జగన్ రోల్ మోడల్ అవుతారా ?

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా> ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్న. ఇదే ప్రశ్నను ఆయన ఒకే భాష మాట్లాడే రాష్ట్రం ఎక్కడైనా రెండు ముక్కలు [more]

Update: 2020-08-08 15:30 GMT

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా> ఇది టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్న. ఇదే ప్రశ్నను ఆయన ఒకే భాష మాట్లాడే రాష్ట్రం ఎక్కడైనా రెండు ముక్కలు అయిందా అని కూడా వేశారు. చివరికి తెలంగాణా, ఆంధ్రా విడిపోవడానికి ఇదే చంద్రబాబు లెటర్ కూడా ఇచ్చారు. ఇపుడు పదమూడు జిల్లాల ఏపీకి మూడు రాజధానులు ఏంటి అంటున్నారు. కానీ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా వికేంద్రీకరణ మంత్రమే పనిచేస్తోందని అవుట్ డేటెడ్ పొలిటీషియన్ చంద్రబాబు గ్రహించడంలేదని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ కి జనం భారీ మెజారిటీ ఇచ్చింది చంద్రబాబు చేసిన తప్పులు కొనసాగించమని కాదని గట్టిగా రిటార్ట్ ఇస్తున్నారు.

ఇదే విధానమా..?

జగన్ ఏపీలో కేవలం ఏడాది కాలంలో అనేక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు అతి ముఖ్యం. అలాగే పాలనా వికేంద్రీకరణ కోసం మూడు రాజధానులు ప్రతిపాదన తెచ్చారు. దీని వల్ల అన్ని చోట్ల అభివ్రుధ్ది సాధ్యమవుతుంది అన్నది జగన్ ఆలోచన. అయితే జగన్ ఎనిమిది నెలల క్రితం ఈ ప్రతిపాదన చేయడంతోనే పొరుగున ఉన్న కర్నాటక రెండవ రాజధాని ప్రతిపాదన చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తమిళనాడులో కూడా చెన్నై తో పాటు తిరుచ్చిని మరో రాజధాని చేయాలనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా రెండవ రాజధానికి ఆమోదం తెలిపింది. ఇక జార్ఖండ్ అయితే ఏకంగా అయిదు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది.

ఎపుడూ ముప్పే ……

నిజానికి పెద్ద నగరాలు ఎపుడూ ముప్పేనని మేధావులు, సామాజిక పరిశోధకులు చెబుతూనే ఉన్నారు. ఒక్క చోటనే జనాభా పోగుపోసినట్లుగా ఉంటే తాగు నీటి నుంచి అన్ని కష్టాలు వస్తాయని కూడా అంటున్నారు. ఇక రాజధానులే కాదు నగరాల మీద వత్తిడి తగ్గించాలంటే వీలున్న చోట వికేంద్రీకరణ చేసుకుంటూ పోవడమే మేలు అంటున్నారు. ఇపుడు కరోనా వంటి మహమ్మారి వచ్చింది. ఇది ఎక్కువగా మెట్రో సిటీలను పట్టి పీడిస్తోంది. జనసాంధ్రత వల్లనే ఇలా వైరస్ ఎవరూ నియంత్రించలేని స్టేజికి చేరుకుంది అంటున్నారు. అందువల్ల ఫ్యూచర్లో వికేంద్రీకరణ దేశంలో ఇంకా బలంగా వినిపిస్తుందని కూడా చెబుతున్నారు.

జగనే ఆద్యుడా …?

నిజానికి జగన్ ఏపీలాంటి చోట, రాజకీయంగా టీడీపీకి పట్టున చోట అమరావతిని కదల్చి అతి పెద్ద రిస్క్ చేశారు. కాబట్టే ఇది పెద్ద విషయంగా ఉంది. అయితే ఈ తరహా ప్రతిపాదన మాత్రం పాతదేనని మేధావులు అంతున్నారు. అంతెందుకు 2014 ఎన్నికలకు ముందు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ నినాదం కూడా ఇదే. ఢిల్లీ వారు ఏపీకి రాజధాని ఫలనా చోట‌ పెట్టుకోమని చెప్పడమేంటి, మనమే ఏపీని అభివృధ్ధి చేసుకుందాం, వికేంద్రీకరణతో ఎక్కడికక్కడ రాజధానులు పెడతామని ఆయన చెప్పారు. పారిశ్రామిక రాజధాని, అర్ధిక రాజధాని ఇలా చాలానే చెప్పారు. ఇక మేధావులు కూడా స్థానిక వనరులు చూసుకుని అక్కడ పరిశ్రమలు పెడితే జనాలు అంతా ఒకే చోటకు ఉపాధి కోసం రారు అని అంటున్నారు. ఇపుడు జగన్ లాంటి బలమైన నాయకుడు సీఎం కావడంతో ఏపీలో అంకురార్పణం జరిగిందని, భవిష్యత్తులో దేశమంతా ఆయన్ని అనుసరిస్తుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News