జంపింగుల‌నే న‌మ్ముతున్న జ‌గ‌న్‌.. కొంప మునిగిపోదూ

రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌న్న వైఎస్సార్ సీపీ నేత‌ల క‌ల‌లు ఫ‌లించాయి. జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌న్న వారి ఆశ‌లు కూడా నెర‌వేరాయి. ఏడెనిమిదేళ్ల పాటు జ‌గ‌న్ కోసం కొన్ని [more]

Update: 2020-08-11 11:00 GMT

రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌న్న వైఎస్సార్ సీపీ నేత‌ల క‌ల‌లు ఫ‌లించాయి. జ‌గ‌న్‌ను సీఎంగా చూడాల‌న్న వారి ఆశ‌లు కూడా నెర‌వేరాయి. ఏడెనిమిదేళ్ల పాటు జ‌గ‌న్ కోసం కొన్ని వంద‌ల మంది నేత‌లు క‌ష్టప‌డ్డారు. వీరంతా పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే త‌మ కోరిక నెర‌వేరుతుంద‌ని అనుకున్నారు. అయితే, ఈ ఆనందం, ఈ సంతోషం.. పెద్దగా ఎక్కువ కాలం నిల‌వ‌లేక‌పోవ‌డమే ఇప్పుడు చ‌ర్చకు దారితీస్తున్నా యి. దీనికి ప్రధాన కార‌ణం.. పార్టీ కోసం ఎవరైతే.. ఎక్కువ‌గా క‌ష్టప‌డ్డారో.. జ‌గ‌న్ కోసం ఎవ‌రైతే త్యాగాలు చేశారో..వారిని ప‌క్కన పెట్టి.. నిన్నగాక మొన్న పార్టీలోకి వ‌చ్చిన వారికి, నిన్నగాక మొన్న రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారికి జ‌గ‌న్ ప‌ద‌వులు ఇస్తుండ‌డం వారికి ప్రాధాన్యం క‌ల్పిస్తుండ‌డాన్ని సీనియ‌ర్లు త‌ప్పుబడుతున్నారు.

సీనియర్లు కాదని…..

ఇటీవ‌ల రెండు మంత్రి వ‌ర్గ సీట్లు ఖాళీ అయితే, ఈ రెండిలోనూ కొత్తవారికి అవ‌కాశం ఇచ్చారు. కానీ, అప్పటికే ఉన్న సీనియ‌ర్ మోస్ట్‌లు పార్టీలో ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్లు క‌నీసం ఓ 25 మంది వ‌ర‌కు రెండు నుంచి ఐదుసార్లు గెలిచి మంత్రి ప‌ద‌వి ఆశిస్తోన్న వారు కూడా ఉన్నారు. ఇక మిగిలిన సామాజిక వ‌ర్గాల్లోనూ మంత్రి ప‌ద‌వులు ఆశించే వారి సంఖ్య ఎక్కువే ఉంది. ఇటీవ‌ల మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన చెల్లుబోయిన వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి వ‌చ్చారు. ఆయ‌న ఎటు గాలివీస్తే.. అటు వెళ్తార‌నే ప్రచారం కూడా ఉంది. తూర్పుగోదావ‌రి జిల్లాలో కాపుల‌ను త‌ట్టుకుని బ‌ల‌మైన శెట్టిబ‌ల‌జ వ‌ర్గాన్ని ఏక‌తాటిమీద‌కు తీసుకువ‌చ్చే స‌త్తా వేణుకు ఏ మాత్రం లేద‌ని ఆయన వ‌ర్గం వారే చర్చించుకుంటోన్న ప‌రిస్థితి.కానీ, ఈయ‌న‌కు జ‌గ‌న్ పెద్దపీట వేశారు.

సొంత సామాజిక వర్గ నేతలే…

మ‌రో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప‌ట్టుమ‌ని ఐ‌దేళ్లు కూడా కాలేదు. అయిన‌ప్పటికీ.. జ‌గ‌న్ ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. కానీ, వీరిద్దరిక‌న్నా సీనియ‌ర్లు, పార్టీ కోసం ఎంతో కృషి చేసిన వారు చాలా మంది ఉన్నారు. వీరిని కాద‌ని కొత్తవారిని జ‌గ‌న్ భుజాల‌కు ఎత్తుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. జ‌గ‌న్ తీసుకుంటోన్న ఈ నిర్ణయాల‌తోనే సొంత పార్టీలోనే ఎంతో మంది నేత‌లు ర‌గిలిపోతోన్న ప‌రిస్థితి. మ‌రో చ‌ర్చ ఏంటంటే జ‌గ‌న్ సామాజిక వ‌ర్గ నేత‌లే జ‌గ‌న్ కంటే చంద్రబాబే న‌యం.. మాకు బాగా ప్రయార్టీ ఇచ్చార‌ని కూడా చ‌ర్చించుకుంటున్నారు. ఇక ఇలాంటి చ‌ర్యల వ‌ల్లే పార్టీ నాశ‌నం అవుతుంద‌ని వైసీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు.

వారి అవసరం ఉందా?

దీనికి గ‌త చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు. గ‌తంలో చంద్రబాబు కూడా ఇలానే కొత్తవారిని కౌగిలించుకుని, సొంత‌వారిని దూరం పెట్టార‌ని, ఫ‌లితంగా పార్టీ ప‌రిస్థితి దారుణ‌మైన ప‌రిస్థితిలో వారెవ‌రూ ఆయ‌న‌కు అండ‌గా నిల‌వ‌లేక‌పోతున్న విష‌యాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక‌, ఇప్పుడు విశాఖ‌లో అవ‌స‌రం లేకున్నా.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావును జ‌గ‌న్ ఎందుకు పిలుస్తున్నారో.. అర్ధం కావ‌డం లేద‌ని మంత్రి అవంతి శ్రీనివాస‌రావు వంటి వారు కూడా అంటున్నారు. వాస్తవానికి అవంతి శ్రీనివాస‌రావు కూడా టీడీపీ నుంచి వ‌చ్చి మంత్రి పీఠం ద‌క్కించుకున్నవారే. ఇక‌, ఇటీవ‌ల ఎమ్మెల్సీ అయిన పండుల ర‌వీంద్ర కూడా నిన్న మొన్నటి వ‌ర‌కు టీడీపీ బాకా ఊదారు. ఇలాంటి నేత‌ల‌కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వడం వ‌ల్ల పార్టీ ప‌రిస్థితి రేపు ఏమ‌వుతుందో ఆలోచించుకోవాల‌ని సీనియ‌ర్లు అంటుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News