దానిపై జ‌గ‌న్ ఆరా… బ‌లం.. బ‌ల‌హీన‌త‌ల‌పై ఫోక‌స్‌

ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌, దృష్టి అంతా కూడా రాజ‌ధాని త‌ర‌లింపుపైనే ఉంది. అమ‌రావ‌తి నుంచి పాల‌నా రాజ‌ధానిని త‌ర‌లించ‌డం ద్వారా ఎంత [more]

Update: 2020-08-10 06:30 GMT

ప్రస్తుతం వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న‌, దృష్టి అంతా కూడా రాజ‌ధాని త‌ర‌లింపుపైనే ఉంది. అమ‌రావ‌తి నుంచి పాల‌నా రాజ‌ధానిని త‌ర‌లించ‌డం ద్వారా ఎంత త్వర‌గా వీలైతే.. అంత త్వర‌గా విశాఖ‌కు వెళ్లిపోవాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 3 పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్న గుంటూరు ప్రజ‌లు.. ఇప్పుడు ప్రత్యక్షంగా ప‌రోక్షంగా కూడా అమ‌రావ‌తి విష‌యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి మారిస్తే.. ప‌రిస్థితులు ఎలా మార‌తాయి ? ఇక్కడి నాయ‌కులు ఏమేర‌కు బ‌లంగా ఉన్నారు. రేపు అమ‌రావ‌తిలో పాల‌నా కార్యాల‌యాలు పూర్తిగా వైజాగ్ త‌ర‌లిస్తే … అప్పటి ప‌రిస్థితి ఏంటి ? అనే విష‌యాపై చ‌ర్చ పెడుతున్నారు.

కొత్తగా ఎన్నికైన…

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో సీనియ‌ర్లు ఉన్నప్పటికీ.. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. బాప‌ట్ల ఎంపీ, న‌ర‌సారావుపేట ఎంపీలు ఇద్దరూ రాజ‌కీయాలు కొత్తే. అదేవిధంగా ఎమ్మెల్యేలు నంబూరు శంక‌ర్రావు, విడ‌ద‌ల ర‌జ‌నీ, కిలారు రోశ‌య్య, ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, కాసు మహేష్ రెడ్డి, అన్నాబ‌త్తుని శివ‌కుమార్ వంటి వారు చాలా మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఇప్పుడు వీరంతా ఎదురీత ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు. స్థానికంగా ఉన్న సీనియ‌ర్లను క‌లుపుకొని వెళ్లడంలోను, ప్రజ‌ల‌తో క‌లిసి ముందుకు సాగ‌డంలోను కూడా ఈ నాయ‌కులు విభేదిస్తున్నారు. ఇక‌, అభివృద్ది ప‌నులు కూడా ఎక్కడివ‌క్కడే ‌సాగుతున్నాయి.

తట్టుకుని నిలబడేదెందరు?

ఈ నేప‌థ్యంలో రేపు అమ‌రావ‌తి ఎఫెక్ట్ త‌గిలినా.. త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగేవారు ఎవ‌రు? ఎలా ముందుకు సాగుతారు ? ఎవ‌రి లోపాల‌ను ఎక్కడ ఎలా సెట్ చేయాల‌నే దానిపై జ‌గ‌న్ పార్టీ కీల‌క నేత స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ద్వారా ఆరా తీయిస్తున్నార‌ట‌. ముఖ్యంగా కొత్తగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు ప్రజ‌ల‌తో మ‌మేకం అవుతున్న తీరు కూడా జ‌గ‌న్‌కు న‌చ్చడం లేద‌ని స‌మాచారం. దీనికి తోడు జిల్లాల అమ‌రావ‌తి త‌ర‌లింపుపై ఉన్న వ్యతిరేక‌త కూడా తోడు అయితే పార్టీకి ఎదురు దెబ్బలు త‌ప్పవా ? పార్టీకి డ్యామేజ్ జ‌రిగినా దానిని ఎంత మంది ఎమ్మెల్యేలు సెట్‌రైట్ చేస్తార‌న‌న్నదానిపై జ‌గ‌న్ పార్టీ ముఖ్యనేత‌ల‌తో పాటు జిల్లాకు చెందిన త‌న‌కు న‌మ్మక‌స్తులు అయిన ఒక‌రిద్దరు నేత‌ల‌తో స‌మాలోచ‌న‌లు చేస్తున్నార‌ట‌.

మార్పులు ఉంటాయా?

ఈ క్రమంలోనే జగన్ గుంటూరు జిల్లాలోని మొత్తం అన్ని వైఎస్సార్ సీపీ నేత‌ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన హిస్టరీని తెప్పించుకున్నార‌ని, దానిని ప‌రిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని అంటున్నారు. మ‌రి ఈ క్రమంలో ఇక్కడ పార్టీపై ప్రజ‌ల‌తో పాటు సొంత కేడ‌ర్‌లో ఉన్న వ్యతిరేక‌త‌ను కూల్ చేసేందుకు సీనియ‌ర్లకు ప‌గ్గాలు అప్పగిస్తారా ? ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు ? అనే విష‌యాలు పార్టీలోను, ప్రభుత్వంలోను జిల్లా నేత‌ల్లోనూ చ‌ర్చకు దారితీస్తున్నాయి. ఏదేమైనా గుంటూరులో పార్టీ ప‌రంగా జ‌రిగే మార్పులు, చేర్పులు అన్నీ కూడా సజ్జ‌ల ఇచ్చే రిపోర్టు ఆధారంగానే ఉంటాయంటున్నారు.

Tags:    

Similar News