మొండితనంలో నాలుగాకులు ఎక్కువే?

చరిత్ర సృష్టించాలంటే కాలం కలసిరావాలి. అలాగే గట్స్ కూడా ఉండాలి. దాన్ని మొండి అని కూడా అనుకోవచ్చు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు మొండిగా ఉండాలి. [more]

Update: 2020-08-01 03:30 GMT

చరిత్ర సృష్టించాలంటే కాలం కలసిరావాలి. అలాగే గట్స్ కూడా ఉండాలి. దాన్ని మొండి అని కూడా అనుకోవచ్చు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు మొండిగా ఉండాలి. అప్పట్లో ఎన్టీయార్ ఉమ్మడి ఏపీలో తాలూకాల వ్యవస్థను రద్దు చేసినపుడు ఎన్ని గొంతులు వ్యతిరేకంగా లేచాయి. ఎంత రాజకీయం నడిచింది. మండలాల వ్యవస్థ తీసుకువచ్చి ఎన్టీయార్ పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. తాను రాజకీయాల్లోకి వచ్చిన అర్ధం పరమార్ధం తెలియచేశాడు. ఇక కరణాలు, మునసబులను సీఎం సీట్లోకి వస్తూనే తీసేసి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ ని ఖతం చేసి పారేశారు. ఇక ఇపుడు జగన్ కి ఆ అవకాశం దక్కింది. జగన్ మొండితనంలో ఎన్టీయార్ కంటే నాలుగాకులు ఎక్కువే చదివాడు.

నవ్య చరిత్రకు …..

ఉమ్మడి ఏపీ రెండుగా చీలిపోయింది. తెలంగాణాకు భాగ్యనగరం ఉంది. ఏపీకి మాత్రం రాజధాని లేదు, ఆ సదవకాశం తొలి ముఖ్యమంత్రికే సహజంగా ఉంటుంది. చంద్రబాబు అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అమరావతి అంటూ గాలి మేడలు కట్టి చివరకు చేతులెత్తేశారు. జగన్ చేతికి బంగారం లాంటి చాన్స్ ఇచ్చేశారు. అది ఇపుడు చక్కగా వాడుకుంటున్నాడు జగన్. ఆ విధంగా 2014లో సీఎం కాకపోయినా 2019 నాటికి తనకు అందివచ్చిన అవకాశాలను వాడుకుని నవ్యాంధ్రాకు సరికొత్త చరిత్రను జగన్ తిరగ‌ రాస్తున్నారు.

మూడుతో మూడేదే ……

ఇక మూడు రాజధానులను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా జగన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి బాటలు వేసుకోబోతున్నారు. అంతే కాదు, జగన్ తీసుకున్న ఈ అతి పెద్ద నిర్ణయం ద్వారా తరతరాలు చరిత్ర పేజిల్లో తనకంటూ ఒకటి కేటాయించుకున్నవారు అవుతారు. ఒక విధంగా ఏపీ మళ్ళీ విడిపోకుండా ఉండాలంటే ఇంతకు మించిన చిట్కా వేరొకటి లేదు కూడా. ఆ విధంగా ఆలోచించినపుడు జగన్ దూరదృష్టి స్పష్టం అవుతోంది. అలాగే అమరావతి చంద్రబాబులను పూర్తిగా పక్కకు నెట్టేసి జగన్ ఏపీ రాజకీయాల్లో కొత్త శకానికి శ్రీకారం చుట్టిన వారుగా కూడా చెప్పుకోవాల్సిందే. ఈ మూడు రాజధానులతో విపక్ష రాజకీయానికి మూడినట్లేనని కూడా అంటున్నారు.

వెన్నెముక విరిగినట్లే…….

రాజకీయంగా చూసుకుంటే టీడీపీ వెన్నెముక విరిగినట్లేనని చెప్పాలి. టీడీపీ 2050 వరకూ లెక్కలేసుకుని పక్కాగా రూపొందించుకున్న అమరావతి పధకం ఇపుడు ఆరిపోయి నీరికారుతోంది. అదే పునాదిగా చేసుకుని నిర్మించుకోవాలనుకున్న రాజకీయ, సామాజిక, ఆర్ధిక భవనాలు కూడా ఒక్క దెబ్బకు కుప్పకూలనున్నాయి. ఓ విధంగా టీడీపీకి నడ్డి విరిచినట్లేనని భావిస్తున్నారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలలో వైసీపీ జెండా పది కాలాల పాటు ఎగిరేలా జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే మరిన్ని సార్లు ఆయనే ఏపీ సీఎం గా ఉంటారనడంలో సందేహం లేదు. ఇప్పటికే మెగాసిటీగా ఉన్న విశాఖను 2024లోగా మరింతగా అభివ్రుధ్ధి చేయడం జగన్ కి కష్టసాధ్యం కాబోదు. అది తెలిసే టీడీపీ అడ్డుకోవాలని చూసినా అడ్డంగా బుక్ అయిపోయింది.

Tags:    

Similar News