క‌మ్మ కోట‌లో కాపు రాజ‌కీయం.. వర్కవుట్ అవుతుందా?

క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో కాపు రాజ‌కీయానికి తెర‌దీస్తున్నారు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌. ప్రకాశం జిల్లా ప‌రుచూరులో కొన్ని [more]

Update: 2020-08-12 11:00 GMT

క‌మ్మ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ప్రకాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గంలో కాపు రాజ‌కీయానికి తెర‌దీస్తున్నారు వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్‌. ప్రకాశం జిల్లా ప‌రుచూరులో కొన్ని ద‌శాబ్దాలుగా క‌మ్మ రాజకీయాలు సాగుతున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ పెద్దల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వరావు ఇక్కడ నుంచి వ‌రుస విజ‌యాలు సాధించారు. త‌ర్వాత ఈ స్థానం నుంచి క‌మ్మ ‌వ‌ర్గానికే చెందిన ఏలూరి సాంబ‌శివ‌రావు వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. దాదాపు 40 వేల పైచిలుకు ఉన్న క‌మ్మ ఓటు బ్యాంకు ఇక్కడ నుంచి గెలిచే అభ్యర్థికి కీల‌క ఆయువుప‌ట్టు. ఈ నేప‌థ్యంలోనే ఇక్కడ ఏపార్టీ అయినా క‌మ్మ వ‌ర్గానికి చెందిన నాయ‌కుల‌కు టికెట్లు ఇవ్వడం ప‌రిపాటి.

వరసగా వారికే…..

టీడీపీ ఎలాగూ ఇక్కడ పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి క‌మ్మల‌కే సీటు ఇస్తోంది. ఇక వైఎస్ ఉన్నప్పుడే కాకుండా ఆ త‌ర్వాత జ‌గ‌న్ సైతం 2014లో క‌మ్మ వ‌ర్గానికే చెందిన గొట్టిపాటి భ‌ర‌త్‌.. గ‌త ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుకు సీటు ఇవ్వగా.. వీరిద్దరు ఓడిపోయారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రావి రామ‌నాథం బాబుకు జ‌గ‌న్ సీటు ఇవ్వక‌పోవ‌డంతో టీడీపీలోకి జంప్ చేశారు. తీరా ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో ఆయ‌న తిరిగి వైసీపీలోకి రాగా ఆయ‌న‌కే మ‌ళ్లీ ఇన్‌చార్జ్ ప‌ద‌వితో పాటు డీసీఎంఎస్ చైర్మన్ ప‌ద‌వి కూడా క‌ట్టబెట్టింది.

ఆయనను పక్కన పెట్టి….

అయితే, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ఇక్కడ ఉన్న ఆ పార్టీ ఇంచార్జ్ రావి రామ‌నాథం బాబును ప‌క్కకు పెట్టాల‌ని నిర్ణయించింద‌ని టాక్‌. ఈక్రమంలోనే చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహ‌న్‌కు ఇక్కడి బాధ్యతలు అప్పగించాల‌ని నిర్ణయించిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన ఆమంచి.. ప‌రుచూరులో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధిపత్యం ఎక్కువ‌గా ఉండే చోట ఏవిధంగా రాజకీయాలు చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. పైగా ఆయ‌న దూకుడు స్వభావం గ‌ల నేత‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక‌, ప‌రుచూరులో టీడీపీకి సంస్థాగ‌తంగా తిరుగులేని బ‌లం ఉంది.

టీడీపీకి పటిష్టమైన ఓటు బ్యాంకు…

నియోజ‌క‌వ‌ర్గంలోని ఆరు మండ‌లాల్లో ఒక్క మండ‌లం మిన‌హా మిగిలిన అన్ని మండ‌లాల్లోనూ పార్టీల‌తో సంబంధం లేకుండా క‌మ్మల‌దే ఆధిప‌త్యం. పైగా ఇక్కడ టీడీపీ నుంచి వ‌రుస విజ‌యాల‌తో ఏలూరి దూసుకుపోతున్నారు. క‌మ్మ ఓటింగ్‌లో మెజార్టీ టీడీపీకే సానుకూలం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే మూడేళ్లలో వైఎస్సార్ సీపీని ఇక్కడ బలోపేతం చేయ‌డం అంటే.. ఆమంచికి అంత చిన్న విష‌యం కాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అనేక ఒడిదుడుకులు, ఎత్తుల‌కు పై ఎత్తులు వేయ‌గ‌లిగితేనే ఆయ‌న ఇక్కడ కుదురుకుంటార‌ని చెబుతున్నారు.

చీరాల నుంచి తప్పించి…..

విచిత్రం ఏంటంటే చీరాల‌లో క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్సెస్ ఆమంచి కృష్ణమోహ‌న్ మ‌ధ్య వార్ స‌ర్దుబాటు చేసేందుకు జ‌గ‌న్ ఈ రాజీ ఫార్ములా అమ‌లు చేస్తున్నార‌ట‌. ఆమంచి మాత్రం క‌మ్మ వ‌ర్గం ఓటింగ్ ఎక్కువుగా ఉన్న ప‌రుచూరుకు క‌ర‌ణం బ‌ల‌రాం అయితేనే క‌రెక్ట్ అని.. తన‌కు చీరాలే ఇవ్వాల‌ని కోరుతున్నా. అధిష్టానం ప్రస్తుతం బ‌ల‌రాం చీరాల‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న్నే చీరాల‌లో కొన‌సాగిస్తూ ఆమంచినే ప‌రుచూరుకు పంపాల‌ని డిసైడ్ అయ్యిందంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రుచూరు క‌మ్మ రాజ్యంలో ఆమంచి కాపు రాజ‌కీయం ఎలా సాగుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే, ప్రభుత్వ పార్టీగా వైఎస్సార్ సీపీ మాత్రం తాము ప్రవేశ పెట్టిన ప‌థ‌కాలే త‌మ‌కు శ్రీరామ ర‌క్షగా మార‌తాయ‌ని న‌మ్ముతున్నట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News