టీడీపీ నుంచి వచ్చిన నేతలకు మంచి ఫ్యూచర్… కీలక బాధ్యతలు

అమ‌రావ‌తి ఎఫెక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా ? ప‌్రజ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డం ఎలా ? ఇప్పుడు ఈ ప్రశ్నలే వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను వేధిస్తున్నాయి. [more]

Update: 2020-08-10 03:30 GMT

అమ‌రావ‌తి ఎఫెక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా ? ప‌్రజ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోవ‌డం ఎలా ? ఇప్పుడు ఈ ప్రశ్నలే వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను వేధిస్తున్నాయి. అమ‌రావ‌తి ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం లేక‌పోయినా.. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల‌పై ఎక్కువ‌గా ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లోనూ పార్టీని ప‌రుగులు పెట్టించాలంటే.. బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం. ముఖ్యంగా అమ‌రావ‌తి పేరుతో ప్రతిప‌క్షం చేసే విమ‌ర్శల‌కు చెక్ పెట్టే సామ‌ర్థ్యం ఉన్న నాయ‌కులు ఇప్పుడు చాలా అవ‌స‌రం. అంతేకాదు, చంద్రబాబు సామాజిక వ‌ర్గానికి చెందిన క‌మ్మ నేత‌ల‌ను రంగంలోకి దింపితే.. కొంత‌మేర‌కు పార్టీకి ఎదుర‌వుతున్న ఎదురు గాలుల‌ను త‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు.

ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా….

ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీలో ఉన్న ఈ మూడు జిల్లాల‌కు చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఎన‌లేని ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అమ‌రావ‌తి ఎఫెక్ట్ స‌హా సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న పార్టీ క‌మ్మలకు వ్యతిరేకం అనే వాదాన్ని కూడా తుడిచి పెట్టేయాల‌ని ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ మూడు జిల్లాల్లోని క‌మ్మల‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేద‌నే అనాలి. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నానికి మంత్రిగా ప‌ద‌వి ఇచ్చినా.. ఆయ‌న దురుసు వ్యాఖ్యల‌తో సాధార‌ణ ప్రజ‌ల్లో నిర్మాణాత్మక నాయ‌కుడిగా ఎదగ‌లేక పోయారు. ఆయ‌న త‌న మాస్ డైలాగుల‌తో పార్టీకి ప్లస్ అవుతున్నా… ఆయ‌న‌కు త‌ప్ప పార్టీలో మ‌రే క‌మ్మ నేత‌కు ప్రయార్టీ ఉండ‌డం లేద‌న్న టాక్ కూడా కామ‌న్ వ‌ర్గాల్లో వినిపించింది. దీంతో పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్పటి నుంచి క‌మ్మల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌నే వాద‌న అలానే ఉంది.

వారికి ప్రాధాన్యత…..

దీనికి తోడు క‌మ్మ వ‌ర్గానికి చెందిన గుంటూరు జిల్లా నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్న జ‌గ‌న్ ఆ హామీని కూడా నిల‌బెట్టుకోలేదు. ఇది కూడా ఈ వ‌ర్గంలో పార్టీ ప‌ట్ల కాస్త వ్యతిరేక‌త‌కు కార‌ణ‌మైంది. ఈ నేప‌థ్యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ నేత‌ల‌ను మ‌రింత మందిని వైఎస్సార్ సీపీలోకి తీసుకురావాల‌ని జగ‌న్ బ‌లంగా డిసైడ్ అయ్యార‌ట‌. ఇక ఇప్ప‌టికే ఉన్న క‌మ్మ నేత‌ల‌కు మ‌రింత ప్రాధాన్యం ఇవ్వాల‌ని, వారితో నిర్మాణ‌త్మకంగా మాట్లాడించాల‌ని, ప్రతిదాడి చేయ‌డంలోనూ ప్రవీణులైన నాయ‌కులుగా గుర్తింపున్న నేత‌ల‌ను ఏరికోరి కొన్ని బాధ్యత‌లు అప్పగించాల‌ని భావిస్తున్నారు.

వీరి చేతనే కౌంటర్లు….

వీరిలో గ‌న్నవ‌రం ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేని వంశీ, చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి భ‌ర‌త్‌తో పాటు విజ‌య‌వాడ న‌గ‌రంలో యువ‌నేత దేవినేని అవినాష్ లాంటి వారిని రంగంలొకి దింపి.. వారితోనే ప్రభుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శల‌కు చెక్ పెట్టేలా వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో మ‌ర్రికి గుంటూరు ప్రాంతీయాభివృద్ధి మండ‌లి చైర్మన్ ( కేబినెట్ హోదా) క‌ట్టబెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. మొత్తానికి జ‌గ‌న్ వ్యూహం బాగున్నా.. ఏమేర‌కు వ‌ర్కువ‌ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News