా నమోదు అవుతున్నాయి. జగన్ సర్కార్ ప్రతీ రోజూ సమీక్షలు చేస్తోంది. అక్కడకు [more]

Update: 2020-08-14 05:00 GMT

ఏపీలో కరోనా మూడు లక్షలకు చేరువలో ఉంది. రోజుకు పదివేల కేసులకు తక్కువ లేకుండా నమోదు అవుతున్నాయి. జగన్ సర్కార్ ప్రతీ రోజూ సమీక్షలు చేస్తోంది. అక్కడకు చేరిన ఉన్నతాధికారులు అంతా బాగుంది అన్నట్లుగా చెబుతున్నారు. జగన్ కూడా వారికి ఎప్పటికపుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ పెద్దగా జగన్ వారిని నమ్మి అంతా చేతుల్లో పెడుతున్నారు. మరి ఇంత చేసినా కూడా ఏపీలో కరోనా కట్టడి కాకపోగా భయం కలిగించే తీరున పెరుగుతోంది. దీనికి కారణం అధికార యంత్రాంగం నిర్లక్ష్య వైఖరి అని కచ్చితంగా చెప్పాల్సిందే.

టార్గెట్ కదా…

ఇక అధికారులు ఏ రకమైన తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది. జగన్ కరోనా విషయంలో అన్నీ చర్యలూ తీసుకుంటున్నారు. కానీ ఆయన సీరియస్ నెస్ ని మాత్రం ఇటు ప్రజలలో అటు అధికారులలో కలిగించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ తాను స్వయంగా మాస్క్ పెట్టుకోరు, పైగా కరోనా కూడా చిన్న జ్వరం లాంటిదే, వస్తూంటుంది, పోతుంది అన్నట్లుగా తేలిక చేసి మాట్లాడుతున్న మాటలే జనం వింటున్నారు. జగన్ చెప్పే అర్ధం వేరు, కరోనా పేరు ఎత్తితేనే భయపడవద్దు, అందరూ పరీక్షలు చేయించుకోండి అన్న పాజిటివ్ మానర్ లో ఆయన మాట్లాడుతూంటే జనం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. దాంతో కరొనా పాజిటివ్ కేసులు ఎక్కడ చూసినా పెరిగిపోతున్నాయి.

ఆడిట్ లేని అవినీతి ….

కరోనా అన్నది ప్రకృతి వైపరిత్యం. ఈ సమయంలో చేసే ఖర్చుకు లెక్కా జమా ఉండదు, ఏ ఆడిట్ కూడా అసలు ఉండదు, ఇదే సందుగా తీసుకుని కొంతమంది అధికారులు చేస్తున్న చేతివాటం, వారి ఉదాశీన చర్యలు కరోనా మరింత పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఒక వీధిని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తే అక్కడ రాకపోకలను బంద్ చేసే కర్రలు పెట్టడానికి రోజుకు వేయి రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకునే భయంకరమైన అవినీతి కరోనా ఉన్న చోట కేసులు పెరగకుండా ఉంటాయా అన్న చర్చ ఉంది. ఇక కరోనా పేరిట ప్రైవేట్ ఆసుపత్రులు చేసే దందా మరో ఎత్తు. పారసిట్ మాల్ మాత్రలకే వందల్లో బిల్లు రాస్తున్న చరిత్ర చెప్పుకుంటే చాలా ఎక్కువే. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు అధికారుల మీద భారం మోపి కూర్చోవడం వల్ల కూడా అటు కరోనా, ఇటు అవినీతి బాగా పెరిగిపోతున్నాయని అంటున్నారు.

దారుణమే……

ఎవరికైనా కరోనా రావచ్చు. ఇది మామూలు సూత్రం, కానీ జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు రావడం అంటేనే ప్రభుత్వ ప్రతిష్టకు అతి పెద్ద మచ్చగా ఉంది. పైగా ఆయన ఉండేది ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో. మరి అదే ఆసుపత్రి యాజమాన్యం కోవిడ్ సెంటర్ ని విజయవాడ నడిబొడ్డున తీసుకుని చాలా సులువుగా పదిమంది అగ్ని సమాధి అయ్యేలా నిర్లక్ష్యం వహించింది. ఇపుడు తమ వద్ద చికిత్సలో ఉన్న అచ్చెన్నకు కరోనా వచ్చిందంటే బాధ్యత వహించాలి. కానీ ప్రభుత్వం మీదనే ఈ తప్పును తోస్తారు. అది సహజం కూడా. ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే అంతటా వినిపిస్తున్న మాట. ఒక మాజీ మంత్రినే కరోనా నుంచి కాపాడలేని సర్కార్ అని అపుడే తెలుగుదేశం గొంతు చించుకుంటోంది. మరి ఈ నేపధ్యంలో అచ్చెన్నే సాక్షి ఏపీలో కరోనా కట్టుతప్పిందని చెప్పడానికి అని పసుపు పార్టీ రచ్చ చేస్తే జగన్ సర్కార్ దగ్గర జవాబు ఉందా?

Tags:    

Similar News